Begin typing your search above and press return to search.

నాయినికి మద్దతిస్తున్న కాంగ్రెస్

By:  Tupaki Desk   |   23 May 2015 5:48 AM GMT
నాయినికి మద్దతిస్తున్న కాంగ్రెస్
X
తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి టీఆర్ఎస్ లో దాదాపు నంబర్ 2 స్థానం ఉంది. కేసీఆర్ దగ్గర మంచి చనువుంది. అయితే అలాంటి నాయిని నర్సింహారెడ్డికి టీఆర్ఎస్ మద్దతివ్వకుండా కాంగ్రెస్ మద్దతిస్తోంది. అదేంటి హోంమంత్రిగా ఉన్న వ్యక్తి సొంత పార్టీ వ్యతిరేకించడం..ప్రతిపక్షం మద్దతివ్వడం ఏంటనుకుంటున్నారా?! అదే మరి నాయిని ప్రత్యేకత.

చెరువులను సంరక్షించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మిషన్‌ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఈ పదం పలకడంలో తత్తరపడ్డారా లేకపోతే క్షేత్రస్థాయి వాస్తవాలు తెలిసి మాట్లాడారో కానీ నాయిని వారు ‘మిషన్‌ కాకతీయ’ను ‘కమీషన్‌ కాకతీయ’ చేసేశారు. అది కూడా వరుసగా రెండో రోజు అదే వ్యాఖ్య. టీఆర్‌ఎస్ఎల్పీలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ మిషన్‌ కాకతీయను కమీషన్‌ కాకతీయ అని నాయిని వ్యాఖ్యానించారు. నాయిని ఇలా మాట్లాడటం ఏంటని పార్టీ నాయకులు, అధికారులు చర్చించుకున్నారు. అయితే నాయిని శుక్రవారం అదే కామెంట్ ను కొనసాగించారు. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 1లోని వెంగళరావు పార్కు ప్రాంగణంలో రూ.66 లక్షలతో చేపడుతున్న మురుగునీటి పైప్‌లైన్‌ పనులను మంత్రి హరీశ్‌ రావు, ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి తదితరులతో కలిసి నాయిని ప్రారంభించారు. ఆ తర్వాత హరీశ్‌ రావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం నాయిని విలేకరులతో మాట్లాడుతూ చెరువులను సంరక్షించేందుకు హరీశ్‌ ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ‘కమీషన్‌ కాకతీయ’ను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని అనటంతో అధికారులంతా నిశ్చేష్టులయ్యారు. తన ప్రసంగాన్ని కొనసాగించిన నాయిని మరో సందర్భంలో మిషన్‌ కాకతీయ అని సంబోధించడం కొసమెరుపు!

హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఘాటుగా స్పందించింది. నాయిని నోటి నుంచి వచ్చిన మాట అక్షర సత్యమని, మిషన్‌ కాకతీయ.. కమీషన్‌ కాకతీయగా మారిందని మాజీ మంత్రి, మెదక్‌ డీసీసీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. మెదక్‌ జిల్లాలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ మిషన్‌ కాకతీయ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను ఏమాత్రం పాటించడం లేదని, ఈ పనులు కేవలం అధికార పార్టీ కార్యకర్తల జేబులు నింపడానికే అన్నట్లు ఉన్నాయని ఆరోపించారు. అవి ప్రభుత్వ పనుల్లా కాకుండా టీఆర్‌ఎస్‌ పార్టీ పనుల్లా జరుగుతున్నాయని ఆరోపించారు. బిల్లులు మంజూరు చేసే ముందు విజిలెన్సు విచారణ జరపాలని ఆమె డిమాండ్‌ చేశారు.

ఆ విధంగా మంత్రిగారు ప్రతిపక్షాల మద్దతు సైతం పొందారు.