Begin typing your search above and press return to search.

టీఎన్జీవోల మీద పొన్నం ఫైర్‌

By:  Tupaki Desk   |   29 Jun 2015 12:59 PM GMT
టీఎన్జీవోల మీద పొన్నం ఫైర్‌
X
మాట్లాడితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనన్న భావనతో కొన్ని అంశాల మీద.. కొందరి మీద ఎలాంటి విమర్శలు చేయటానికి కాస్తంత వెనకాడే పరిస్థితిని కొనసాగించకూడదన్న భావనతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఉన్నట్లుగా కనిపిస్తోంది.

తెలంగాణ ఉద్యమంలో సెంటిమెంట్‌ నేపథ్యంలో కొన్ని వర్గాల మీద విమర్శలు చేసేందుకు రాజకీయ నేతలు ఇబ్బంది పడే వారు. కేసీఆర్‌ చాణుక్యంతో.. విభజన తర్వాత కూడా అలాంటి పరిస్థితే నెలకొందన్న భావన ఉంది. టీఎన్జీవో నాయకులు బాహాటంగా తెలంగాణ అధికారపక్షానికి దన్నుగా ఉంటూ.. వారికి మద్ధతు పలకటం పట్ల రాజకీయ పార్టీలు గుర్రుగా ఉన్నప్పటికీ.. వారిని విమర్శించే ధైర్యం మాత్రం చేయటం లేదు.

ఇలాంటి పరిస్థితుల్లో.. మాజీ ఎంపీ.. తెలంగాణ కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ మాటల దాడి చేసేందుకు ముందుకొచ్చారు. తెలంగాణ ఎన్జీవో నేతలు టీఆర్‌ఎస్‌ పార్టీకి తొత్తులుగా మారారని విరుచుకుపడిన వారు.. ఉద్యోగుల విభజనపై ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించటం లేదని నిలదీశారు. ఉద్యోగుల విభజనపై ఉద్యోగ సంఘాల నాయకులు తమ బాధ్యత విస్మరిస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

నేతలు కానీ ఇలాంటి వైఖరినే కొనసాగిస్తే.. వారిని నాయకత్వం నుంచి తప్పించాల్సిన పరిస్థితులు వస్తాయంటూ హెచ్చరికలు జారీ చేశారు. సెక్షన్‌ 8 అంశం.. తెలంగాణ.. ఆంధ్రా ముఖ్యమంత్రుల రాజకీయ క్రీడ అని.. అందులో ఉద్యోగ సంఘాలకు సంబంధం ఏమిటని సూటిగా ప్రశ్నించిన పొన్నం ప్రభాకర్‌.. ఉద్యోగుల విభజన విషయాన్ని ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. మరి.. పొన్నం మాటకు తెలంగాణ ఎన్జీవో నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.