Begin typing your search above and press return to search.

మోడీ పూజలో మునుగుతున్న భాజపా!

By:  Tupaki Desk   |   14 Sep 2017 4:11 AM GMT
మోడీ పూజలో మునుగుతున్న భాజపా!
X
భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధాంతాల పార్టీ అనే ట్యాగ్ లైన్ ను చెరిపేసుకుని - సాంప్రదాయ కాంగ్రెస్ పార్టీ బాటలోకే అడుగు పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. సిద్ధాంతాలకు అగ్రప్రాధాన్యం దక్కవలసిన స్థానే.. ఈ పార్టీలో కూడా వ్యక్తిపూజ ప్రధానంగా వర్ధిల్లే సూచనలు పెరుగుతున్నాయి. మోడీ ప్రధాని అయిన నాటినుంచి వ్యక్తిపూజ అనేది ఇక్కడ కూడా నిత్యకృత్యం అయిపోయింది. కాకపోతే.. ఇప్పుడు మోడీ జన్మదినం రాబోతున్న నేపథ్యంలో.. ఇలాంటి పోకడలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ఈసారి మోడీ జన్మదినం నాడు.. లక్నోలో 110 అడుగుల మోడీ కటౌట్ ఏర్పాటు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను చూస్తే అలాగే అనిపిప్తోంది. గతంలో ఇలాంటి భారీ కటౌట్ లు - కాన్షీరాం - మాయావతి - ములాయం వంటి నాయకులకు మాత్రమే ఏర్పాటయ్యాయని తెలిస్తే భాజపా కూడా ఏ బాటలో పయనిస్తున్నదో అర్థమౌతుంది.

గతంలో వాజపేయి కూడా ఈ దేశానికి ప్రధానిగా పనిచేశారు. కానీ భాజపా సిద్ధాంతాల పునాది మీదనే ఆ ప్రభుత్వం నడిచింది. అంతే తప్ప వ్యక్తి పూజ ఎన్నడూ గాడి తప్పలేదు. వ్యక్తిగతంగా మూర్తీభవించిన నైతిక విలువలుగా వాజపేయి ఉన్నప్పటికీ.. ఆయనను భజన చేసే సంస్కృతి పరిఢవిల్లలేదు.

కానీ మోడీ ప్రధాని అయిన తర్వాత పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. మోడీని భగవత్ స్వరూపంగా కీర్తిస్తూ ఉంటే చాలు.. భాజపాలో తమకు మంచి రోజులు ఉంటాయని అనుకునే బాపతు జనం పెరిగారు. మోడీ కూడా అలాంటి భజనపరులకు ఆస్కారం కల్పిస్తున్నారు గనుకనే.. ఈ పోకడలు పెరుగుతున్నాయనేది పలువురి అభిప్రాయంగా ఉంటోంది. మోడీ కూడా పార్టీ కంటె మిన్న అయిన శక్తిగా తనను ప్రొజెక్ట్ చేసుకోవడానికి అనుగుణంగా శ్రేణులను ప్రేరేపిస్తున్నారు.

ఇలాంటి భజన పరుల పోకడలు అధికారం చెంత ఉన్నంత వరకు మాత్రమే ఉంటాయనే వాస్తవం మోడీ కి తెలియనిది కాకపోవచ్చు. ఇవాళ ఆయన 110 అడుగుల కటౌట్ ఏర్పాటు చేస్తున్న వారు అధికారం దూరమైతే.. అసలు పట్టించుకోకపోవచ్చు.

అయినా మోడీ వంటి విజ్ఞత గల నాయకులు ఇలాంటి వ్యక్తిపూజలను ప్రోత్సహించకుండా ఉంటే పార్టీకి మంచిది. ఇలాంటివి పెరిగితే.. కాలక్రమంలో వ్యక్తిపూజ మాత్రమే తమ పార్టీ రాజ్యాంగంగా ప్రవర్తిస్తూ ప్రజల దృష్టిలో పలుచన అయిపోయిన కాంగ్రెస్ మాదిరిగానే భాజపా కూడా తయారవుతుంది.