Begin typing your search above and press return to search.

రివ్యూ: ఎంతవాడు గాని..

By:  Tupaki Desk   |   23 May 2015 10:37 AM GMT
రివ్యూ:  ఎంతవాడు గాని..
X
రివ్యూ: ఎంతవాడు గాని..

రేటింగ్‌: 2.75 /5

తారాగణం: అజిత్‌, అనుష్క, త్రిష, అరుణ్‌ విజయ్‌, వివేక్‌, అశిష్‌ విద్యార్థి, నాజర్‌ తదితరులు

ఛాయాగ్రహణం: డేన్‌ మాక్‌ఆర్థర్‌

సంగీతం: హారిస్‌ జైరాజ్‌

నిర్మాత: ఐశ్వర్య

రచన, దర్శకత్వం: గౌతమ్‌ మీనన్‌



పోలీస్‌ కథలు తీయడంలో తమిళ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ది ప్రత్యేకమైన శైలి. ఇంతకుముందు గౌతమ్‌ తీసిన కాక్క కాక్క (ఘర్షణ), వేట్టయాడు వెలయాడు (రాఘవన్‌) ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేశాయి. కాప్‌ స్టోరీస్‌ ట్రయాలజీలో గౌతమ్‌ తీసిన చివరి సినిమా 'ఎన్నై అరిందాల్‌'. అజిత్‌ హీరోగా నటించిన ఈ సినిమా తమిళంలో విజయవంతమైంది. తెలుగులో 'ఎంతవాడు గాని..' పేరుతో కొంచెం ఆలస్యంగా ఇప్పుడు విడుదలైంది. మరి ఈ తమిళ అనువాదం తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉందో లేదో చూద్దాం.

కథ:

చిన్నతనంలో గ్యాంగ్‌స్టర్స్‌ చేతిలో తండ్రిని కోల్పోయిన సత్య (అజిత్‌) పెద్దయ్యాక పోలీస్‌ ఆఫీసర్‌ అవుతాడు. ఓ ఆపరేషన్‌లో భాగంగా గ్యాంగ్‌స్టర్స్‌తో చేతులు కలిపి వాళ్లలో ఒకడిగా నటిస్తూ.. వాళ్లను తుదముట్టించడానికి ప్రయత్నిస్తాడు సత్య. ఐతే సత్యను ఎంతగానో నమ్మి గ్యాంగ్‌స్టర్స్‌కు పరిచయం చేసిన విక్టర్‌ (అరుణ్‌ విజయ్‌).. సత్య మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. ముందుగా సత్య పెళ్లాడబోయిన హేమానిక (త్రిష)ను చంపేస్తాడు. ఆ తర్వాత సత్య పెంచుకుంటున్న హేమానిక కూతురు నిషాపై అతడి కళ్లు పడతాయి. మరోవైపు ఫారిన్‌ నుంచి వచ్చిన చంద్రముఖి (అనుష్క)ని చంపాల్సిన డీల్‌ కూడా ఉంటుంది విక్టర్‌కు. మరి విక్టర్‌ నుంచి నిషాను, చంద్రముఖిని సత్య ఎలా కాపాడుకున్నాడు? అన్నది మిగతా కథ.

కథనం, విశ్లేషణ:

హీరో పెద్ద పోలీస్‌ ఆఫీసర్‌. అవతలి వైపు ఒకరిద్దరు క్రూరమైన విలన్స్‌. ఇద్దరికీ అనుకోకుండా వార్‌ మొదలవుతుంది. మధ్యలో హీరోయిన్‌తో హీరోకు ఒక మెచ్యూర్డ్‌ రొమాంటిక్‌ ట్రాక్‌. ఆ తర్వాత విలన్‌ టార్గెట్‌ హీరో ఫ్యామిలీ మీద పడుతుంది. అక్కడి నుంచి దొంగాపోలీస్‌ ఆట. ఎత్తులు పైఎత్తులు.. చివర్లో హై ఓల్టేజ్‌ క్లైమాక్స్‌. విలన్‌ ఆట కట్టు. గౌతమ్‌ మీనన్‌ తీసిన ఘర్షణ, రాఘవన్‌ సినిమాల్లో కామన్‌గా కనిపించే పాయింట్లివి. 'ఎంతవాడు గాని..' ప్లాట్‌ కూడా దాదాపుగా ఇలాగే ఉంటుంది.

హీరోకు దీటైన విలన్‌ను పెట్టి.. తనకు కలిసొచ్చిన ఫార్మాట్‌లోనే మరో కాప్‌ స్టోరీ తీశాడు గౌతమ్‌. పాత సినిమాల ఫార్మాట్‌లో.. ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్లే సాగడం నిరాశ పరిచినా.. దీని ప్రత్యేకతలు దీనికి ఉన్నాయి. హీరో, విలన్‌.. ఇతర ప్రధాన పాత్రధారుల క్యారెక్టరైజేషన్స్‌.. నటీనటుల పెర్ఫామెన్స్‌.. గౌతమ్‌ మీనన్‌ స్టైలిష్‌ టేకింగ్‌.. గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే.. టెక్నికల్‌ వాల్యూస్‌.. 'ఎంతవాడుగాని..'కి ప్రధాన ఆకర్షణ.

ఆరంభంలో అనుష్క ఎపిసోడ్‌ కొంచెం బోర్‌ కొట్టించినా.. విలన్‌ ఎంట్రీతో సినిమాలో ఊపు వస్తుంది. హీరో ఫ్లాష్‌ బ్యాక్‌ ఆకట్టుకుంటుంది. రాఘవన్‌ తరహాలోనే ఇందులోనూ తనదైన శైలిలో ఓ మెచ్యూర్డ్‌ లవ్‌ స్టోరీ పెట్టాడు మీనన్‌. ఆల్రెడీ ఓ బిడ్డకు తల్లి అయిన త్రిషతో అజిత్‌ రొమాంటిక్‌ ట్రాక్‌ ఆకట్టుకుంటుంది. చాలా తక్కువ సన్నివేశాలతోనే ఆహ్లాదంగా, ఎమోషన్‌ క్యారీ అయ్యేలా ఈ ఎపిసోడ్‌ను నడిపించాడు.

ద్వితీయార్ధమంతా సినిమా థ్రిల్లింగ్‌ మూమెంట్స్‌తో సాగుతుంది. హీరో, విలన్‌ మధ్య ఎత్తులు పైఎత్తులు ఆసక్తికరంగా సాగుతాయి. విలన్‌ క్యారెక్టర్‌ను తీర్చిదిద్దడంలో గౌతమ్‌ మరోసారి ప్రత్యేకత చూపించడంతో చివరి 40 నిమిషాలు ఉత్కంఠభరితంగా ఉంటుంది. చివరికి ఏం జరగబోయేది ముందే తెలిసినా.. ప్రేక్షకుడు ఆసక్తిగా సినిమాలో లీనమయ్యేలా ప్రిక్లైమాక్స్‌, క్లైమాక్స్‌ను డిజైన్‌ చేశాడు గౌతమ్‌. ముందే చెప్పినట్లు గౌతమ్‌ ఇంతకుముందు తీసిన సినిమాల ఫార్మాట్‌లోనే సాగడం.. కథ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లే ఉండటం 'ఎంతవాడు గాని..'లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన మైనస్‌లు. నిడివి ఎక్కువవడం, స్లో నరేషన్‌ కూడా ఇబ్బందే.

నటీనటులు:

అజిత్‌ వావ్‌ అనిపిస్తాడు. ఆ తెల్లటి జట్టు, గడ్డం లుక్‌తోనే మార్కులు కొట్టేసిన అజిత్‌.. నటనలోనూ అదరగొట్టాడు. గౌతమ్‌ మార్కు హీరో క్యారెక్టర్లో అతను చక్కగా ఇమిడిపోయాడు. తన క్యారెక్టర్‌ను అండర్‌ప్లే చేస్తూనే బలమైన ముద్ర వేశాడు అజిత్‌. విలన్‌గా చేసిన అరుణ్‌ విజయ్‌.. అజిత్‌కు ఏమాత్రం తీసిపోలేదు. కొన్ని సన్నివేశాల్లో అజిత్‌ను మించిపోయాడు. పాత్రలోని ఇంటెన్సిటీని బాగా క్యారీ చేశాడు. త్రిష వయసుకు తగ్గ పాత్రలో ఆకట్టుకుంది. ఇది ఆమెకు చాలా భిన్నమైన క్యారెక్టర్‌. అనుష్కది కీలకమైన పాత్రే అయినా.. ఆమె టాలెంట్‌ చూపించే సన్నివేశాలేం పడలేదు. అనుష్క లుక్‌ ఎబ్బెట్టుగా ఉంది. అంతగా సూటవలేదు. చిన్న పాప బాగా నటించింది. మిగతా వాళ్లంతా ఓకే.

సాంకేతిక వర్గం:

గౌతమ్‌ మీనన్‌ సినిమాలు ఎప్పుడూ టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉంటాయి. 'ఎంతవాడు గాని..' కూడా అందుకు మినహాయింపు కాదు. హారిస్‌ జైరాజ్‌ పాటలు గొప్పగా ఏమీ లేవు కానీ.. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం అదరగొట్టేశాడు. సినిమాకు ఆర్‌ఆర్‌ ప్రధాన ఆకర్షణ. డేన్‌ మాక్‌ఆర్థర్‌ సినిమాటోగ్రఫీ కూడా సూపర్బ్‌. సినిమాకు డిఫరెంట్‌ లుక్‌ తీసుకొచ్చాడు అతను తన కెమెరాతో. మిగతా టెక్నీషియన్స్‌ కూడా గౌతమ్‌ టేస్టుకు తగ్గట్లు పని చేశారు. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. అవసరానికి తగ్గట్లు బాగా ఖర్చు చేశారు. గౌతమ్‌ మీనన్‌ కథ విషయంలో నిరాశ పరిచినా.. స్క్రీన్‌ప్లే, టేకింగ్‌ విషయంలో తనదైన ముద్ర వేశాడు. ఐతే ఇకపై ఈ ఫార్మాట్‌లో సినిమాలు మానేస్తే బెటరేమో. సినిమా బాగుందనిపిస్తూనే.. మొనాటనీ ఫీలింగ్‌ కలిగిస్తుంది.

చివరిగా...

ఇది యాక్షన్‌ మూవీనే అయినా.. రొటీన్‌ మసాలా సినిమాల్ని ఇష్టపడే మాస్‌ ఆడియన్స్‌కు అంతగా నచ్చకపోవచ్చు. హాలీవుడ్‌ స్టయిల్‌ యాక్షన్‌ థ్రిల్లర్స్‌ను, గౌతమ్‌ మీనన్‌ సినిమాల్ని ఇష్టపడేవారిని 'ఎంతవాడుగాని..' మెప్పిస్తుంది. ఐతే ఘర్షణ, రాఘవన్‌ సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని మరీ ఎక్కువ మాత్రం ఆశించకండి.