Begin typing your search above and press return to search.

టెన్నిస్‌ ప్రియులకు దిమ్మదిరిగే షాక్‌

By:  Tupaki Desk   |   3 July 2015 7:11 AM GMT
టెన్నిస్‌ ప్రియులకు దిమ్మదిరిగే షాక్‌
X
ఇది రఫెల్‌ నాదల్‌ అభిమానులకు మాత్రమే కాదు.. టెన్నిస్‌ ప్రియులందరికీ చేదు వార్తే. నాదల్‌ వింబుల్డన్‌లో రెండో రౌండ్లోనే ఓడిపోయాడు. అయినా ఒక్క గ్రాండ్‌స్లామ్‌లో ఓడిపోయినంత మాత్రాన అంత బాధపడాల్సిన అవసరమేంటి.. అనిపించొచ్చు. కానీ ఈ ఓటమిని ఒక్క వింబుల్డన్‌ కోణంలో చూస్తే చాలా చిన్న విషయమే కానీ.. మొత్తం నాదల్‌ కెరీర్‌ దృష్టితో చూస్తే మాత్రం చింతించాల్సిన సంగతే. నాదల్‌ ఓడింది ఏ ప్రముఖ ఆటగాడి చేతిలోనే కాదు. డస్టిన్‌ బ్రౌన్‌ అనే జర్మనీ అనామక ఆటగాడి చేతిలో. ఒక్క సెట్‌ మాత్రమే గెలిచిన నాదల్‌.. 5-7, 6-3, 4-6, 4-6తో బ్రౌన్‌ చేతిలో మట్టికరిచాడు. ఈ మ్యాచ్‌లో నాదల్‌ ఆడిన తీరు చూస్తుంటే ఇకపై అతడి మెరుపులు చూడలేమేమో.. త్వరలోనే అతను కెరీర్‌కు గుడ్‌బై చెప్పేస్తాడేమో అనిపిస్తోంది.

నాదల్‌ మిగతా గ్రాండ్‌స్లామ్‌ల్లో ఎలా ఆడినా.. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మాత్రం చెలరేగిపోతుంటాడు. అతను గెలిచిన 14 గ్రాండ్‌స్లామ్స్‌లో 9 ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లే. ఐతే ఈసారి అక్కడ కూడా టైటిల్‌ గెలవలేదు. క్వార్టర్స్‌లో జకోవిచ్‌ చేతిలో వరుస సెట్లలో చిత్తుగా ఓడాడు. ఇప్పుడు వింబుల్డన్‌లో పరాభవం ఎదురైంది. గాయాలు, ఫిట్‌నెస్‌ సమస్యలు అతణ్ని వేధిస్తున్నాయి. దీంతో కోర్టులో మునుపటిలా కదల్లేపోతున్నాడు. ఈ ఏడాది అతను టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పేసినా ఆశ్చర్యం లేదంటున్నారు కొందరు మాజీలు. అదే జరిగితే ప్రపంచ టెన్నిస్‌ కళతప్పడం ఖాయం. దశాబ్ద కాలంగా నాదల్‌ అందించిన వినోదం అలాంటిలాంటిది కాదు. ఆల్‌టైం గ్రేట్‌ ఫెదరర్‌ను అతనెలా ఏడిపించాడో.. అతడితో ఎలా పోరాడాడో తెలిసిందే. టెన్నిస్‌ చరిత్రలోనే ఎప్పటికీ గుర్తిండిపోయే పోరాటాలు జరిగాయి వాళ్లిద్దరి మధ్య. జకోవిచ్‌తో కూడా అద్భుతమైన మ్యాచ్‌లు ఆడాడు. ఐతే ఇప్పుడు నాదల్‌ నిష్క్రమిస్తే పెద్ద వెలితి ఏర్పడటం ఖాయం. అది నాదల్‌ అభిమానులకే కాదు.. ప్రతి టెన్నిస్‌ ప్రియుడికీ చేదు వార్తే అవుతుంది.