బస్సులో 100 కోట్లు - గాలి డబ్బులేనా?

Tue Apr 17 2018 14:20:06 GMT+0530 (IST)

ఆంధ్రా -తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని నగదు కొరత ఏర్పడింది. ఎందుకిలా అంటే... దానికి రకరకాల కారణాలున్నాయి. దేశంలో ఎక్కడితో పోల్చినా రెండు రాష్ట్రాల్లో అవినీతి బాగా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తెలుగు ప్రజలు అవినీతి పెద్ద తప్పుగా భావించరని అంటుంటారు. అయితే ఈ నల్లడబ్బు ఎక్కడికి పోతుందనేదే సమస్య. కానీ పక్క రాష్ట్రాల్లో నాయకులు కూడా క్యాష్ కోసం తెలుగు రాష్ట్రాలపై ఆధారపడి తరలించడం వల్లే ఈ స్థాయిలో ఇక్కడ మాత్రమే నగదు కొరత ఉందని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకో నిజమో అన్నది ఎవరూ తేల్చలేరు.అయితే తాజాగా ఒక భారీ నగదు డంప్ బయట పడింది. అది ఎక్కడో కాదు... జాతీయ రహదారిపై వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సులో. కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో బళ్లారికి వెళ్లే జాతీయ రహదారిపై ఒక ప్రైవేటు బస్సులో వంద కోట్ల డబ్బు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకుని లెక్కించగా అది వంద కోట్లుగా తేలి ఆశ్చరపోయారు. ఎన్నికల సమయంలో డబ్బు దొరకడం ఆశ్చర్యం కాదు గాని కేవలం ఒక బస్సులో ఇంత డబ్బు దొరకడం అరుదైన విషయం. దీనిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బళ్లారి పరిసర నియోజకవర్గాల్లో గాలి జనార్దన్ రెడ్డి కుటుంబానికి - ఆయన అనుచరులకు ఏడు టిక్కెట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికే ఈ డబ్బు తరలిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఒకవేళ ఈ డబ్బు కాంగ్రెస్ ది అయ్యుండే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఒకవేళ అధికార పార్టీ తరలిస్తుంటే అది పట్టుబడకుండా అందరినీ మేనేజ్ చేసి ఉండేవారని - పోలీసులు ఇంత భారీ డబ్బును పట్టుకున్నారంటే పైగా అది బళ్లారి ప్రాంతానికి వెళ్తున్న డబ్బు అంటే కచ్చితంగా గాలి జనార్దన్ రెడ్డి డబ్బే అని కొందరు భావిస్తున్నారు. అయితే  - పోలీసులు మాత్రం ఈ డబ్బు ఎవరిది అని విచారణ చేస్తున్నామని అంటున్నారు.