Begin typing your search above and press return to search.

107 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి... మైండ్ గేమేనా...!

By:  Tupaki Desk   |   14 July 2019 5:49 AM GMT
107 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి... మైండ్ గేమేనా...!
X
దేశ‌వ్యాప్తంగా ప‌ట్టు బిగించేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ స‌న్న‌ద్ధం అవుతోంది. ప్ర‌తిప‌క్ష పార్టీలు బ‌లంగా ఉన్న ఆయా రాష్ట్రాల్లో పాగా వేసేందుకు పావులు క‌దుపుతోంది. ఇందుకోసం వైరి పార్టీల ఆత్మ‌స్థైర్యం దెబ్బ‌తీసేలా మైండ్‌ గేమ్ కు తెర‌లేపిన‌ట్లు తెలుస్తోంది. అటు ప్రాంతీయ పార్టీలు బ‌లంగా ఉన్న తెలంగాణ‌ - ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ - ప‌శ్చిమ బెంగాల్‌ తో పాటు అటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజ‌స్థాన్‌ - గోవా - మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాలపై ప్ర‌త్యేక దృష్టి సారించింది. ఈ క్ర‌మంలోనే ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీ నేత‌ల‌ను త‌మవైపు తిప్పుకునేందుకు గ‌ట్టి ప్ర‌య‌త్నం చేస్తోంది.

ముఖ్యంగా ఇటీవ‌లి కాలంలో బీజేపీ అధిష్టానం ప‌శ్చిమ‌బెంగాల్‌ పై ప్ర‌ధానంగా గురిపెట్టింది. ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి చెక్ పెట్టేందుకు - రాష్ట్రంలో అధికారం చేప‌ట్టేందుకు అన్ని అవకాశాలను వినియోగించుకుంటుంది. 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా త‌గిన వ్యూహాల‌కు ప‌దును పెడుతుంది. ఇటీవ‌ల జ‌రిగిన సార్వత్రిక ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ 22 స్థానాల్లో విజయం సాధించ‌గా - బీజేపీ 18 స్థానాల‌ను ద‌క్కించుకుంది. 2014 ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒక్క సీటుతో స‌రిపెట్టుకున్న బీజేపీ ఈ ఎన్నిక‌ల్లో ఏకంగా 18 స్థానాల‌కు ఎగబాకి మ‌మ‌త‌కు అదిరిపోయే షాక్ ఇచ్చింది. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుపొంద‌డంతో ఇప్పుడు బెంగాల్ అసెంబ్లీలోనూ పాగా వేయాల‌ని చాప‌కింద నీరులా ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ఈక్ర‌మంలోనే తాజాగా బీజేపీ సీనియ‌ర్ నేత‌ ముకుల్‌ రాయ్ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా ప్రాధాన్య‌త సం త‌రించుకున్నాయి. ప‌శ్చిమబంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) - సీపీఎం - కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన 107 మంది ఎమ్మెల్యేలు త‌మ పార్టీలో చేరనున్నారని ఆయ‌న పేర్కొన‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. అంతేగాక ఆ ఎమ్మెల్యేల జాబితా తమ వద్ద సిద్ధంగా ఉందని - వారంతా తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే కామెంట్ల‌పై ఆయా పార్టీల్లో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే ఎమ్మెల్యే ముకుల్‌ రాయ్ వ్యాఖ్య‌ల‌ను అధికార టీఎంసీ సీరియ‌స్‌ గా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పుంజుకుంటుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారని - అందుకోసం కార్యకర్తలందరూ సన్నద్ధంగా ఉండాలని కోరినట్లు ఓ సీనియర్‌ టీఎంసీ నాయకుడు తెలిపారు.

టీఎంసీ ఎ మ్మెల్యేలందరూ ప్రజలకు చేరువ కావాలని - అవసరమైతే గతంలో చేసిన తప్పులు ఒప్పుకొని క్షమాపణలు అడగాలని మమత చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఏదేమైనా ఒక రాష్ట్రం నుంచి ఏకంగా 107 మంది ఎమ్మెల్యేలు పార్టీ మార‌డం అంటే సాధార‌ణ విష‌యం కాద‌ని, అదే జరిగితే రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బెంగాల్‌లో బీజేపీ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇక బెంగాల్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 294. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి అత్యధికంగా 211 సీట్లు రాగా - బీజేపీకి కేవలం 3 సీట్లే దక్కాయి. కాంగ్రెస్‌ 44సీట్లు సొంతం చేసుకోగా..వామపక్షాలు 32స్థానాల్లో గెలుపొందాయి. ఇటీవల జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 లోక్‌ సభ స్థానాల్లో బీజేపీ 18 స్థానాల్లో విజయం సాధించాయి.