Begin typing your search above and press return to search.

సోనియాకు మిగిలేది ఏడుపేనా!?

By:  Tupaki Desk   |   1 July 2015 5:30 PM GMT
సోనియాకు మిగిలేది ఏడుపేనా!?
X
ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా ముక్కలు చేసిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి చివరికి మిగిలేది ఏడుపేనా!? ఆ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ అధికారంలోకి రావడం ఇక అసాధ్యమేనా!? రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రాకపోతే కేంద్రంలో అధికారంలోకి రావడం కూడా ఇక కలేనా!? నూట పాతికేళ్ల కాంగ్రెస్‌ పార్టీ ఇక చరిత్రలో కలిసి పోవాల్సిందేనా!? రెండు రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ నాయకులను అతి దారుణంగా తొలిచేస్తున్న ప్రశ్నలివి. కొంతమంది నాయకులు పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా.. పార్టీ పరిస్థితిపై ప్రతి ఒక్కరూ మనసులో తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతూనే ఉన్నారు.

రాష్ట్ర విభజనకు ముందు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఇతర పార్టీలకు చాలా మంది నాయకులు వెళ్లిపోయారు. కానీ, అవన్నీ ఆ పార్టీని ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. కానీ, ఇటీవలి పరిణామాలు మాత్రం ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో బత్స సత్యనారాయణ బలమైన నాయకుడు. అందులో తిరుగులేదు. కాంగ్రెస్‌ పార్టీకి ఇక సీను లేదని, ఆ పార్టీలో ఉండి ప్రయోజనం లేదని ఆయన వైసీపీ తీర్థం పుచ్చేసుకున్నారు. తెలంగాణలో పార్టీకి బలమైన నాయకుల్లో ఒకడు డి.శ్రీనివాస్‌. తెలంగాణ రావడానికి ఆయన కూడా ఒక కారణం. తెర వెనుక మంత్రాంగం నడిపిన వారిలో ముఖ్యుడు కూడా. అలాంటి వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై కొట్టి టీఆర్‌ఎస్‌లో చేరిపోతున్నాడు. ఇది కాంగ్రెస్‌ పార్టీకి నిజంగానే పెద్ద షాక్‌!

డీఎస్‌తోపాటే ఇప్పుడు పలువురునాయకులు కాంగ్రెస్‌ను విడిచిపెట్టి కారు ఎక్కేయడానికి సిద్ధపడుతున్నారు. డీఎస్‌తోపాటు చాలామంది వెళ్లిపోయినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే సీమాంధ్ర తరహాలోనే తెలంగాణలోనూ కాంగ్రెస్‌ పార్టీ రాబోయే పదేళ్లలో కోలుకోవడం కష్టమే. నాయకులు వెళ్లిపోతే కిందిస్థాయి కార్యకర్తలూ వెళ్లిపోతారు. అదే జరిగితే, తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్‌ పార్టీకి సోనియా గాంధీకి ఒరిగేది ఏమీ ఉండదు. ఏపీని విభజించింనందుకు తీరిగ్గా కూర్చుని చింతించడం తప్ప అని ఆ పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.