Begin typing your search above and press return to search.

గళమెత్తితే కొరడా తీస్తారా.. ఇదేం న్యాయం

By:  Tupaki Desk   |   25 Oct 2016 6:48 AM GMT
గళమెత్తితే కొరడా తీస్తారా.. ఇదేం న్యాయం
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్ర సంక్షేమం కోరుతూ ప్రత్యేక హోదా సాధించడం కోసం.. శాసనసభలో గళమెత్తితే.. వారి మీద వేటు వేయడమే లక్ష్యం అన్నట్లుగా కొరడా తీయడం అధికార పార్టీ దురహంకారానికి నిదర్శనంగా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు. వర్షాకాల సమావేశాల్లో వైకాపా ఎమ్మెల్యేలు సభలో సాగించిన ప్రత్యేక హోదా పోరాటానికి సంబంధించి 12 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ తాకీదులు పంపిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ప్రకారం.. ఇవాళ రేపు ఆరుగురు వంతున ఎమ్మెల్యేలు సభా హక్కుల కమిటీ ముందు విచారణ ఎదుర్కొనబోతున్నారు.

కాల్ మనీ కేసులో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసినందుకు ఎమ్మెల్యే రోజాను ఏడాదిపాటు సభలో అడుగు పెట్టకుండా చేసిన రీతిలోనే.. ప్రత్యేకహోదా విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకు ఈ ఎమ్మెల్యేల మీద కూడా కొరడా ఝుళిపించాలని అనుకుంటున్నట్లుగా ఉన్నదని జనం విమర్శిస్తుండడం విశేషం.

అయితే వైకాపా ఎమ్మెల్యేలు మాత్రం తమ ధోరణి విషయంలో దృఢంగానే ఉన్నారు. తామేమీ తప్పు చేయలేదనే వాదనకే కట్టుబడి ఉన్నారు. ఒకవేళ సభలో తమ ప్రవర్తన పట్ల భిన్నాభిప్రాయాలు ఉంటే గనుక.. తొలుత క్రమశిక్షణ కమిటీకి నివేదించకుండా.. డైరక్టుగా.. హక్కుల కమిటీ విచారణకు పిలవడం అనే ప్రక్రియలోనే కుట్ర దాగి ఉన్నదని.. ఇలాంటి కుట్రలకు తాము జడిసేది లేదని వారు అంటున్నారు. తమ పార్టీ వారందరినీ కూడా సభలో లేకుండా వేటు వేసినా.. సరే.. హోదా కోసం - రాష్ట్రం కోసం - ప్రజల కోసం తమ పోరాటం సాగుతుందని వారు అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/