Begin typing your search above and press return to search.

సెక్షన్‌ ఎనిమిది కాదు.. యూటీ చేయాలట!

By:  Tupaki Desk   |   30 Jun 2015 5:55 AM GMT
సెక్షన్‌ ఎనిమిది కాదు.. యూటీ చేయాలట!
X
మొన్నటి వరకూ హైదరాబాద్‌లో సెక్షన్‌ ఎనిమిదిని అమలు చేయాలి.. ఇక్కడి శాంతిభద్రతలను గవర్నర్‌ సమీక్షించాలి.. అని డిమాండ్‌ చేసిన తెలుగుదేశం నేతలు ఇప్పుడు మరో కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు తెలుగుదేశం నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఈ డిమాండ్‌ను చేశాడు. ఇప్పటికే మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ యూటీ ప్రస్తావన తీసుకు వచ్చాడు. తాము హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలన్న డిమాండ్‌ను వినిపించగలం అని ఆయన వ్యాఖ్యానించాడు. ఇప్పుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా అదే మాటే మాట్లాడాడు.

సెక్షన్‌ ఎనిమిది సంగతి ఎలా ఉన్నా.. హైదరాబాద్‌ను యూటీ చేసేస్తే సరిపోతుందని గాలి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న డిమాండ్‌ను ఈ విధంగా వినిపించారాయన.

మరి తెలుగుదేశం పార్టీ ఈ విధంగా ఒక డిమాండ్‌కు కట్టుబడకుండా మార్చేసుకొంటూ పోతుండటం ఒకింత విడ్డూరమే. ఒకదాని తర్వాత మరోటి అన్నట్టుగా టీడీపీ తన డిమాండ్లను మార్చుకొంటూ పోతోంది. అయితే హైదరాబాద్‌లో సెక్షన్‌ ఎనిమిదిని అమలు చేయాలన్నా.. ఇక్కడ గవర్నర్‌ శాంతిభద్రతలను సమీక్షించాలన్నా.. అలాగాక ఈ నగరం కేంద్ర పాలితప్రాంతంగా మారిపోవాలన్నా.. వీటిలో ఏది జరగాలన్నా అసలు నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రంలోని మోడీ సర్కారు.

ఆంద్రప్రదేశ్‌ పునర్విభజన బిల్లును కదలిస్తే తప్ప ఏదీ జరగదు. అయితే బీజేపీకి ఇప్పుడు అలాంటి ఉద్దేశం ఏమాత్రమూ కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఏం డిమాండ్‌ చేస్తే ఏం ప్రయోజనం?