Begin typing your search above and press return to search.

2019 నాటికి వైసీపీ కనుమరుగు!

By:  Tupaki Desk   |   7 July 2015 5:32 PM GMT
2019 నాటికి వైసీపీ కనుమరుగు!
X
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 2019 ఎన్నికల నాటికి కనుమరుగు కానుంది! కనీసం ఆ పార్టీ ఉనికిలో కూడా ఉండే అవకాశాలు లేవు! ఒకవేళ ఉన్నా.. గెలిచే అవకాశాలు అంతకంటే ఉండవు! ఇది రాజకీయాల్లో తలపండిన విశ్లేషకులు చెబుతున్న మాట. ఇందుకు కారణాలు లేకపోలేదు.

ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఘన విజయం సాధిస్తే.. వైసీపీ అభ్యర్థి అట్ల చిన వెంకటరెడ్డి అత్యంత దారుణంగా ఘోరాతిఘోరంగా పరాజయం పాలయ్యాడు. ఇక్కడ టీడీపీ అభ్యర్థికి 711 ఓట్లు వస్తే.. వైసీపీ అభ్యర్థికి వచ్చింది కేవలం 13 ఓట్లు. ఈ నియోజకవర్గంలో టీడీపీకి బలం ఉందని, వైసీపీకి బలం లేదని, అందుకే వైసీపీ అభ్యర్థి ఓడిపోయారని భావిస్తే తప్పులో కాలేసినట్టే.

ప్రకాశం జిల్లాలో స్థానికసంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 992 ఓట్లు ఉన్నాయి. వీటిలో 480కిపైగా ఓట్లు వైసీపీకి చెందినవి అయితే.. 440 వరకూ ఓట్లు టీడీపీకి చెందినవి. ఎన్నికలకు ముందే ఇక్కడ టీడీపీ కంటే వైసీపీ దాదాపు 40 ఓట్లపైచిలుకు ఆధిక్యంతో ఉంది. దాంతో ఇక్కడ వైసీపీ విజయం సాధిస్తుందని ఎవరైనా భావిస్తారు. కానీ, ఎన్నికలకు దగ్గరకు వచ్చేసరికి వైసీపీకి చెందిన చాలామంది ఎంపీటీసీలు టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలపడం ప్రారంభించారు. దాంతో ఇక్కడ వైసీపీ నేతలు చేతులు ఎత్తేశారు.

మరొక్క ముఖ్య విషయం ఏమిటంటే, ఈ నియోజకవర్గంలో సగ భాగం నెల్లూరు జిల్లా పరిధిలోకి వస్తుంది. ఇక్కడ అంతా రెడ్డి సామాజిక వర్గానిది మరీ ముఖ్యంగా మేకపాటి వర్గానిదే పైచేయి. అయినా, ఎన్నికల ఫలితాలు వెలువడే సరికి వైసీపీకి కేవలం 13 అంటే 13 ఓట్లు వస్తే.. టీడీపీ అభ్యర్థికి 724 ఓట్లు వచ్చాయి. అంటే మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అనుకూలంగా ఇక్కడి నాయకులే కుమ్మక్కు అయిపోయారు. దాంతో వైసీపీకి చెందిన బలమైన మద్దతుదారులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. డబ్బులు తీసుకున్న మిగిలిన ఓటర్లు టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారు.

నెల్లూరు, ప్రకాశం జిల్లాలు అంటే వైసీపీకి గట్టి పట్టున్న జిల్లాలు. ఈ జిల్లాల్లో మెజారిటీ ఉన్నా.. ఇక్కడి ఎమ్మెల్సీ స్థానాన్ని వైసీపీ నిలబెట్టుకోలేకపోయింది. ఇక్కడి పార్టీ కార్యాలయాన్ని ఇటీవలే ఎత్తివేశారు. ఇక్కడి నాయకులు కూడా అధికార పక్షానికి అమ్ముడుపోయారు. దీనినిబట్టి, 2019 ఎన్నికల్లోపే వైసీపీ చాపచుట్టేసే అవకాశం ఉందని విశ్లేషకులు వివరిస్తున్నారు.