Begin typing your search above and press return to search.

జేసీ రూటు మార్చడం వెనుక

By:  Tupaki Desk   |   23 May 2015 5:30 PM GMT
జేసీ రూటు మార్చడం వెనుక
X
అనంతపురం జిల్లాలో నోరున్న నేత... విభజన తరువాత కాంగ్రెస్‌ నుంచి అనూహ్యంగా అందరికంటే ముందే టీడీపీలోకి జంప్‌ చేసి ఏకంగా ఎంపీ అయిపోయిన జేసీ దివాకరరెడ్డి చాలాకాలంగా అసంతృప్తిగానే ఉన్నారు. ఏదో ఉన్నానంటే ఉన్నానన్నట్లుగా టీడీపీలో ఆయన కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఏమీ అనకపోయినా చంద్రబాబును ఇబ్బంది పెట్టేలా బీజీపీనో... కేంద్ర ప్రభుత్వాన్నో... లేదంటే నేరుగా ప్రధాని మోడీనో టార్గెట్‌ చేసి పదునైన విమర్శలు చేశారు పలుమార్లు. ఆయా సందర్భాల్లో చంద్రబాబు పిలిచి ఆయన్ను మందలించారు కూడా. దివాకరరెడ్డి సీనియారిటీ, చంద్రబాబుతో ఉన్న చనువు కారణంగా చంద్రబాబు కూడా ఆయన్ను ఏమీ అనలేని పరిస్థితి. దీంతో జేసీ తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూ తలనొప్పి తెచ్చేవారు. అయితే, తాజాగా ఆయన తన స్వరం మార్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన భేష్‌ అంటూ ప్రశంసలు కురిపించారు. దీంతో జేసీ ఎందుకు రూటు మారుస్తున్నారన్న చర్చ జరుగుతోంది.

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో పరిపాలన చేస్తున్నారని అనంతపురం ఎంపీ జెసి దివాకరరెడ్డి అంటున్నారు. అంతేకాదు, రాష్ట్రం అబివృద్ది చెందాలంటే అందరూ చంద్రబాబు నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలని కూడా ఆయన అన్నారు. చంద్రబాబు అనంతపురానికి అన్ని విధాల సాయం చేస్తానని ప్రకటించారని , ఇక్కడి సమస్యలపై ఆయనకు అవగాహన ఉందని జెసి చెప్పుకొచ్చారు. ఇంకో అడుగు ముందుకేసి అనంతపురం అంటే చంద్రబాబుకు అపారమైన ప్రేమ ఉందని కూడా ఆయన అన్నారు.

అయితే, అనంతపురంలో తాజా రాజకీయాలే జేసీని అంతలా మార్చేశాయని అంటున్నారు. ఏపీ కేబినెట్‌ విస్తరణలో అనంత నుంచి పయ్యావుల కేశవ్‌ కు అవకాశం ఇస్తారన్నది దాదాపుగా ఖరారైంది. కేశవ్‌ నిజానికి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆయన్ను ఎమ్మెల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు. కేశవ్‌ చంద్రబాబు బాగా లాయల్‌ గా ఉండడంతోనే ఆయనకు చంద్రబాబు అంతటి ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో జేసీ కూడా తన స్టైలు మార్చి చంద్రబాబుతో మంచిగా ఉండి ఈ అయిదేళ్లలో ఎప్పుడు చాన్సొచ్చినా కొద్దికాలమైనా కేంద్రంలో మంత్రి పదవి సంపాదించుకునే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం. ఆ వ్యూహంతోనే ఆయన ప్లేటు మార్చారంటున్నారు.