Begin typing your search above and press return to search.

హరితహారానికి ఇదో షాక్‌

By:  Tupaki Desk   |   5 July 2015 8:53 AM GMT
హరితహారానికి ఇదో షాక్‌
X
కోతులు వాపస్‌ పోవాలే..వానలు తిరిగి రావలే...అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో ప్రారంభించిన కార్యక్రమం హరితహారం. తెలంగాణకు గ్రీన్‌ కవర్‌ ను పెంచేందుకు తలపెట్టిన ఈ కార్యక్రమంలో బడి, గుడి అనే తేడా లేకుండా ప్రభుత్వ స్థలాల్లో మొక్కలను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రజలను కూడా భాగస్వామ్యం కావాలని విన్నవించారు. అయితే ఆచరణలో అసలు సమస్య ఎదురవుతోంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో హరితహారం కింద మొక్కలు నాటేందుకు క్రియాశీలంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ...మొక్కల కొరత ఎదురవుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో రెండు కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ వర్గాలు నిర్ణయించాయి. తొలి ఏడాదికి 50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందుకోసం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ నుంచి మొక్కలు తెప్పించాలని నిర్ణయించింది. అయితే ఒక్కసారిగా భారీ డిమాండ్‌ రావడంతో జీహెచ్‌ఎంసీకి రావాల్సినన్ని మొక్కలు అందుబాటులోకి రాకుండా పోయినట్లు సమాచారం.

అయితే ఇందుకు మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది. ఏపీ సర్కారు కూడా ప్రతిష్టాత్మకంగా నీరు-చెట్టు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఒక్కో మొక్కకు రూ. 35 ఏపీ సర్కారు చెల్లించి సదరు నర్సరీల నుంచి కొనుగోలు చేస్తోంది. అయితే జీహెచ్‌ఎంసీ మాత్రం రూ.33 మాత్రమే ఇస్తానని చెప్పడంతో నర్సరీల యాజమాన్యాలు వెనకడుగు వేసి ఏపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.