Begin typing your search above and press return to search.

పాత పరిచయంతోనే పెద్దాయనతో భేటీ?

By:  Tupaki Desk   |   2 July 2015 8:57 AM GMT
పాత పరిచయంతోనే పెద్దాయనతో భేటీ?
X
వర్షాకాలం విడిది కోసం భారత రాష్ట్రపతి హైదరాబాద్‌లో విడిది చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన్ని పలువురు ప్రముఖులు కలిసి వెళ్లటం జరుగుతున్నదే. గురువారం మధ్యాహ్నం రాష్ట్రపతిని ఉమ్మడితెలుగు రాష్ట్ర ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి కలవటం కాస్తంత ఆసక్తికరంగా మారింది.

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వంతో విభేదించి.. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన కిరణ్‌.. విభజన బిల్లు పాస్‌ అయిన వెంటనే తన పదవికి రాజీనామా చేయటం.. జై సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేయటం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో అడ్రస్‌ లేకుండా పోయిన పార్టీ దెబ్బతో కనుమరుగు అయిన నల్లారి.. తర్వాత పరిమిత సందర్భాల్లో మాత్రమే బయటకు వచ్చారు.

పుస్తకావిష్కరణలకు.. కొన్ని కీలక సంఘటనల సమయంలోనే ఆయన బయటకు వచ్చి.. తన దారిన తాను వెళ్లిపోయారే కానీ.. రాజకీయాల గురించి మాట్లాడింది లేదు. అలాంటి ఆయన తాజాగా రాష్ట్రపతి ప్రణబ్‌తో భేటీ కానున్నారు. ఆయన భేటీకి ముందు గవర్నర్‌ నరసింహన్‌ రాష్ట్రపతితో భేటీ కానున్నారు.

ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం మరొకటి ఉంది. నల్లారికి రాష్ట్రపతి ప్రణబ్‌దాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన రాష్ట్రపతి కాకముందే.. కాంగ్రెస్‌ పార్టీలో అత్యంత కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. వైఎస్‌ మరణం తర్వాత.. ఏపీ పార్టీకి సంబంధించి పలు అంశాలకు సంబంధించిన ఫీడ్‌బ్యాక్‌ను నల్లారి వారు.. ప్రణబ్‌దాకు ఇచ్చేవారని చెబుతారు.

కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలో.. కాంగ్రెస్‌ అధినాయకత్వంలో కీలకమైన ప్రణబ్‌దా.. అహ్మద్‌ పటేల్‌కు ఎప్పటికప్పడు నివేదికలు పంపటంతో పాటు.. సోనియాగాంధీ మనసుదోచుకోవటం.. ఆ పై ముఖ్యమంత్రి పదవిని చేజిక్కించుకోవటం తెలిసిందే. కిరణ్‌కు సీఎం పదవి రావటానికి ప్రణబ్‌ పాత్ర చాలానే ఉందని చెబుతారు.

ఒకనాటి పార్టీ కీలక వ్యక్తి.. తనకు అత్యంత సన్నిహితుడైన ప్రణబ్‌ను కలుస్తున్న కిరణ్‌.. రాష్ట్రపతితో ఏయే విషయాలు మాట్లాడతారు? ఎలాంటి ఫీడ్‌బ్యాక్‌ ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.