Begin typing your search above and press return to search.

వందల్లో అదుపులోకి తీసుకున్నారు

By:  Tupaki Desk   |   23 May 2015 4:16 AM GMT
వందల్లో అదుపులోకి తీసుకున్నారు
X
గత కొద్ది నెలలుగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు కార్బన్‌ సెర్చ్‌ పేరిట పలు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటిని తనిఖీ చేయటం కార్బన్‌సెర్చ్‌లో భాగం. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ డ్రైవ్‌ నిర్వహించినప్పటికీ.. ఓల్డ్‌సిటీలోని కీలక ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ ఇలాంటివి చేపట్టలేదు.

నగరం మొత్తం ఒక ఎత్తు అయితే.. పాతబస్తీలోని కొన్ని ప్రాంతాలు అత్యంత సమస్యాత్మకమైనవి. అయినప్పటికీ అలాంటి ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు లాంటివి చేపట్టలేదన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా ఒక వీధి పోరాటం జరిగిన నేపథ్యంలో.. పాతబస్తీలోని 17 పోలీస్‌స్టేషన్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. శుక్రవారం అర్థరాత్రి భారీ భద్రతా బలగాల మధ్య నిర్వహించిన ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో.. ఎలాంటి కారణం లేకుండా వీధుల్లో తిరుగుతున్న యువకుల్ని భారీగా అదుపులోకి తీసుకున్నారు.

కార్బన్‌ సెర్చ్‌ మాదిరి ఇంటింటిని తనిఖీ చేయని పోలీసులు.. కేవలం వీధుల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. ఇలా ఏ పది మందో.. ఇరవై మందోకాకుండా ఏకంగా 300 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల అదుపులోకి తీసుకున్న యువకులంతా ఇరవై ఏళ్ల లోపు వారేనని తెలుస్తోంది. ఊహించని విధంగా ఇంత భారీ సంఖ్యలో యువకులు పోలీసులు అదుపులోకి తీసుకోవటం.. రాజకీయంగా కలకలం రేపే ప్రమాదం ఉన్న నేపథ్యంలో వారిని పోలీస్‌స్టేషన్‌కు కాకుండా.. ఒక మ్యారేజ్‌ ఫంక్షన్‌ హాలుకు తరలించారు. అక్కడి వారి తల్లిదండ్రులను పిలిపించి.. ప్రత్యేక కౌన్సిలింగ్‌ నిర్వహిస్తారని చెబుతున్నారు. ఇదే 17 పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఇంటింటిని కార్బన్‌ సెర్చ్‌ మాదిరి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తే.. ఫలితం మరెలా ఉంటుందో..?