Begin typing your search above and press return to search.

ప్రణబ్‌ మనసును దోచుకున్న కట్టె పొంగలి

By:  Tupaki Desk   |   6 July 2015 10:17 AM GMT
ప్రణబ్‌ మనసును దోచుకున్న కట్టె పొంగలి
X
తమిళులు విపరీతంగా ఇష్టపడే ఉపాహారం కట్టెపొంగలి. ఒక్క తమిళులు మాత్రమే కాదు.. చిత్తూరు.. నెల్లూరు.. ప్రకాశం.. కృష్ణా జిల్లాల వారు ఉదయాన్నే టిఫిన్‌ కింద కట్టెపొంగలిని వినియోగిస్తుంటారు. వైష్ణవ క్షేత్రాల్లో స్వామివారికి నివేదించే ముఖ్యమైన ప్రసాదాల్లో కట్టె పొంగలి ఒకటి.

ఉదయం పూట టిఫిన్‌గా విపరీతంగా ఇష్టపడే ఈ కట్టె పొంగలి రుచిని మొదటిసారిగా రుచి చూసిన రాష్ట్రపతి ప్రణబ్‌ మైమరిచిపోయారు. రాష్ట్రపతి లాంటి వ్యక్తి దాని రుచికి ఫిదా అయిపోయి.. ఇంతటి రుచికరమైన ఆహారపదార్థాన్ని తానెప్పుడూ తినలేదని చెప్పటమే కాదు.. దాన్ని ఎలా తయారు చేస్తారు? దాన్లో ఏమేం వాడతారు అన్న విషయాల్ని నుక్కునేందుకు దాదాపు ఐదు నిమిషాల సమయాన్ని కేటాయించటం గమనార్హం.

యాదాద్రికి వెళ్లిన రాష్ట్రపతి ప్రణబ్‌కు కట్టె పొంగలి తినే అవకాశం లభించింది. స్వామివారిని దర్శించుకున్న తర్వాత రాష్ట్రపతి వచ్చిన నేపథ్యంలో స్వామివారికి ఎనిమిది ప్రసాదాలు తయారు చేయించారు. వాటిలో కట్టె పొంగలి రుచి మాత్రమే ప్రణబ్‌ చూశారు.

దీన్ని రుచి చూసినంతనే ఆశ్చర్యానికి గురైన ప్రణబ్‌.. కట్టె పొంగలిని ఎలా తయారు చేస్తారు? లాంటి ప్రశ్నలతో అక్కడి వారిని అడిగారట. అంతేకాదు.. దాన్ని తయారు చేసిన అర్చక స్వాములను అభినందించారట. చూస్తుంటే ప్రణబ్‌ దా మనసును దోచుకునేందుకు కట్టె పొంగలి టిఫిన్‌ పెడితే సరిపోతుందేమో. ఇక.. దాన్ని తయారు చేసిన వారి సంతోషానికి ఆవధులు లేకుండా పోయిందట. రాష్ట్రపతి అంత పెద్ద వ్యక్తికి తాము చేసిన వంటకం నచ్చటంపై వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారట.