Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ..ఫ్యామిలీ అదే రీతి అంట

By:  Tupaki Desk   |   23 May 2015 4:07 AM GMT
ఫ్యామిలీ..ఫ్యామిలీ అదే రీతి అంట
X

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఏడాది పాలనపై బీజేపీ ఒకవైపు సంబరాలు చేసుకునేందుకు సిద్ధపడుతుంటే శృతిమించిన మోడీ విదేశీ పర్యటనలపై ప్రతిఫక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దాదాపు రెండు నెలల పాటు కనిపించకుండా పోయి తిరిగొచ్చిన తర్వాత తొలి రోజు పార్లమెంటులో ప్రధాని, ప్రభుత్వాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 'సూట్ బూట్ కీ సర్కార్'... అని ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. పైపెచ్చు అవకాశం దొరికినప్పుడల్లా రాహుల్ ఈ విమర్శ చేస్తూనే ఉన్నారు.

దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఘాటుగా స్పందించారు. 'చాలాకాలం పాటు ఏం మాట్లాడలేని ఓ పిల్లాడు.. ఆ తర్వాత మాట్లాడుతుంటే మీరు ఆశ్చర్యపోతారు. పైగా ఇంకా మాట్లాడాలని ప్రోత్సహిస్తారు' అని రాహుల్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ‘పిల్లలు ఎక్కువసేపు మాట్లాడలేరు. అందుకే వాళ్లు మాట్లాడితే ఆసక్తిగా గమనిస్తూ ప్రోత్సహిస్తారు’ అని వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ పెద్దతప్పులు చేసే నాయకుడని, ఆయన మాటలు అనుభవలేమితో వచ్చినవని విమర్శించారు.

రాహుల్ గాంధీ తమ ప్రభుత్వాన్ని సూట్ బూట్ కీ సర్కార్ అనడం ద్వారా ప్రజలకు తమ గురించి ఏం చెప్పాలనుకున్నారో అర్థం కాలేదని చెప్పారు. రాహుల్ తమను ఆ విధంగా విమర్శించారని అయితే...రాహుల్ కుటుంబమంతా కూడా సూట్ బూట్లు వేసుకొనే ఉంటారుగా అని రామ్ మాధవ్ వ్యాఖ్యానించారు. రాహుల్ బావ రాబర్ట్ వాద్రా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సూట్ బూట్ వేసుకొని హర్యానాలో అక్రమంగా భూలావాదేవీలకు పాల్పడలేదా అని ప్రశ్నించారు.గాంధీ ఫ్యామిలీలో నే అందరూ సూటు, బూటు వేసుకుంటారన్నా రు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం పదేళ్లలో దేశ ప్రతిష్టను మంటగలిపిందని రామ్‌మాధవ్‌ విమర్శించారు. ఏడాదినుంచీ ప్రధాని మోడీ దేశం కోసం కష్టపడుతున్నారని ప్రశంసించారు. భారత్‌పై ప్రపంచదేశాలకు గౌరవం పెరిగిందన్నారు. అవినీతి, నల్లధనంపై ప్రభుత్వ చర్యలతో విపక్షాలకు ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదన్నారు. మన్మోహన్‌ కూడా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది 47 రోజులు విదేశాల్లో పర్యటించారని, అప్పుడెందుకు దీనిపై చర్చించలేదో కాంగ్రెస్‌ నేతలు ఆలోచించాలన్నారు.