Begin typing your search above and press return to search.

ప్రపంచ స్టాక్‌ మార్కెట్లకు ''గ్రీస్‌'' కత్తిపోట్లు

By:  Tupaki Desk   |   29 Jun 2015 6:59 AM GMT
ప్రపంచ స్టాక్‌ మార్కెట్లకు గ్రీస్‌ కత్తిపోట్లు
X
అనుకున్నదంతా అయ్యింది. ప్రపంచాన్ని వణికిస్తున్న గ్రీస్‌ ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని చుట్టు ముట్టే క్రమంలో మొదటి అడుగు పడింది. యూరోపియన్‌ యూనియన్‌లోని సభ్య దేశమైన గ్రీస్‌ కుప్పకూలింది. తీసుకున్న అప్పుల్ని తీర్చే మార్గం లేక దివాలా తీసింది.

దీంతో.. అప్పులు తీర్చే అన్ని మార్గాలు మూసుకుపోవటంతో స్టాక్‌మార్కెట్లను.. బాండ్ల మార్కెట్‌లను మూసేసింది. దీని ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడింది. రుణాల్ని తిరిగి చెల్లించే ప్లాన్‌ను.. అప్పులిచ్చిన వారు ఒప్పుకోకపోవటంతో గ్రీస్‌ మార్కెట్‌ కుప్పకూలింది. దీని ప్రభావంతో ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న స్పెయిన్‌.. పోర్చుగల్‌ సైతం ప్రభావితం అవుతాయని అంచనా వేస్తున్నారు.

ఒకవేళ అదే జరిగితే ప్రపంచ స్టాక్‌ మార్కెట్లకు మరిన్ని భారీ కుదుపులకు గురి కావటం ఖాయం. ఇప్పటికే గ్రీస్‌ ప్రభావం ఆ దేశాల మీద పడతాయనే మాటే ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను వణికిస్తోంది.

తాజా పరిణామాల నేపథ్యంలో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు మొత్తం నష్టాల్లో కొనసాగుతున్నాయి. జపాన్‌ నిక్కీ రెండు శాతం.. కొరియా మార్కెట్‌ 1.26 శాతం.. హాంకాంగ్‌ మార్కెట్‌ 2.41.. తైవాన్‌ 2.48.. చైనా 2.49 శాతం పతనం అయ్యాయి.

భారత్‌లో గ్రీస్‌ ప్రభావం భారీగా కనిపిస్తోంది. శుక్రవారం నాటి ముగింపుతో పోలిస్తే దాదాపు 520పైగా పాయింట్ల నష్టంలోకి చిక్కుకుపోయాయి. దీంతో.. మార్కెట్‌లోని షేర్ల విలువ రూ.2లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. రక్తం చుక్క బయటకు రాకుండా లక్షల కోట్ల రూపాయిలు ఆవిరైపోవటంతో మదుపుదారులు తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారు. గ్రీస్‌ దివాలా కత్తిపోటుకు ప్రపంచ స్టాక్‌ మార్కెట్‌లు అన్నీ రక్తమోడుతున్నాయి. మరోవైపు గ్రీస్‌ సంక్షోభం పుణ్యమా అని క్రూడ్‌ అయిల్‌ ధరలకు రెక్కలు వచ్చాయి. బ్యారెల్‌ ధర 62 డాలర్ల నుంచి 67 డాలర్ల మేర పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.