Begin typing your search above and press return to search.

ఇదే.. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌

By:  Tupaki Desk   |   25 May 2015 4:02 PM GMT
ఇదే.. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌
X
ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించి మరో ప్రక్రియ ముగిసింది. సింగపూర్‌ డిజైన్‌ చేసి మాస్టర్‌ప్లాన్‌ కాపీని.. సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్‌లో మాస్టర్‌ప్లాన్‌పై సింగపూర్‌ బృందం పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చింది.

సహజ వనరుల్ని సద్వినియోగం చేసుకునేలా గ్రీన్‌ప్లాన్‌ తయారు చేశామని.. అమరావతి నిర్మాణం నాలుగేళ్లలో పూర్తి అయ్యేది కాదని చెప్పేశారు. కొన్ని దశాబ్దాల పాటు అమలు చేయాల్సిన ప్లాన్‌గా సింగపూర్‌ మంత్రి అభివర్ణించారు. ఉపాధి అవకాశాల్ని పెంచుతుందని మాస్టర్‌ ప్లాన్‌ ప్రజంటేషన్‌లో ఆయన చెప్పారు.

ఏపీ అధికారులు అద్భుతంగా సహకరించారని.. అందువల్లే మాస్టర్‌ప్లాన్‌ను చాలా వేగంగా అందించగలిగామని ఆయన వ్యాఖ్యానించారు. మచిలీపట్నం.. వాన్‌పిక్‌ ఓడరేవులు సమన్వయం చేసుకొని అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మాస్టర్‌ ప్లాన్‌ మొత్తం పక్కా వాస్తుతో సిద్ధం చేయటం ఒక విశేషంగా చెప్పొచ్చు. ఈ శతాబ్దపు రాజధానిగా అమరావతి రూపొందిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.

అమరావతిని ఒక డైనమిక్‌ సిటీగా ఉండాలని కోరుకుంటున్నానని.. ఏపీ ప్రజలంతా దీనికి సహకరించాలని చెప్పిన చంద్రబాబు.. ల్యాండ్‌పూలింగ్‌లో భాగంగా రైతులు 17 ఏకరాలకు సంబంధించిన ఒప్పందాలు పూర్తి అయ్యాయని చెప్పుకొచ్చారు. అమరావతి నిర్మాణాన్ని జూన్‌ ఆరో తేదీన భూమి పూజ చేసినప్పటికీ.. విజయదశమి రోజు నుంచి పనులు ప్రారంభిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

మాస్టర్‌ప్లాన్‌ విశేషాలు

= ఏపీ రాజధాని మాస్టర్‌ప్లాన్‌ నిర్మాణాన్ని 270 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో నిర్మిస్తారు.

= పూర్తి వాస్తుతో ఉండేలా డిజైన్‌ చేశారు.

= ఏడు సెక్టార్లలో నూతన రాజధాని నిర్మాణం.

= అమరావతి చుట్టూ పారిశ్రామిక కారిడార్‌.

= ప్రపంచస్థాయిలో రహదారుల నిర్మాణం.. 155 కిలోమీటర్ల మేర అనుబంధ రోడ్లు.

= 332 సబ్‌ అర్టిలరీ రోడ్లు. వీటిని కనెక్ట్‌ చేసేలా 324 కిలోమీటర్లలో రోడ్డు నిర్మాణం.

= గ్రీన్‌నెట్‌వర్క్‌ పేరిట 27 కిలోమీటర్లలో ఏర్పాటు

= సీడ్‌ క్యాపిటల్‌ మధ్యన బ్రహ్మస్థాన్‌ పేరుతో పార్క్‌ నిర్మాణం.

= 5 వేల ఎకరాలతో అంతర్జాతీయ విమానాశ్రయం.

= 127 కిలోమీటర్ల మేర వరల్డ్‌క్లాస్‌ ఎక్స్‌ప్రెస్‌.. సెమీ ఎక్స్‌ప్రెస్‌వేలు.

= కృష్ణా ముఖద్వారం వద్ద క్రికెట్‌ స్టేడియం ఏర్పాటు.

= మోటారు వాహనాలు తిరగకుండా ఉండే జోన్ల ఏర్పాటు.

= 1.10కోట్ల మందికి తగ్గట్లుగా రాజధాని నిర్మాణం.

= నగరం మొత్తం నాలుగులేన్ల రోడ్లు ఏర్పాటు.

= రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్ని కలుపుతూ రింగురోడ్డు.

= విజయవాడ నుంచి బెంగళూరు.. చెన్నై.. విశాఖ దిశగా ప్రధాన రహదారుల నిర్మాణం.

= అమరావతి నగరం నడిబడ్డున నుంచి 35 కిలోమీటర్ల మేర ప్రవహించే నది.