Begin typing your search above and press return to search.

బాహుబలిలో బెజవాడ చిన్నారి

By:  Tupaki Desk   |   6 July 2015 7:17 AM GMT
బాహుబలిలో బెజవాడ చిన్నారి
X
విజయవాడకు చెందిన పన్నెండేళ్ల కుసుమకు అదృష్టం వరించింది. కోట్లాది మంది ప్రేక్షకులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న బాహుబలి సినిమాలో ఆమె నటించింది. అనుకోకుండా దక్కిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్న ఆమె తన పాత్ర చిన్నదే అయినా చిత్రబృందం ప్రశంసలు అందుకుంటోందట.

నిజానికి కుసుమకు ఈ అవకాశం అనుకోకుండా వచ్చింది. కుసుమ అన్నయ్య దిలీప్ తేజ ఓ టీవీ సీరియల్ లో నటిస్తున్నాడు. బాహుబలి సినిమాలో చిన్ననాటి ప్రభాస్ గా ఆ కుర్రాడు నప్పుతాడని భావించిన బాహుబలి దర్శకుడు రాజమౌళి భార్య రమారాజమౌళి ఆ అబ్బాయిని స్ట్రీన్ టెస్టుకు పిలిచారట. అయితే.... బాహుబలిలో చిన్ననాటి రాణాగా నటిస్తున్న కుర్రాడి కంటే బాగా ఎత్తుగా, పెద్దవాడిగా కనిపించడంతో చిన్ననాటి ప్రభాస్ పాత్రకు ఆయన్ను వద్దనుకున్నారు. అయితే... కుర్రాడిలో మంచి ఈజ్ ఉండడంతో భవిష్యత్ లో ఇంకేదైనా పాత్రకు పనికొస్తాడని... ఆయన ఫొటోలు, ప్రొఫైల్ కావాలని అడిగారు.. దీంతో దిలీప్ తల్లిదండ్రులు దిలీప్ తో పాటు ఆయన సోదరి కుసుమ పోర్ట్ ఫోలియో కూడా ఇచ్చారు. సినిమాలో ఓ పాత్రకు కుసుమ సరిపోతుందని గుర్తించిన అసిస్టెంటు దర్శకుడు సురేశ్ ఆమెను ఎంపిక చేసి రాజమౌళికి చెప్పడం.. ఆయన ఓకే చేయడం జరిగిపోయాయి.

బాహుబలిలో కుసుమ పాత్ర పరిధి 5 నిమిషాలే అయినా.... ఒక్క డైలాగు కూడా లేకపోయినా ప్రతిష్ఠాత్మక సినిమా కావడంతో అంగీకరించామని ఆమె తండ్రి రామారావు చెబుతున్నారు. సినిమాలో కుసుమది చిన్న పాత్రేనని... ఆమె ఉన్న ఊరిపై రాణా దాడి చేసి అందరినీ చంపేస్తాడని.. కుసుమ కూడా చనిపోతుందని చెప్పిన ఆయన బాహుబలి తరువాత తమ పాపకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయని వెల్లడించారు. విజయవాడకు చెందిన రామారావు కుటుంబం కొద్ది కాలం కిందట హైదరాబాద్ కు వచ్చేసింది. బాహుబలి తరువాత కుసుమకు మంచి అవకాశాలు వస్తాయని అంతా భావిస్తున్నారు.