Begin typing your search above and press return to search.

రేవంత్‌ బెయిల్‌.. పది అప్‌డేట్స్‌

By:  Tupaki Desk   |   30 Jun 2015 8:30 AM GMT
రేవంత్‌ బెయిల్‌.. పది అప్‌డేట్స్‌
X
ఓటుకు నోటు కేసులో అరెస్ట్‌ అయి.. ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి తాజాగా బెయిల్‌ లభించటం తెలిసిందే. కొన్ని షరతులతో న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఏర్పడిన పది పరిణామాలు చూస్తే..

1. రేవంత్‌కు బెయిల్‌ లభించిన సందర్భంగా ఆయన సతీమణి గీత మాట్లాడారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి రేవంత్‌ అరెస్ట్‌ అయినప్పడు పెదవి విప్పని ఆమె.. తాజాగా బెయిల్‌ లభించిన నేపథ్యంలో ఆమె స్పందించారు. అసంఖ్యాకంగా ఉన్న అభిమానుల ప్రార్థనల కారణంగానే తన భర్తకు బెయిల్‌ లభించిందని ఆమె చెప్పారు. జైలుకు వెళ్లినంత మాత్రాన తన భర్త వెనక్కి తగ్గరని.. ఆయన గతంలో మాదిరే రాజకీయాల్లో దూసుకుపోతారని వ్యాఖ్యానించారు. రాజకీయంగా మాత్రమే తన భర్తను వేధించిన వారు.. ఇలా వ్యక్తిగతంగా ఇలాంటి కేసుల్లో ఇరికిస్తారని తాము అనుకోలేదని చెప్పుకొచ్చారు. ప్రతిపక్ష నేతగా రేవంత్‌ తన పోరాటాన్ని కొనసాగిస్తారని స్పష్టం చేశారు.

2. రేవంత్‌కు కోర్టు బెయిల్‌ మంజూరు చేసిందన్న వార్తతో ఆయన కుటుంబం తీవ్ర భావోద్వేగానికి గురైంది. కోర్టు తీర్పునకు సంబంధించి విషయాల్ని మీడియా ద్వారా తెలుసుకున్న వారు.. ఇంట్లో టీవీల్లో ప్రసారమైన వార్తల్ని చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రేవంత్‌ కుమార్తె ఆనందభాష్పాలు కారుస్తూ.. భావోద్వేగానికి గురి కాగా.. రేవంత్‌ సతీమణి కుమార్తెను సముదాయించారు. రేవంత్‌కు బెయిల్‌ మంజూరు కావటం తెలుగుదేశం నేతల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. ఆంధ్రా.. తెలంగాణ అన్న తేడా లేకుండా నేతలంతా ఆనందంతో మాంచి హుషారుగా ఉన్నారు. మిఠాయిలు పంచుతున్నారు. కార్యకర్తల పరిస్థితి ఇలానే ఉంది.

3. రేవంత్‌కు బెయిల్‌ లభించిన విషయాన్ని రేవంత్‌ తరఫు లాయర్లు మీడియాకు వివరిస్తుండగా.. తెలంగాణ లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో జోక్యం చేసుకున్న పోలీసులు.. అభ్యంతరం చెబుతున్న లాయర్లకు సర్దిచెప్పి వారిని పంపించి వేశారు. రేవంత్‌కు కోర్టు బెయిల్‌ మంజూరు చేయటంతో.. ఆయన విడుదల కావటానికి సంబంధించిన ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసే వేగం పెంచారు. అన్ని అనుకున్నట్లుసాగితే.. మంగళవారం సాయంత్రానికి ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది.

4. రేవంత్‌కు హైకోర్టు బెయిల్‌ ఇవ్వటంతో. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని అవినీతి నిరోధక శాఖ భావిస్తోంది. ఇందుకు తగినట్లుగా కసరత్తు మొదలు పెట్టింది.

5. రేవంత్‌ విడుదల అయ్యాక ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గానికి పది వేల మందితో వెళ్లాలని తెలుగుదేశం పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

6. రేవంత్‌కు బెయిల్‌ లభించటంపై పలువురు టీటీడీపీ నేతలు న్యాయమే గెలిచిందని.. కుట్ర ద్వారా రేవంత్‌ను కేసులో ఇరికించారని విమర్శిస్తున్నారు.

7. రేవంత్‌కు బెయిల్‌ వార్త వెలువడిన వెంటనే ఆయన అభిమానులు ఆయన జైల్లో ఉన్న చర్లపల్లి వద్దకు భారీగా చేరుకొని సందడి చేస్తున్నారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు.. అభిమానులు జైలు వద్దకు చేరుకుంటున్నారు.

8. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి మే 31న ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేస్తే.. సరిగ్గా నెల రోజులకు జూన్‌ 30 నాడు ఆయనకు కోర్టు నుంచి బెయిల్‌ లభించింది.

9. రేవంత్‌కు బెయిల్‌ సందర్భంగా కోర్టు కొన్ని షరతుల్ని విధించిన సంగతి తెలిసిందే. అందులో ఏసీబీ ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరు కావటం. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా రేవంత్‌ బెయిల్‌ రద్దు అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

10. రేవంత్‌ బెయిల్‌ మంజూరు అయిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సర్కారుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తటం ఖాయమని చెబుతున్నారు. ఆయన తొలుత మీడియాతో మాట్లాడతారా? లేదా.. బహిరంగ సభ ఏర్పాటు చేసి మాట్లాడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.