Begin typing your search above and press return to search.

డైలాగ్స్‌ తక్కువ, యాక్షన్‌ ఎక్కువ: తమన్నా

By:  Tupaki Desk   |   7 July 2015 11:30 AM GMT
డైలాగ్స్‌ తక్కువ, యాక్షన్‌ ఎక్కువ: తమన్నా
X
బాహుబలి లాంటి అసాధారణ ప్రాజెక్టులో కథానాయికగా అవకాశం అంటే ఆషామాషీనా? అందునా రాకుమారిలా మురిపించాలి. కత్తి చేపట్టి యుద్ధాలు చేయాలి. అన్నిటికీ సై అంది మిల్కీ. నేను సైతం అంటూ రాజమౌళి, ప్రభాస్‌ అండ్‌ టీమ్‌తో కలిసి కథనరంగంలోకి దూకింది. ఈ శుక్రవారం రిలీజ్‌ సందర్భంగా మిల్కీవైట్‌ బ్యూటీ తమన్నా ఏం చెప్పిందంటే..

=పదేళ్ల తర్వాత ఓ అంతర్జాతీయ స్థాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని పిస్తోంది. 10వసంతాలు ముగిసినా.. ఇప్పుడే కెరీర్‌ మొదలెట్టానా అనిపిస్తోంది. ఇదంతా బాహుబలి వల్లే.

=నాలుగు భాషల్లో రిపోర్ట్‌ ఎలా ఉంటుందో అన్న ఆత్రంతో ఎదురు చూస్తున్నా తప్ప ఎలాంటి ఒత్తిడి నాపై లేదు. ప్రేక్షకుల మధ్యలో కూచుని సినిమా చూడబోతున్నా.

=ఫలానా స్టార్‌ వల్ల విజయం వస్తుందని నమ్మి బాహుబలి సినిమా తీయరు. ఫలానా పాత్రకి ఫలానా నటి సరిపోతుంది అని నమ్మితే కబురు పంపిస్తారు. అలానే అవంతిక పాత్రలో అవకాశం వచ్చింది.

=ఎన్నో కమర్షియల్‌ సినిమాల్లో నటించినా ఈ సినిమా ప్రత్యేకం. అవంతిక పాత్ర ఎప్పటికీ మర్చిపోలేనిది. డైలాగులు తక్కువ. యాక్షన్‌ ఎక్కువ.

=ఈ సినిమా ప్రతిదీ కల్పితమే. రచయిత, దర్శకుడు ఊహించిన కొత్త విజువల్స్‌ ఇవి. అందువల్ల ఫలానా పాత్రని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవడానికో, అనుకరించడానికో ఛాన్సే లేకుండా పోయింది. రాజమౌళి ఏం చెబితే అదే చేశాను. నటన, కాస్ట్యూమ్స్‌ సహజసిద్ధంగా తయారైనవే. ముఖ్యంగా కాస్ట్యూమ్‌ డిజైనర్లను అభినందించాలి.

=ఒక బ్లూమేట్‌ ముందు నటించాలి. అక్కడ కొండలు లేవు. జలపాతాలు లేవు. ప్రకృతి అసలే లేదు. అయినా అవన్నీ ఉన్నాయి అని ఊహించుకుని నటించాలి. అది కాస్త ఆశ్చర్యంగానే అనిపించినా ఒక నటికి అదే ఛాలెంజ్‌. ఆసక్తి కలిగించిన సన్నివేశాలవి.

=పర్వతాలపై మైనస్‌ 2 డిగ్రీల సెంటిగ్రేడ్‌లో నటించాను. బల్గేరియాలో మైనస్‌ 10 డిగ్రీల సెంటిగ్రేడ్‌ల వద్ద పనిచేశాను. అది మర్చిపోలేని అనుభవం. అలాంటి చోట యాక్షన్‌ సన్నివేశాలు అంటే అసాధారణం. బల్గేరియాలోనే నా పుట్టినరోజు చేసుకోవడం మరిచిపోలేనిది.

= సాహసాలన్నా, ఎత్తయిన ప్రదేశాలన్నా భయం. చిన్న పిల్లలతోనూ పోటీపడలేను. అలాంటిది బాహుబలి చేశాక ఆ భయం పోయింది.

=బాహుబలి నా హిందీ కెరీర్‌కి ప్లస్‌. ఈ చిత్రంతోనే అక్కడ పరిచయమవుతున్నా అనిపిస్తోంది. కరణ్‌జోహార్‌ లాంటి స్టార్‌ డైరెక్టర్‌ విడుదల చేస్తున్నారు కాబట్టి క్రేజు రెట్టింపైంది.

=రాజమౌళి నేను అభిమానించే దర్శకుడు. క్లారిటీతో సినిమా తీస్తారు. ఓసారి ముచ్చటిస్తే చాలు ఎలా నటించాలో క్లారిటీ వచ్చేస్తుంది. సెట్స్‌లో చాలాసార్లు పొగిడారు. అది ఎప్పటికీ మర్చిపోలేను.

=బాహుబలి 2లో చాలా చిన్న పాత్రలో కనిపిస్తా. ది బిగినింగ్‌ పార్ట్‌లోనే నేను ఎక్కువగా తెరపై కనిపిస్తాను.

=బాహుబలితో ప్రభాస్‌ ఇమేజ్‌ పూర్తిగా మారిపోతుంది. కొత్త ప్రభాస్‌ కనిపిస్తాడు. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించే సత్తా ఉన్న హీరో. మిస్టర్‌ పెర్ఫెక్ట్‌, మిర్చి లాంటి కమర్షియల్‌ సినిమాల్లో ఎంతగొప్పగా నటించాడో చారితక్ర నేపథ్యం ఉన్న చిత్రంలోనూ అంతే గొప్పగా నటించాడు.