Begin typing your search above and press return to search.

మొండం నుంచి వెన్నుముక వేరు పడినా బతికాడు

By:  Tupaki Desk   |   25 May 2015 5:30 PM GMT
మొండం నుంచి వెన్నుముక వేరు పడినా బతికాడు
X
తల నుంచి వెన్నుముక వేరు పడింది. మనిషి వ్యవస్థలకు కీలకంగా ఉండే వెన్నుపాము మొండం నుంచి విడిపడింది. మరి.. ఇలాంటి సమయంలో మనిషి బతకటం సాధ్యమేనా? అంటూ సాధ్యం కాదనే చెబుతారు. కానీ.. బ్రిటన్‌కు చెందిన 29 ఏళ్ల టోనీ కోవాన్‌ మాత్రం బతికి బట్టగట్టాడు.

వైద్యులను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే ఈ ఉదంతం.. వైద్య చరిత్రలోనూ అపురూపమైందిగా చెబుతున్నారు. అయితే.. మొండం నుంచి వెన్నుపాము విడిపడినప్పటికీ.. దాన్ని సరిచేసి.. మళ్లీ జాయింట్‌ చేస్తూ.. శస్త్రచికిత్స చేయటమే కాదు.. దాన్ని విజయవంతంగా పూర్తి చేయటంలో భారతసంతతి వైద్యుడు ఉండటం గమనార్హం.

గత ఏడాది టోనీ కోవాన్‌ స్పీడ్‌గా తన కారులో వెళుతూ.. రోడ్డు మీదున్న స్పీడ్‌బ్రేకర్‌ను చూసుకోలేదు. దీంతో.. అదుపుతప్పిన కారు.. రోడ్డు పక్కనే ఉన్న టెలిఫోన్‌ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతగాడి మొండానికి వెన్నుముక విడిపోయింది. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని పారా మెడికల్‌ సిబ్బంది.. పోలీసుల సాయంతో ఆసుపత్రికి చేర్చారు. మొండానికి వెన్నుముక విడిపోయిన విషయం స్కానింగ్‌లో చూసిన వైద్యులు అతనికి అందిస్తున్న అత్యవసర చికిత్సను నిలిపివేయాలని భావించారు.

దీనికి సంబంధించి.. అతని కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ యువకుడు బతకటం అసాధ్యమన్న వైద్యుల మాటతో.. అతనికి వీడ్కోలు చెప్పేందుకు అతని కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్న వేళ.. ఒక అద్భుతం చోటు చేసుకొని అతను కళ్లు తెరిచాడు. దీంతో ఆశ్చర్యపోయిన వైద్యులు.. భారత సంతతికి చెందిన న్యూరో సర్జన్‌ అనంత్‌ కామత్‌ను సంప్రదించారు. ఈ సంక్లిష్టమైన కేసును టేకప్‌ చేసిన ఆయన.. అత్యంత కష్టసాధ్యమైన శస్త్ర చికిత్సకు సిద్ధమయ్యారు.

మొండం నుంచి విడివడిన వెన్నుపామును.. బోల్డు సాయంతో తిరిగి సరిదిద్దారు. ఈ తరహా ఆపరేషన్‌ ప్రపంచంలోనే మొదటిదిగా చెబుతున్నారు. చివరకు వైద్యుల శ్రమ ఫలించింది. చనిపోవటం ఖాయమనుకున్న ఆ కుర్రాడు బతకటమే కాదు.. చిన్న చిన్న మాటల్ని సైతం మాట్లాడుతున్న పరిస్థితి. అతి త్వరలో అతను ఆసుపత్రికి నుంచి ఇంటికి వెళ్లనున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వైద్య చరిత్రలో ఇదో అద్భుతంగా అభివర్ణిస్తున్నారు.