స్వామిగౌడ్ ఘటనపై కేసీఆర్ సర్కారు భారీ నిర్ణయం

Tue Mar 13 2018 11:13:17 GMT+0530 (IST)

అనుకున్నట్లే జరిగింది. అంచనాలు నిజమయ్యాయి. నిన్న తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనలపై తెలంగాణ సర్కారు తీవ్ర నిర్ణయం తీసుకుంది. గవర్నర్ ప్రసంగిస్తున్న సందర్భంగా తెలంగాణకాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుసరించిన వైఖరిని తీవ్రంగా తప్పు పట్టింది.సభలో అవాంఛనీయ ఘటనలకు పాల్పడిన 11 మంది కాంగ్రెస్ నేతల్ని ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ సస్పెండ్ చేసినట్లుగా శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. అదే సమయంలో.. మండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌పై హెడ్ ఫోన్స్ విసిరిన ఉదంతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. సంపత్ ల శాసనసభా సభ్యత్వాల్ని రద్దు చేస్తున్నట్లుగా వెల్లడించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జానారెడ్డి.. జీవన్ రెడ్డి.. గీతారెడ్డి.. చిన్నారెడ్డి.. ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. డీకే అరుణ.. మల్లు భట్టి విక్రమార్క.. పద్మావతి రెడ్డి.. రామ్మోహన్ రెడ్డి.. వంశీచందర్ రెడ్డి.. మాధవరెడ్డిలను సస్పెండ్ చేస్తూ మంత్రి హరీశ్ రావు ప్రవేశ పెట్టిన తీర్మానానికి తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి ఆమోద ముద్ర వేశారు. దీంతో.. తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి