Begin typing your search above and press return to search.

పెళ్లిళ్ల కోసం... వంద మంది ఎమ్మెల్యేల‌కు లీవులా?

By:  Tupaki Desk   |   24 Nov 2017 12:34 PM GMT
పెళ్లిళ్ల కోసం... వంద మంది ఎమ్మెల్యేల‌కు లీవులా?
X
ఏపీ అసెంబ్లీలో ఇప్పుడు ఓ విచిత్ర‌క‌ర‌మైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌ను విచిత్రం అంటున్నారేందుకంటే... స‌భ‌లో ప్రస్తుతం హాజ‌ర‌వుతున్న ఎమ్మెల్యేల్లో ఏకంగా వంద మందికి లీవులు ఇచ్చేశారు. అంటే లీవులు దొరికిన ఎమ్మెల్యేలు స‌భ‌కు రాకుంటే... అస‌లు స‌భ‌లో కోరం అనే మాటే వినిపించ‌ని ప‌రిస్థితి అన్న‌మాట‌. స‌భ‌లో మూడో వంతు స‌భ్యులు లేకుంటే... స‌భ‌ను కొన‌సాగించ‌డం కుద‌ర‌దు. అయినా ఈ వంద మంది ఎమ్మెల్యేల‌కు ఎందుకు సెల‌వు మంజూరైంద‌న్న విష‌యానికి వ‌స్తే... కేవ‌లం పెళ్లిళ్ల‌కు హాజ‌ర‌య్యేందుకేన‌ట‌. అయినా ఒక‌టే సారి ఇంత మంది శాస‌న‌స‌భ్యులు పెళ్లిళ్ల‌కు హాజ‌రుకావాల్సిన ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చిందంటే... ఈ నాలుగైదు రోజుల్లో రాష్ట్రంలో దాదాపుగా ల‌క్షా 20 వేల వివాహాలు జ‌రుగుతున్నాయి. బ‌ల‌మైన ముహూర్తాలు ఉన్న నేప‌థ్యంలో చాలా మంది ఈ శుభ ఘ‌డియ‌ల్లో పెళ్లి చేసుకునేందుకు ముహార్తాలు నిర్ణ‌యించుకున్నారు. ఇలా పెళ్లి జ‌రుగుతున్న కుటుంబాల్లో కొంద‌రు రాజ‌కీయ నేత‌ల పిల్ల‌లు కూడా ఉన్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు ఏపీ శాస‌న మండ‌లిలో ప్ర‌భుత్వ చీఫ్ విప్‌గా ఉన్న ప‌య్యావుల కేశ‌వ్ సోద‌రుడి ఇళ్లు కూడా ఉంది. చాలా ఏళ్ల త‌ర్వాత వారి ఇంట పెళ్లి బాజాలు మోగుతున్న నేప‌థ్యంలో ప‌య్యావుల పూర్తిగా ఇంటికే ప‌రిమిత‌మైపోయారు. అంతేకాకుండా రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నేత‌గానే కాకుండా టీడీపీలో మంచి వాగ్దాటి క‌లిగిన నేత‌గా ఉన్న ఆయ‌నకు అన్ని రాజ‌కీయ పార్టీల్లోనూ మిత్రులు ఉన్నారు. ఇత‌ర పార్టీల విష‌యాన్ని ప‌క్క‌న‌బెడితే... టీడీపీలో ప్ర‌స్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉన్న వారంద‌రూ ఈ పెళ్లికి హాజ‌రుకావాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఎందుకంటే ప‌య్యావుల ప్ర‌తి ఒక్క‌రికి శుభ‌లేఖ అందించ‌డంతో పాటు త‌న ఇంటిలో జ‌రుగుతున్న కీల‌క‌మైన ఘ‌ట్టం క‌నుక అంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రుకావాల్సిందేన‌ని పేరు పేరునా ప్ర‌త్యేకంగా ఆహ్వానం ప‌లికారు. సో... ప‌య్యావుల ఆహ్వానాన్ని మ‌న్నించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. మ‌రి ప‌య్యావుల ఇంట పెళ్లి ఈ రోజుతో ముగిసిపోతే.. మ‌రి రేప‌టి ప‌రిస్థ‌తి ఏమిట‌నే ప్ర‌శ్న వేసుకుంటే... ప‌య్యావుల మాదిరే స‌మాజంలో ప‌లుకుబ‌డి క‌లిగిన చాలా కుటుంబాల్లో పెళ్లిళ్లు జ‌రుగుతున్నాయి. దీంతో ఆయా పెళ్లిళ్ల‌కు ఎమ్మెల్యేలుగా ఉన్న వారి హాజ‌రు త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది క‌దా.

ఇందుకోస‌మే ఏకంగా వంద మంది శాస‌నస‌భ్యుల‌కు స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ సెల‌వు మంజూరు చేశారు. అయినా ఇలాంటి ప‌రిస్థితి గ‌తంలో ఎప్పుడైనా క‌నిపించిందా? అంటే... లేద‌నే స‌మాధాన‌మే వినిపిస్తుంది. శాస‌న‌స‌భ ప్రాధాన్యాన్ని గుర్తుంచుకునే నేత‌లు... పెళ్లిళ్లు, ఇత‌ర కార్య‌క్ర‌మాలు ఉన్నా... దానికి అటెండై వెంట‌నే స‌భ‌కు వ‌చ్చేవారు. మ‌రి ఇప్పుడు ఏకంగా సెల‌వు పెట్ట‌డ‌మేమిట‌నే విష‌యంపై చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో స‌భ్యుల సంఖ్య‌, సెల‌వు మంజూరైన స‌భ్యుల వివ‌రాల్లోకెళితే.. స‌భ‌లో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలుర‌న్నారు. వీరిలో అధికార పార్టీ టీడీపీతో పాటు దాని మిత్ర‌ప‌క్షం బీజేపీకి చెందిన వారి సంఖ్య మొత్తంగా 106. విప‌క్షంగా ఉన్న వైసీపీ స‌భ్యుల సంఖ్య 67. ఇక మ‌రో ఇద్ద‌రు స్వ‌తంత్రులున్నారు. వైసీపీ స‌భ్యుల్లో విడ‌త‌ల‌వారీగా పార్టీలు మారిన వారి సంఖ్య 22. వీరిని తీసివేస్తే... వైసీపీ బ‌లం నిక‌రంగా 45. పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించాల‌నే డిమాండ్‌తో వైసీపీ ప్ర‌స్తుత శాస‌న‌స‌భ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. అంటే స‌భ‌కు ఇప్పుడు హాజ‌ర‌వుతున్న వారి సంఖ్య కేవ‌లం 130 మాత్ర‌మే.

ఈ 130లో ఇద్ద‌రు ఇండిపెండెంట్ల‌ను తీసివేస్తే... 128 మంది అధికార ప‌క్షానికి చెందిన వారే. వీరిలో ఏకంగా వంద మందికి స్పీక‌ర్ సెల‌వులు మంజూరు చేస్తే.. స‌భ‌కు వ‌చ్చే వారి సంఖ్య కేవ‌లం 28 మాత్ర‌మే. ఇలాంటి ప‌రిస్థితుల్లో స‌భను నిర్వ‌హించ‌డం దాదాపుగా దుస్సాధ్య‌మే. అందుకే స‌భ‌కు సెల‌వులు ప్ర‌క‌టించేసిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. అయినా ఎమ్మెల్యేలు త‌మ లీవు లెట‌ర్ల‌లో ఏమ‌ని పేర్కొన్నారంటే... పెళ్లిళ్ల‌కు హాజ‌రు కావాల్సి ఉంద‌ని, ఈ రోజుల్లో సెల‌వులు మంజూరు చేస్తే... ఆ త‌ర్వాత మ‌రో రెండు రోజులు పొడిగించినా ఫ‌రవా లేద‌ని తెలిపార‌ట‌. ఈ త‌ర‌హా విజ్ఞ‌ప్తుల‌ను ప‌క్క‌న పెట్టేసి ఇలా అంద‌రూ సెల‌వులు పెడితే... స‌భ‌ను న‌డిపేదెలా? అంటూ వారించాల్సిన స్సీక‌రే సెల‌వులు ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించ‌డంపై విమ‌ర్శ‌లు రేకెత్తుతున్నాయి. ఈ మొత్తం తంతు చూస్తుంటే... ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌కు సంబంధించి మ‌న శాస‌న‌స‌భ్యుల‌కు ఎంత ఇంట‌రెస్ట్ ఉందో ఇట్టే అర్థం కాక మాన‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది.