Begin typing your search above and press return to search.

భానుడి భగభగతో రెండు రాష్ట్రాల్లో 734 మంది బలి

By:  Tupaki Desk   |   25 May 2015 5:43 AM GMT
భానుడి భగభగతో రెండు రాష్ట్రాల్లో 734 మంది బలి
X
పెరుగుతున్న టెంపరేచర్‌కు తగ్గట్లే.. తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వడదెబ్బ తాకిడికి బలి అవుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గత వారం రోజులుగా మండిస్తున్న ఎండలతో ఆదివారం ఒక్కరోజే బలి అయిన వారి సంఖ్య 734కు చేరుకుంది.

ప్రభుత్వ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం.. ప్రజల ప్రాణాల మీదకు తీసుకొస్తుంది. ఊహించని విధంగా ఎండలు మండుతున్న సమయంలో.. భారీ ఉష్ణోగ్రతల విషయంపై ప్రజలకు అవగాహన కలిగించేలా వ్యవహరించటం.. వారు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవటంతో పాటు.. కూలీనాలీ చేసుకునే వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉన్న పక్షంలో.. మరణాలు ఇంత భారీగా ఉండవన్న వాదనలు వినిపిస్తున్నాయి.

గతం వారం వ్యవధిలో రెండు తెలుగురాష్ట్రాల్లో కలిపి దాదాపు 2500 పైనే మృత్యువాత పడ్డారు. ఈ మరణాలన్నీ ఎండ తీవ్రత తాళలేక.. వడదెబ్బకు బలి అయిపోయిన వారే కావటం గమనార్హం.

గత ఆరు రోజులతో పోలిస్తే.. తెలంగాణలో ఒకట్రెండు సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత తగ్గితే.. ఏపీలో మాత్రం భానుడు భగభగలాడిపోతున్నాడు. సరాసరిన తెలంగాణలో ఉష్ణోగ్రతలు 44 నుంచి 45 మధ్యలో నమోదైతే.. ఏపీలో మాత్రం 45 నుంచి 47 మధ్య నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఆదివారం అత్యధికంగా రామగుండంలో 45.. నిజామాబాద్‌లో 44.. హైదరాబాద్‌లో 42 డిగ్రీలు నమోదయ్యాయి. ఇది సాధారణం కంటే రెండు డిగ్రీల అధికం.

కాగా.. ఏపీలో మాత్రం ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో మినిమం 42 డిగ్రీలు.. మ్యాగ్జిమమ్‌ 47 డిగ్రీల టెంపరేచర్‌ టచ్‌ అయ్యాయి. ఇది సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతలతో పోలిస్తే.. ఐదు నుంచి ఏడు డిగ్రీలు అధికం కావటం గమనార్హం. మొత్తమ్మీదా భానుడి భగభగలతో రెండు తెలుగు రాష్ట్రాల వారు అల్లాడిపోతున్నారు.

ఇక.. మృతుల విషయానికి వస్తే ఏపీలో అత్యధికంగా ఒక్క ఆదివారం నాడే 485 మంది మృతి చెందారు. వీరిలో ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 98 మంది మృత్యువాత పడగా.. గుంటూరు 71.. కృష్ణా 63..నెల్లూరు 60.. తూర్పుగోదావరి జిల్లా 34.. విజయనగరం జిల్లా 31 మంది ఉన్నారు. మిగిలిన జిల్లాల్లోనూ మృతులు ఉన్నారు. ఇక.. తెలంగాణరాష్ట్రంలో ఒక్క ఆదివారమే 249 మంది మరణించారు. హైదరాబాద్‌ మినహా మిగిలిన అన్నీ జిల్లాల్లోనూ వడదెబ్బ మరణాలు ఉండటం గమనారహం. అత్యధికంగా వరంగల్‌లో 62 మంది మృతి చెందగా.. ఆ తర్వాతి స్థానంలో ఖమ్మం (49).. కరీంనగర్‌ (45).. నల్గండ (44)లు ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ మృతులు ఉన్నారు.