Begin typing your search above and press return to search.

ఏం అడిగాడు; ఎన్టీఆర్‌.. వైఎస్‌ల కంటే మగాళ్లా..?

By:  Tupaki Desk   |   25 May 2015 4:02 PM GMT
ఏం అడిగాడు; ఎన్టీఆర్‌.. వైఎస్‌ల కంటే మగాళ్లా..?
X
వినయంగా.. విధేయతతో.. చాలా మర్యాదతో మాట్లాడుతూ.. నేను చిన్నవాడు.. మీరు అనుభవం ఉన్న వారు.. పెద్దవారు.. మీలాంటి వారు సలహాలు ఇవ్వాలి.. మనమందరం కలిసి పని చేయాలంటూ చాలా నమ్రతతో మాట్లాడే నటుడు శివాజీ.. తన మాట.. బాట మారుస్తున్నారు.

మొన్నటివరకూ చాలా మర్యాదగా మాట్లాడిన ఈ యువహీరో ఇప్పుడు అందుకు భిన్నంగా యాంగ్రీ యంగ్‌మెన్‌ మాదిరిగి రియాక్ట్‌ కావటమే కాదు.. నాలో మీరు చూస్తున్న కోణమే కాదు.. చూడాల్సిన కోణాలు చాలానే ఉన్నాయంటూ మాటల తూటాలు పేలుస్తున్నాడు.

ఏపీకి ప్రత్యేకహోదా తీసుకురావటం ద్వారా ఎంతోకొంత మేలు జరుగుతుందని భావిస్తున్న శివాజీ.. అందులో భాగంగా ఇప్పటికే పలు కార్యక్రమాలునిర్వహించిన విషయాన్ని మర్చిపోకూడదు. నిరాహారదీక్షను చేసి.. ప్రత్యేకహోదాకు సంబంధించి రాజకీయంగా కాస్తంత కదలిక వచ్చిందంటే అది శివాజీ పుణ్యమే. అలాంటి శివాజీ తాజాగా చెలరేగిపోయారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అఖిలపక్షం వేయాలంటూ డిమాండ్‌ చేసిన శివాజీ.. ఈ విషయంపై బాబు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు.. ఇప్పుడున్న మంత్రులంతా మధ్యతరగతి నుంచి వచ్చిన వారేనని.. వాళ్ల తాతలేమీ జమిందార్లు కాదన్నారు.

ఒక పెద్దమనిషి ఎక్కువ మాట్లాడుతున్నాడని తనని ఉద్దేశించి ఒకరు వ్యాఖ్యానించారని.. ముందు ముందు దీనికంటే వందరెట్టు ఎక్కువ మాట్లాడతానన్నారు. ఇప్పుడున్న నేతలు వారి బ్యాక్‌గ్రౌండ్‌ను ప్రస్తావిస్తూ.. వీళ్లేమైనా ఎన్టీఆర్‌.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కన్నా మగాళ్లా? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేకహోదా వచ్చే వరకూ తాను ఇలానే మాట్లాడతానని తేల్చి చెప్పిన శివాజీ.. ప్రత్యేకహోదా ఇచ్చిన తర్వాత తాను ఎక్కడా కనిపించనని.. అవసరమైతే దేశంలో కూడా కనిపించనంటూ వ్యాఖ్యలు చేశారు. అంతవరకూ మాత్రం ప్రాణం పోయినా పట్టించుకోనని తేల్చేశాడు.