Begin typing your search above and press return to search.

12 మందిని పొట్ట‌న పెట్టుకున్న దేవుడి ప్ర‌సాదం!

By:  Tupaki Desk   |   15 Dec 2018 4:12 AM GMT
12 మందిని పొట్ట‌న పెట్టుకున్న దేవుడి ప్ర‌సాదం!
X
దారుణం జ‌రిగిపోయింది. ప‌ర‌మ ప‌విత్రంగా భావించే దేవుడి ప్ర‌సాదం ప్రాణాల్ని తీసింది. అది కూడా ఒక‌రో.. ఇద్ద‌రో కాదు.. ఏకంగా ప‌న్నెండు మంది. దేవుడి ప్ర‌సాదాన్ని తీసుకున్న వారిలో 12 మంది మృత్యువాత ప‌డ‌గా.. పెద్ద ఎత్తున భ‌క్తులు ఆసుప‌త్రిలో చికిత్స పొందాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. ఇంత‌కీ అదేం గుడి? అక్క‌డేం ప్ర‌సాదం పెట్టారు? ఎందుకింత పెద్ద ఎత్తున ప్రాణాలు పోయాయి? అన్న విష‌యాల్ని చూస్తే..

తెలుగు రాష్ట్రాల‌కు ప‌క్క‌నే ఉండే క‌ర్ణాట‌క‌లో ఈ ఘోరం చోటు చేసుకుంది. చామ‌రాజ‌న‌గ‌ర్ జిల్లా హ‌నూరు తాలూకా సుళివాడి గ్రామంలో మారెమ్మ పేరిట గుడి ఉంది. ఆల‌య గోపుర నిర్మాణానికి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌టానికి గ్రామంతో పాటు.. చుట్టుప‌క్క‌ల గ్రామాల వారు భారీగా జ‌మ‌య్యారు.

శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం పూర్తి అయిన త‌ర్వాత‌.. ప్ర‌సాదం కింద రైస్ బాత్ తో త‌యారు చేసిన ప్ర‌సాదాన్ని పంపిణీ చేశారు. దేవుడి ప్ర‌సాదం.. చాలాసేపు కార్య‌క్ర‌మంలో ఉండ‌టంతో.. ప్ర‌సాదాన్ని ఎక్కువ‌మంది తిన్నారు. అలా తిన్న కాసేప‌టికే ప‌లువురు వాంతులు చేసుకోవ‌టం.. స్పృహ త‌ప్పిప‌డిపోయారు. అనుకోని విధంగా చోటు చేసుకున్న ఈ ప‌రిణామంతో ఉలిక్కి ప‌డిన అక్క‌డి వారు.. అస్వ‌స్థ‌త‌కు గురైన వారిని హుటాహుటిన ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ప్ర‌సాదం తిని అనారోగ్యానికి గుర‌య్యారో.. వారిలో చికిత్స పొందుతూ 12 మంది మృత్యువాత ప‌డ్డారు. మ‌రో 80 మంది వ‌ర‌కూ అస్వ‌స్థ‌త‌కు గురై ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

ఎందుకిలా జ‌రిగింది? ఎంత ప్ర‌సాదం పాడైతే మాత్రం ఇంత పెద్ద ఎత్తున మ‌ర‌ణాలు చోటు చేసుకుంటాయా? అన్న ప్ర‌శ్న‌పైన పోలీసులు విచారించారు. ఈ సంద‌ర్భంగా వెలుగు చూసిన వాస్త‌వం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే.. ప్ర‌సాదాన్ని త‌యారు చేసే సంద‌ర్భంగా దేవాల‌య క‌మిటీకి చెందిన స‌భ్యుల మ‌ధ్య‌నున్న విభేదాల‌తో ప్ర‌సాదంలో కిరోసిన్ తో పాటు.. పురుగుల మందును క‌లిపార‌ని తేలింది. విష‌పూరితంగా మారిన రైస్ బాత్ తిన్నంత‌నే ఇంత పెద్ద ఎత్తున ప్రాణాలు పోయిన‌ట్లుగా గుర్తించారు. మ‌రింత స‌మాచారంతో కోసం పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. ప్ర‌సాదం తిని పెద్ద ఎత్తున ప్రాణాలు పోయిన బాధిత కుటుంబాల‌కు క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి రూ.5 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు.