Begin typing your search above and press return to search.

తుపాకీ ప్రత్యేకం: మొన్నటి రూపాయి.. ఇప్పటి రూ.5

By:  Tupaki Desk   |   26 May 2015 11:30 AM GMT
తుపాకీ ప్రత్యేకం: మొన్నటి రూపాయి.. ఇప్పటి రూ.5
X
అచ్చేదిన్‌.. అచ్చేదిన్‌ అని ప్రధాని మోడీ చెప్పేస్తున్నారు. తన హయాంలో జనాల బతుకులు మారిపోతున్నాయంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గొప్పగా చెప్పేస్తున్నారు. ఇక.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాటల హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర సాధనతోనే.. రాష్ట్రం ధనవంతురాలని చెప్పేస్తున్నారు. రాష్ట్రం ధనవంతురాలు సరే.. రాష్ట్ర ప్రజల మాటేమిటంటే ఆయన సూటిగా సమాధానం చెప్పరు.

ఈ ముగ్గురు అధికారంలోకి వచ్చి ఒక వారం అటూఇటూగా ఏడాది పూర్తి అయ్యింది. ఏడాది క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నాటి యూపీఏ సర్కారు.. కాంగ్రెస్‌ పాలకుల్ని.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసి.. తమకు కానీ అవకాశం ఇవ్వాలే కానీ.. మొత్తంగా బతుకుల్ని మార్చేస్తామంటూ చాలా మాటలే చెప్పేశారు. విదేశాలకు తరలి వెళ్లిన నల్లధనాన్ని వందరోజుల్లో తీసుకొచ్చేసి.. దేశాన్ని ధనికురాల్ని చేయటంతో పాటు.. ఆ సొమ్మును దేశ ప్రజలకు పంచటం ద్వారా.. పెద్ద అద్భుతాన్నే సాధిస్తానని మోడీ చెప్పటం తెలిసిందే.

తెలంగాణ వచ్చేసింది.. ఇంక మిగిలింది బంగారు తెలంగాణ మాత్రమే అని చెప్పిన కేసీఆర్‌.. అది కూడా ఎంతోకాలం పట్టదన్నారు. అత్యంత దుర్మార్గులైన సీమాంధ్ర పాలకుల కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చిన తెలంగాణకు.. బంగారు తెలంగాణ సాధించటం పెద్ద కష్టమైన విషయం కాదని చెప్పారు. ఇంతకీ బంగారు తెలంగాణ ఏమిటంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మొదలు.. ఎవరూ సరైన అర్థం చెప్పడానికి సిద్ధపడటం లేదు. తెలంగాణ అధికారపక్షంలో మేధావులు అని చెప్పే వారు సైతం.. నీళ్లు నములుతారు. మరీ.. గట్టిగా నిలదీస్తే.. బంగారు తెలంగాణ అనేది ఒక భావనగా సూత్రీకరించేవారు ఉంటారు.

ఇక.. ఏపీకి విషయానికి వస్తే.. రైతులు.. డ్వాక్రా సంఘాల రుణమాఫీ మొదలు.. బాబు అధికారంలోకి వస్తే జాబులు వచ్చేస్తాయంటూ తెగ మాటలు చెప్పేసి ఏడాది అవుతోంది. మరెన్ని జాబులు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. కొత్త జాబులు ఎన్ని వచ్చాయన్న విషయం అందరికి తెలిసిందే.

మరో విచిత్ర పరిణామం ఏమిటంటే.. ప్రభుత్వాల తప్పుల్ని ఎత్తి చూపించే మీడియా వ్యవస్థ తన ధర్మాన్ని దాదాపుగా మర్చిపోయింది. జాతీయస్థాయిలో ఈ జాడ్యం కాస్తంత తక్కువగా ఉంటే.. ప్రాంతీయంగా మాత్రం కొత్త పుంతలు తొక్కుతోంది. పదేళ్ల పాటు సాగిన కాంగ్రెస్‌ సర్కారు చేపట్టిన ప్రతి విషయాన్ని చీల్చి చెండాడిన మీడియా.. గడిచిన ఏడాదిగా ఎంత నిర్మాణాత్మకంగా వ్యవహరించిందో తెలిసిందే.

ప్రభుత్వ విధానాల్ని ప్రచారం చేయటం తప్పు కాదు. కానీ.. ప్రభుత్వాధినేతల కలల్ని.. వాస్తవాలన్న రేంజ్‌లో ప్రచారం కల్పించటం.. ఆ కలల్ని వాస్తవరూపంలోకి మార్చే విషయంలో తప్పటడుగుల్ని ప్రశ్నించే వైఖరిని పూర్తిగా మర్చిపోయిన ధోరణి కనిపిస్తుంది. లేకుంటే.. సామాన్యడు నిత్యం వాడే కందిపప్పు కిలో నూట పది రూపాయిలు టచ్‌ చేస్తున్నా.. ఒక్కరోజు కూడా పేపర్లలో కథనాలుగా రాకపోవటం ఏమిటి? ఒక్క కందిపప్పు మాత్రమే కాదు.. మినపగుళ్ల ధరలతో పాటు.. నిత్యావసర వస్తువుల ధరలు మండుతున్నా పట్టించుకోవటం లేదు.. ప్రశ్నించటం లేదు. వీటితో పాటు.. పెట్రోల్‌.. డీజిల్‌ మీద ఇప్పుడున్న పన్నులు చాలవన్నట్లు.. మరింత వ్యాట్‌ రుద్దేస్తున్నా అడిగే నాథుడు లేడు. అదేమంటే.. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచితే.. ఆ భారం ప్రజల మీదే కదా? అంటూ చిత్రమైన వాదనను వినిపిస్తున్నారు. కాంగ్రెస్‌ను వ్యతిరేకించింది.. ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని.. కుంభకోణాలతో దేశ ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేస్తున్నారని.. ఎంతకూ తగ్గని ధరలతో సామాన్యులు.. మధ్యతరగతి వారు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారన్న విమర్శలు వినిపించేవి.

ఏ విమర్శల్ని అస్త్రాలుగా చేసుకొని అధికారాన్ని చేపట్టారో.. ఏడాది తర్వాత ఆ పరిస్థితుల్లో ఏ మార్పు లేకపోవడం కడుపు మండే విషయం. ఇది దేనికి నిదర్శనం. యూపీఏ సర్కారుతో పోలిస్తే.. కుంభకోణాలు మాత్రం కనిపించడం లేదు. అయితే.. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ.. పథకాల అమలులో పరిస్థితి ఏ మాత్రం మార్పు లేదన్న విషయం క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని చూసిన ప్రతిఒక్కరికి ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటికీ ప్రభుత్వ ఆఫీసుల్లోకి వెళితే.. చేతులు తడపందే పనులు జరగని పరిస్థితి. పోలీస్‌స్టేషన్‌కు వెళితే.. అప్పుడు ఎలానో ఇప్పుడూ అలానే. దళారులు బాగుపడుతున్నారు. కాంట్రాక్టర్లు దండుకుంటున్నారు. పైరవీలు సాఫీగా జరుగుతున్నాయి. ప్రజలు యాజిటీజ్‌గా ఏ పని స్థాయిలో దానికి లంచాలు ఇచ్చుకుని దిక్కులేక తప్పక పనులు చేయించుకుంటున్నారు. పాలకులు మారారే తప్పించి.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు రాలేదన్నది నిష్ఠుర సత్యం. దీనికి తోడు.. మరో కొత్త పరిణామం ఈ ఏడాదిలో చోటు చేసుకుంది. గతంలో ఏదైనా ధర పెంచాల్సి వస్తే.. ఒక రూపాయి.. రెండు రూపాయిలు పెంచి ఊరుకునేవారు. ఇప్పుడు మాత్రం అది కాస్తా ఐదు రూపాయిలు అయిపోయింది. గతంలో ఒక ప్లేట్‌ ఇడ్లీ 15 నుంచి రూ.20 కావటానికి కనీసం ఏడాది.. రెండేళ్లు పట్టేది. ఇప్పుడు అలాంటిదేమీ లేకుండా ఒక్కదెబ్బతో రూ.20 నుంచి రూ.25 పెంచేస్తున్నారు. రూపాయి ఎవరికీ ఆనడం లేదు.

ఇలాంటి పరిస్థితి హోటళ్ల దగ్గరే కాదు.. కొబ్బరిబొండాల విషయంలో కూడా మొన్నటివరకూ 20-25 పలికిన బొండాం.. ఇప్పుడు రూ.25-30 పలుకుతోంది. గతంలో ధర పెంచాల్సి వస్తే.. రూపాయి.. రెండు మాత్రమే పెంచేవారు. కానీ.. ఇప్పుడు మాత్రం ఏకంగా ఐదు రూపాయిలు పెంచేస్తున్నారు. ఏడాది కాలంలో మార్పు ఏమైనా వచ్చిందంటే.. మొన్నటి రూపాయి.. నేడు ఐదు రూపాయిలు అన్నదే చాలా స్పష్టంగా.. సామాన్యుడికి అర్థమయ్యేలా కనిపిస్తుంది. మరి దీన్నే అచ్చేదిన్‌ అనుకున్నా.. బంగారు తెలంగాణ అనమన్నా.. స్వర్ణాంధ్ర అనాల్సిందేనన్నా అనక తప్పదు. పాలకులు చెప్పిన మాటలు పాలితులు వినటం మనకు మామూలేగా.

కొసమెరుపు: జనాలకు చాలా కాలం క్రితమే రాజకీయాల మీద నమ్మకం పోయి వీరు ఏమీ చేయరు అనుకున్నారు. అయితే, ఎందుకో 2014లో టెక్నాలజీ ప్రవేశమో, కొత్తగా కొన్ని కరడుగట్టిన దేశాలూ స్వాతంత్య్రం సంపాదించుకున్న దాని ప్రభావమో, లేక యువతరం ఆవేశమో గాని అన్ని చోట్లా ఒకసారి జనం చివరగా ట్రై చేద్దాం అనుకున్నారు. కొత్త తీర్పు ఇచ్చారు. కానీ వారికి కనిపించిన ఫలితం మాత్రం పాతదే అని స్పష్టంగా తేలిపోయింది! 'బిజినెస్‌ మ్యాన్‌' సినిమాలో పూరీ చెప్పిన లాస్ట్‌ డైలాగ్‌ గుర్తుతెచ్చుకుని భ్రమలు తొలగించుకుని బతికేస్తున్నారు.

- గరుడ