Begin typing your search above and press return to search.

ఇంటర్యూ: జీవితంలో మళ్లీ దక్కదనిపించింది

By:  Tupaki Desk   |   6 July 2015 1:30 PM GMT
ఇంటర్యూ: జీవితంలో మళ్లీ దక్కదనిపించింది
X
బల్లాలదేవ పోటెత్తాడు. వెండితెరపై తన విలనీతో బాహుబలిని ఖంగుతినిపించిన ఈ కండలవీరుడు, ఆఫ్‌ ది స్క్రీన్‌ తన మాటల గారడీతో మీడియాను సైతం గారడీ చేస్తున్నాడు. తన జర్నీ గురించి వివరిస్తూ చాలా విషయాలే చెప్పాడు. సినిమా కోసం పడిన కష్టాల నుండి, సినిమా తాలూకు శూరత్వం వరకు.. ఇతర నటుల నుండి తన గెటప్స్‌ వరకు.. ఎన్నో విషయాలు చెప్పాడు. లెటజ్‌ సీ.

=షూటింగ్‌ అయిపోయింది అనగానే డైటింగ్‌, కసరత్తులు మానేశాం. జక్కన్న రెడీ అనగానే మళ్లీ సీన్‌లోకి దిగిపోవాల్సిందే. ప్రస్తుతానికి మాత్రం రిలాక్స్‌డ్‌గా ఉన్నాం.

=అవతార్‌, ట్రాయ్‌ సినిమాల్ని ఐమాక్స్‌ స్క్రీన్‌పై చూసినవాడిని. ఇప్పుడు అదే రేంజులో బాహుబలిని చూడబోతున్నా. బాహుబలి ట్రైలర్‌ కట్‌ చేసి ఐమాక్స్‌లో వేసినప్పుడు చూశాను. అద్భుతం అనిపించింది. అవతార్‌తో బాహుబలిని పోలుస్తుంటే ఆనందంగా ఉంది. ఇది సినిమా కాదు. అనుభూతి.

=భళ్లాల దేవ ఓ రాజు. అతడికి దేవుడంటే నమ్మకం లేదు. కానీ ప్రజలు దేవుణ్ణి కొలుస్తారు. కానీ తనని దేవుడిగా కొలవడమే రాజుకి ఇష్టం. ఇదీ నా పాత్ర స్వభావం. రచయిత విజయేంద్ర ప్రసాద్‌ నాకు చెప్పింది ఇదే.

=రాజమౌళి, ప్రభాస్‌ ఓ సినిమా చేస్తున్నారని, అందులో విలన్‌ వేషానికి వెతుకుతున్నారని ముందు తెలుసు. ఆ విషయాన్ని శోభు చెప్పారు. రాజమౌళి కథ చెబుతానని ముందుగా నాకు మహిష్మతి రాజ్యాన్ని చూపించి దీనికి నువ్వు రాజువి.. అన్నారు. కథ చెప్పడం మొదలెట్టాక ..నేను ఒప్పేసుకోవడం ఖాయం అని భయపడ్డా. అదే విషయాన్ని అతడికి చెప్పి టైమ్‌ అడిగాను. మూడేళ్ల కెరీర్‌ ఈ సినిమా కోసమే దానమివ్వాలని ఆలోచించా. పైగా బలమైన నెగెటివ్‌ క్యారెక్టర్‌ చేయాలన్న ఆశ ఉంది. ఇలాంటి క్యారెక్టర్‌ జీవితంలో మళ్లీ రాదనిపించింది.. కాబట్టి భళ్లాలదేవ పాత్రకి ఒప్పేసుకున్నా.

=దీనికోసం ఆర్నెళ్లు కసరత్తులు చేశాను. తిని తిని బాగా శ్రమించాను. తిండిపై బోర్‌ కొట్టేసింది కూడా. అయితే బాగా శ్రమించాలి. శ్రమకు తగ్గట్టు తినాలి. రోజూ 9 సార్లు కొంచెం కొంచెంగా తినేవాడిని. తిన్న తర్వాత బరువు పెరుగుతాం కాబట్టి దానిని మళ్లీ కరిగించాలి. ప్రత్యేకించి దీనికోసం భారీగా కసరత్తులు చేయాలి. కూర్గ్‌ నుంచి దినేష్‌ అనే ప్రత్యేక ట్రైనర్‌ని నాకోసం రప్పించారు. షూటింగ్‌ గ్యాప్‌లో ఏమాత్రం అవకావం ఉన్నా మేకప్‌ తీసేసి కసరత్తులకు వెళ్లే వాడిని.

=టంగ్‌, సంగ్‌, లక్‌ అనే ముగ్గురిని వియత్నాం నుంచి పీటర్‌ హెయిన్స్‌ మాష్టర్‌ తీసుకొచ్చారు. వాళ్లు నాకు, ప్రభాస్‌కి ట్రైనింగ్‌ ఇచ్చారు. భాష రాకపోయినా కలిసిపోయాం. గద తిప్పడం నేర్పారు. బోలెడన్ని మార్షల్‌ ఆర్ట్సన నేర్పించారు. గుర్రపుస్వారీ, కత్తి తిప్పడం వగైరా వగైరా.

=రాజమౌళి సినిమాల్లో విలన్లు అదరగొట్టేస్తారు. కానీ ఇంతవరకూ భారతీయ సినిమా చరిత్రలో ఇలాంటి విలన్‌ని చూసి ఉండరు. పరిస్థితుల్ని బట్టి మంచివాడు చెడ్డవాడుగా, చెడ్డవాడు మంచివాడుగా మారే క్యారెక్టర్లను చూశాం. కానీ ఇందులో బాహుబలి బాహుబలిలానే ఉంటాడు. భళ్లాలదేవ భళ్లాల దేవలానే ఉంటాడు.

=50 వయసు గెటప్‌లోనూ కనిపిస్తా. కమల్‌హాసన్‌ నాయగన్‌ పోస్టర్‌ చూశాను. ముసలాడి పాత్ర అది. షాక్‌ తిన్నా. నటుడంటే అదే మరి. పెద్ద వయసులోనూ కనిపించాలి మరి.