Begin typing your search above and press return to search.

అసహజంగా అణుశాస్త్రవేత్తల మరణాలు

By:  Tupaki Desk   |   9 Oct 2015 6:20 AM GMT
అసహజంగా అణుశాస్త్రవేత్తల మరణాలు
X
సమాచారహక్కు చట్టం పుణ్యమా అని ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి. ఇలా బయటకు వచ్చిన అధికారిక సమాచారం ఎంతో చర్చకు అవకాశం ఇవ్వటమే కాదు.. దేశంలోని వాస్తవ పరిస్థితులపై అవగాహన కల్పించే పరిస్థితి. దేశ భద్రతకు అత్యంత కీలకమైన అణ్వస్త్ర సాంకేతికతకు సంబంధించిన ఒక విషయం బయటకొచ్చి ఆందోళనకు గురి చేస్తుంది.

పక్కలో బల్లెంలా ఉండే పాక్ రోజురోజుకీ తన అస్వస్త్ర పాటవాన్ని మరింత పెంచుకుంటుంటే.. దేశంలో అణ్వస్త్ర శాస్త్రవేత్తలు ఒకరి తర్వాత ఒకరు అసహజ మరణాలకు గురి కావటం షాక్ కలిగించే అంశంగా చెప్పొచ్చు. గడిచిన ఐదేళ్లలో అణ్వస్త్ర శాస్త్రవేత్తల మరణాలపై ఒక ఆర్టీఐ కార్యకకర్త సంధించిన ప్రశ్నకు అణుశక్తి శాఖ సమాధానం ఇచ్చింది.

దీని వివరాల ప్రకారం.. గడిచిన ఐదేళ్ల వ్యవధిలో 11 మంది శాస్త్రవేత్తలు అసహజంగా మరణించటం గమనార్హం. ఇలా అసహజమరణాలకు గురైన శాస్త్రవేత్తల్లో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకోవటం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి.

ఒక శాస్త్రవేత్త రోడ్డ ప్రమాదంలో మరణిస్తే.. మరో ఇద్దరు ప్రయోగశాలలో జరిగిన ప్రమాదంలో మరణించారు. ఇక.. మరో శాస్త్రవేత్త ఆత్మహత్య చేసుకుంటే.. ఇంకో ఇద్దరు నదిలోకి దూకి ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా రికార్డులు చెబుతున్నాయి. ఇక.. ముంబయికి చెందిన మరో సైంటిస్ట్ ఆయన స్వగృహంలోనే హత్యకు గురయ్యారు. ఈ విషయానికి సంబంధించి ఇప్పటివరకూ అనుమానితుల్ని పోలీసు శాఖ గుర్తించకపోవటం గమనార్హం. అణుశాస్త్రవేత్తల అసహజ మరణాలపై మోడీ సర్కారు అయినా కలుగజేసుకుంటుందా..?