Begin typing your search above and press return to search.

మా ఆయనతో పార్టీకి వెళ్తే అలా రాస్తారా

By:  Tupaki Desk   |   1 July 2015 11:29 AM GMT
మా ఆయనతో పార్టీకి వెళ్తే అలా రాస్తారా
X
తెలంగాణ ఐఏఎస్ అధికారిణి స్మిత సభర్వాల్ పై అవుట్ లుక్ రాసిన కథనం.. దానికి వేసిన కథనం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దానిపై స్మిత ఆ పత్రికతో లీగల్ ఫైట్ కూ రెడీ అయ్యారు. దీనిపై ఆమె ఆవేదన చెందుతూ మాట్లాడారు. తన పుట్టిన రోజు నాడు తన భర్తతో కలిసి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నానని, అప్పుడు తాను వేసుకున్న ట్రౌజర్, షర్టును ప్రస్తావిస్తూ ఔట్‌లుక్ ఇలా రాయడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఔట్‌లుక్‌పై తాను న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు ఆమె తెలిపారు.

సివిల్ సర్వీసెస్‌లో 14 ఏళ్లుగా కొనసాగుతున్న తనపైనే ఇలా రాస్తే సాధారణ మహిళల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చునని ఆమె అన్నారు. ఇది కేవలం తనను మాత్రమే కాకుండా మొత్తం మహిళా లోకాన్ని అవమానించిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే తన తరఫు న్యాయవాది ఔట్‌లుక్ మ్యాగజైన్‌ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారని ఆమె చెప్పారు. దీనిపై ఎంతటి పోరాటానికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు స్మితా సబర్వాల్ చెప్పారు.

కాగా ఔట్ లుక్ లో వచ్చిన ఈ వార్త పూర్వాపరాలపైనా సెక్రటేరియట్ లో చర్చ జరుగుతోంది. ఆ మ్యాగజైన్ తన తాజా సంచికలో డీప్ థ్రోట్ అనే కాలమ్ లో నో బోరింగ్ బాబు అనే శీర్షికతో ఇది ప్రచురించింది. దీనికి వేసిన చిత్రం మరింత తీవ్రంగా ఉందన్న వాదన వినిపిస్తోంది. అయితే... ఈ వార్తను రాసంది కూడా ఓ మహిళా జర్నలిస్తే.. ఆమె ఇరవయ్యేళ్ల అనుభవశీలి. అయితే... వార్త హైదరాబాద్ లో రాయగా దీనికి చిత్రం మాత్రం ఢిల్లీలో వేశారు. దీంతో వార్త తీవ్రతను కార్టూన్ తీవ్రత ఇంకా మించిపోయింది.

అయితే.... స్మిత ఒక్కసారిగా సీఎం కార్యాలయంలో ఉన్నత స్థాయికి చేరడంపై కొంతమంది సీనియర్లూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. తరచూ ఆమె గురించి వారు చేసే కామెంట్లు వినే ఆ జర్నలిస్టు ఈ కథనం రాసి ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది. అయితే... స్మితపై రాసిన కథనంలో కేసీఆర్ చిత్రం ఉండడంతో అధికారులు, నేతలు కూడా తమ పాత కామెంట్లను పక్కనపెట్టి అవుట్ లుక్ పై గయ్య్ మంటున్నారు.