Begin typing your search above and press return to search.

ఘోరం; నదిలో పడిపోయిన రెండు రైళ్ల బోగీలు

By:  Tupaki Desk   |   5 Aug 2015 4:14 AM GMT
ఘోరం; నదిలో పడిపోయిన రెండు రైళ్ల బోగీలు
X
మంగళవారం అర్థరాత్రి వేళ ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మధ్య ప్రదేశ్ లో రెండు రైళ్లు ఒకే వంతెన మీద పట్టాలు తప్పాయి. మాచాక్ నదిలో పడిపోయిన బోగీల్లోని ప్రయాణికుల్ని అక్కడి స్థానికులు రక్షించినట్లు చెబుతున్నారు. మొత్తం 300 మంది ప్రయాణికుల్ని అక్కడి స్థానికులురక్షించగా.. ఎంతమంది ఈ ఘటనకు బలైపోయారన్న విషయంపై స్పష్టత రావటం లేదు.

మధ్య ప్రదేశ్ లోని కుదావా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘోర దుర్ఘటన జరిగింది. మొదట ముంబయి నుంచి వారణాసి వెళుతన్న కామయాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి పది బోగీలు మాచాక్ నదిలో పడిపోయాయి. ఇందులోని 300 మంది ప్రయాణికుల్ని అక్కడ స్థానికులు రక్షించారు. ఇక.. పట్నా నుంచి ముంబయి వెళుతున్న జనతా ఎక్స్ ప్రెస్ సైతం సమాచార లోపంతో అదే ట్రాక్ మీదకు చేరుకొంది. ఈ రైలుకు చెందిన ఐదు బోగీలు నదిలో పడిపోయినట్లు చెబుతున్నారు.

నదిలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండి.. పట్టాల మీదకు భారీగా నీరు చేరుకోవటంతోనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. తక్షణ సాయం కింద సిబ్బందితో బయలుదేరిన ప్రత్యేక రైలు.. నదీ ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. ప్రాధమిక సమాచారం ప్రకారం ఇప్పటికి 30 మందికి గాయాలుఅయినట్లు చెబుతున్నా.. మృతల సంఖ్య మాత్రం బయటకు రాలేదు. అయితే.. నష్టం ఎక్కువగా ఉంటుందన్న అంచనా వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణకు ఆదేశించారు.