కల్తీమద్యానికి తేయాకు 102 మంది తేయాకు కార్మికులు బలి

Sat Feb 23 2019 21:08:45 GMT+0530 (IST)

అసోంలో కల్తీ లిక్కర్ తాగి మృతి చెందిన వారి సంఖ్య 102 కి చేరింది. మరో 200 మంది ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు చెబుతున్నారు. మృతులంతా గోలాఘాట్ జోర్హాట్ జిల్లాల్లో టీ తోటల్లో పనిచేస్తున్నవారే. చనిపోయినవారిలో ఆడవాళ్లు కూడా ఉన్నారు. ఒక్క గోలా ఘాట్ జిల్లాలోనే 60 మందికిపైగా మరణించినట్లు ఆ జిల్లా ఎస్పీ పుష్కర్ సింగ్ తెలిపారు.
    
గోలాఘాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 35 ఏళ్ల బీరెన్ ఛటవార్ బీబీసీతో మాట్లాడుతూ గురువారం తేయాకు తోటలో పని ముగించుకున్న అనంతరం మద్యం తాగడానికి వెళ్లినట్లు చెప్పారు. ‘‘అర లీటరు బాటిల్ వైన్ కొన్నాను. తినడానికి ముందు తాగాను. మొదట సాధారణంగానే ఉన్నా కొద్దిసేపయ్యాక తలనొప్పి మొదలైంది’’ అని తెలిపారు. తీవ్రమైన తలనొప్పి వల్ల ఏమి తినలేక పోయానని కనీసం నిద్ర కూడా పోలేదని అన్నారు. బీరెన్ పరిస్థితి విషమించడంతో భార్య ఆయనను తేయాకు తోటలకు చెందిన ఆసుపత్రిలో చేర్పించారు.తేయాకు తోటలో పనిచేసే కార్మికులు తమ శారీరక శ్రమను మరిచిపోడానికి కాస్త సేదతీరడానికి మద్యం తీసుకుంటారు. అసోం టీ తోట కార్మికుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కార్మికులు తాగిన మద్యాన్ని స్థానికంగానే తయారు చేశారు. ఇది దేశవాళి మద్యం కంటే తక్కువ ధరకు దొరకడం ఎక్కువ మత్తు ఇవ్వడంతో తేయాకు తోటల కార్మికులు దీన్ని వినియోగిస్తుంటారు. లోకల్ గా దొరికే ఈ మద్యం రూ.300 నుంచి రూ.400 పెడితే ఐదు లీటర్ల వరకు దొరుకుతుంది. మీథైల్ ఐసోసైనేట్ యూరియా కలిపి ఈ మద్యాన్ని తయారు చేస్తున్నారని ఎస్పీ పుష్కర్ సింగ్ తెలిపారు. మోతాదులో తేడాలొస్తే ప్రాణాలకే ప్రమాదమని ఎస్పీ చెబుతున్నారు. కాగా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోనూ కల్తీ మద్యం తాగి 98 మంది చనిపోయారు. ఉత్తరాఖండ్ లోనూ ఇలాంటి విషాదం చోటుచేసుకుంది.