Begin typing your search above and press return to search.

వెంకీ సార్‌.. డెడ్‌లైన్‌ అయిపోయింది

By:  Tupaki Desk   |   6 July 2015 3:30 PM GMT
వెంకీ సార్‌.. డెడ్‌లైన్‌ అయిపోయింది
X
విక్టరీ వెంకటేష్‌ సోలో హీరోగా చేసిన 'దృశ్యం' సినిమా విడుదలై ఏడాది కావస్తోంది. పవన్‌ కళ్యాణ్‌తో కలిసి చేసిన మల్టీ స్టారర్‌ రిలీజై కూడా ఆరు నెలలు గడిచిపోయింది. ఇప్పటిదాకా తన కొత్త సినిమా మాత్రం మొదలుపెట్టలేదు విక్టరీ హీరో. నాన్న మరణంతో కొన్ని నెలలు సైలెంటుగా ఉండిపోయిన వెంకీ.. మూడు నెలల కిందటే బయటికి వచ్చాడు. రైటర్‌ ఆకుల శివతో కలిసి కేరళకు వెళ్లి కథా చర్చలు జరిపి వచ్చాడు. మేలో ఓ ప్రెస్‌ మీట్‌కు వచ్చిన వెంకీ.. జూన్‌లో తాను చేయబోయే రెండు కొత్త సినిమాలకు సంబంధించి వివరాలు వెల్లడిస్తానని చెప్పాడు. ఈ ఏడాది ఆ రెండు సినిమాల షూటింగ్‌లోనూ పాల్గొంటానని చెప్పాడు.

కానీ జూన్‌ నెల గడిచిపోయింది. జులై కూడా ముందుకు సాగుతోంది. కానీ వెంకీ తర్వాతి సినిమా గురించి ప్రకటన లేదు. మరోవైపు రానా ఏమో.. బాబాయితో కలిసి మల్టీ స్టారర్‌ చేయబోతున్నానని.. ఆ ప్రాజెక్టు వచ్చే ఏడాది మొదలవుతుందని చెబుతున్నాడు. వెంకీ చెబుతున్న రెండు ప్రాజెక్టుల్లో ఇదొకటి అయ్యుండొచ్చు. మరి ఆకుల శివ కథతో చేయబోయే సినిమాకు డైరెక్టర్‌ ఎవరు? ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? అన్నదే తెలియడం లేదు. మామూలుగా ఆకుల శివ వి.వి.వినాయక్‌ కోసమే కథలు రాస్తుంటాడు. దీన్ని బట్టి అఖిల్‌ సినిమా పూర్తి చేశాక ఆకుల శివ కథతో వెంకీ హీరోగా వినాయక్‌ సినిమా తీస్తాడేమో అనుకున్నారు. ఐతే ఇంతలోనే మెగాస్టార్‌ 150వ సినిమా కోసం వినాయక్‌ రేసులో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. వెంకీ సినిమాపై ప్రకటన రాకపోవడానికి ఇదే కారణమో మరేంటో తెలియదు కానీ.. వెంకీ మాత్రం తన కొత్త సినిమా కోసం మరీ ఎక్కువ గ్యాప్‌ తీసుకుంటున్నాడని ఆయన ఫ్యాన్స్‌ ఫీలవుతున్నారు.