Begin typing your search above and press return to search.

మానవత్వానికి సాయం చేసే చేతులెన్నో..!

By:  Tupaki Desk   |   25 May 2015 12:14 PM GMT
మానవత్వానికి సాయం చేసే చేతులెన్నో..!
X
ఒక వ్యక్తి ఇంట్లో కేవలం రెండు కుర్చీలు ఉన్నాయని తెలిసిన వెంటనే.. అతనికి ముక్కు ముఖం తెలీని వ్యక్తి.. అతను ఉండే ఇంటికి అవసరమైన ఫర్నీచర్‌ పంపే అవకాశం ఉంటుందా? ఛాన్సే లేదు. కానీ.. మూర్తీభవించిన మానవత్వంతో వ్యవహరించిన వ్యక్తిని.. లోకం మొత్తం కాకున్నా.. చాలామంది గుర్తుంచుకుంటారు. అతనికి కష్టం ఉందంటే ఆదుకునేందుకు తాము సైతం అన్నట్లు వ్యవహరిస్తారు.

తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది. ఆస్ట్రేలియాలో ఒక బాలుడికి రోడ్డు యాక్సిడెంట్‌ అయి.. రక్తం కారుతున్న సందర్భంలో తన మతాచారాల్నిసైతం పక్కన పెట్టి.. పిల్లాడ్ని కాపాడేందుకు తన నెత్తికి చుట్టుకున్న గుడ్డను తీసి కట్టిన హర్మాన్‌ సింగ్‌ గుర్తుకు వచ్చే ఉంటాడు.

సిక్కు మతస్తులు తమ నెత్తికి చుట్టుకునే తలపాగాను ఎట్టి పరిస్థితిల్లో విప్పరు. అలా విప్పటాన్ని చాలా పెద్దతప్పుగా భావిస్తారు. అలాంటిది.. ఈ యువకుడు ఇవేమీ పట్టించుకోకుండా.. ఒక చిన్నారిని కాపాడేటమే తన లక్ష్యంగా వ్యవహరించి ఆదుకున్నాడు. అతని పనిని.. ఒకరు వీడియో తీయటం.. దాన్ని యూట్యూబ్‌లోపెట్టటం.. అది కాస్తా వైరల్‌లా పాకిపోయి ప్రపంచాన్ని చుట్టేయటం తెలిసిందే.

ఈ యువకుడు చేసిన చర్య పట్ల పెద్దఎత్తున ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఇతన్ని ఇంటర్వ్యూ చేసేందుకు ఒక టీవీ ఛానల్‌ ప్రతినిధులు అతని ఇంటికి వెళ్లినప్పుడు.. అతని ఇంట్లో కేవలం రెండుకుర్చీలు మాత్రమే ఉన్నాయని.. అతగాడు నేల మీదే పడుకుంటాడన్న విషయాన్ని తెలియజేశారు. దీన్ని చూసి స్పందించిన ఒక బిజినెస్‌మ్యాన్‌.. వెంటనే అతనింటికి ఉచితంగా ఫర్నీచర్‌ పంపారు.

దీంతో.. హర్మాన్‌సింగ్‌ ఆనందంతో కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇక.. కారు ప్రమాదంలో గాయపడిన చిన్నపిల్లాడి కుటుంబం అయితే.. అతగాడిని తమ ఇంటి వ్యక్తిగా భావిస్తుంది. తమ కుటుంబంలో సభ్యుడిగా చూసుకుంటున్నారు. ఈ ఉదంతం చూసినప్పుడు మానవత్వంతో వ్యవహరించే వారిని ఆదుకునేందుకు.. అతనికి స్నేహహస్తం చాచేందుకు చాలామందే ఉంటారనిపించక మానదు.