Begin typing your search above and press return to search.

దయచేసి వినండి: దారి మూసివేశారు

By:  Tupaki Desk   |   23 May 2015 4:16 AM GMT
దయచేసి వినండి: దారి మూసివేశారు
X
ఆరునూరైనా హుస్సేన్ సాగర్ ప్రక్షాళన పనులు చేపట్టి తీరుతం..అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనలు ఆచరణలో పెడుతున్నట్లు కనిపిస్తున్నాయి. కొద్దికాలం క్రితం వరకు కోర్టు కేసులు తదితర అంశాల్లో వెనకడుగు వేసినట్లు కనిపించినా..తాజాగా వేగం పుంజుకుంటోంది. సాగర్ ప్రక్షాళన పనుల్లో భాగంగా చేపడుతున్న నాలా మళ్లింపు పనుల కారణంగా మే 23 నుంచి 31 వరకు ట్యాంక్‌బండ్‌పై రాకపోకలను నిషేధించారు.

లిబర్టీ నుంచి రాణిగంజ్ వరకు వాహనాల రాకపోకలకు వీలు లేకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. బుద్ధభవన్ నుంచి రాణిగంజ్- కలాసీగూడ నాలా వరకు పారిశ్రామిక వ్యర్థ జలాలను మళ్లించేందుకు భారీ పైప్‌లైన్ వేయనున్నందున ట్రాఫిక్ పోలీసుల నుంచి అనుమతులు తీసుకొని రాకపోకలు నిలిపివేసినట్లు జలమండలి వర్గాలు పేర్కొంటున్నాయి.

కూకట్‌పల్లి, జీడిమెట్ల నాలాల నుంచి రోజువారీగా వచ్చి చేరుతున్న 400 మిలియన్ లీటర్ల పారిశ్రామిక వ్యర్థ జలాలు సాగర్‌లోకి చేరకుండా నేరుగా అంబర్‌పేట్‌లోని మురుగు శుద్ధి కేంద్రానికి మళ్లించేందుకు సుమారు రూ.40 కోట్ల అంచనా వ్యయంతో నాలా మళ్లింపు పనులు చేపడుతున్నారు. ఈ పనుల్లో భాగంగా ప్రకాశ్‌నగర్- నెక్లెస్‌రోడ్డు - పి.వి.ఘాట్- జీహెచ్‌ఎంసీ హెర్బల్ గార్డెన్- మారియట్ హోటల్ మార్గాల్లోనూ నాలా మళ్లింపు పనులను యుద్ధప్రాతిపాదికన చేపడుతున్నారు.

సో..ఆ దారిలో ప్రయాణం ప్లాన్ చేసుకుంటే..ఓ వారం పాటు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందే.