Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌ చుట్టూ రాజకీయం!

By:  Tupaki Desk   |   24 May 2015 5:30 PM GMT
హైదరాబాద్‌ చుట్టూ రాజకీయం!
X
ప్రస్తుతం రాజకీయం మొత్తం హైదరాబాద్‌ చుట్టూనే కేంద్రీకృతం అయింది. గత పాలకులు హైదరాబాద్‌ను సర్వనాశనం చేసేశారని, ఆరు నెలల్లోనే హైదరాబాద్‌ను తాను అద్భుతంగా అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతానని కేసీఆర్‌ వ్యాఖ్యానిస్తారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దింది తానేనని, ఎన్టీఆర్‌ తర్వాత ఆ ఘనత తనకే దక్కుతుందని చంద్రబాబు అంటున్నారు. వెరసి, హైదరాబాద్‌ విషయంలో చంద్రబాబు కేసీఆర్‌ ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు.

మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ అమెరికా వెళ్లినప్పుడు అక్కడి పాలకులు అక్కడి నగరాలను చూపించారని, దాంతో తమకు కూడా హైదరాబాద్‌ ఉందని మన్మోహన్‌ ఎంతో గర్వంగా చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దిన ఘనత తనకే దక్కుతుందన్నారు. హైదరాబాద్‌ను నిజాం నవాబులు రూపొందించారని, సికింద్రాబాద్‌ను బ్రిటిష్‌ పాలకులు రూపు దిద్దారని, సైబరాబాద్‌ను సృస్టించింది తానేనని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు గుజరాత్‌ తర్వాత తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉందనిఆ క్రెడిట్‌ కూడా తనదేనని చంద్రబాబు అంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌ ధనిక రాష్ట్రం కనక.. నాలాలు కావాలంటే డబ్బుంది కనక వేసుకోవచ్చు కదా అని కేసీఆర్‌కు సవాల్‌ కూడా విసిరారు.

అయితే, కేసీఆర్‌ మాత్రం గత పాలకులపై విమర్శలతోనే సరిపెడుతున్నారు. ఆరు నెలల్లో హైదరాబాద్‌ను సమూలంగా మార్చేస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నరు తప్పితే అందుకు తగిన కార్యాచరణ మాత్రం కనిపించడం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. హుస్సేన్‌ సాగర్‌ను శుద్ధి చేసేసి.. శివారు ప్రాంతాలు సహా హైదరాబాద్‌ అంతటికీ మంచినీళ్లు అందిస్తే ఇక్కడి ప్రజలు కేసీఆర్‌కే జై కొడతారని టీడీపీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్‌ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది అయిందని, ఈ ఏడాదిలో కనీసం ఒక్కటంటే ఒక్క రోడ్డును కూడా వేయలేదని, రోడ్లను బాగు చేసినా ప్రజలు టీఆర్‌ఎస్‌కు జై కొడతారని వివరిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రజలకు మంచినీళ్లు ఇవ్వలేదు. కనీసం ఒక్క రోడ్డు కూడా వేయలేదు. జూబ్లీ హిల్స్‌, బంజారాహిల్స్‌ల్లోని రోడ్లు కూడా అధ్వానంగానే ఉన్నాయి. గత ఏడాది కాలంగా జీహెచ్‌ఎంసీలో పన్నుల వసూలుకు తప్ప సిబ్బంది పని చేయడం లేదని విమర్శిస్తున్నారు. చంద్రబాబు కంటే దీటుగా అభివృద్ధి చేసి అప్పుడు కేసీఆర్‌మాట్లాడాలని, అంతే తప్ప ఉత్తుత్తి ప్రకటనలతో లాభం లేదని వివరిస్తున్నారు.