Begin typing your search above and press return to search.

ఏపీ ఎంపీలకు ఆత్మాభిమానం ఉందా?

By:  Tupaki Desk   |   6 July 2015 5:08 PM GMT
ఏపీ ఎంపీలకు ఆత్మాభిమానం ఉందా?
X
తిట్టేందుకు బండ బూతులు తిట్టాల్సిన అవసరం లేదు. బట్టలు చినిగిపోయనట్లు కొడితేనే కొట్టినట్లు కాదు. సూటి మాటలు.. తర్కబద్ధంగా.. న్యాయమైన మాటలతో కూడా బట్టలన్నీ విప్పదీసి రోడ్డు మీద నిలబెట్టేయొచ్చన్న విషయాన్ని తాజా మీడియా సమావేశం ద్వారా నిరూపించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

విభజన సమయంలో తమ న్యాయమైన వాదనను వినిపిస్తుంటే.. ఉత్తరాది ఎంపీల చేతుల్లో దెబ్బలు తిని బయటకు వచ్చి ఆవేశంతో ఊగిపోయిన ఆంధ్రా ఎంపీల ఆత్మాభిమానం ఏమైపోయిందంటూ ఎలా అడగాలో అలానే అడిగేశారు పవన్‌ కల్యాణ్‌. నాడు విభజన సమయంలో తమకు జరిగిన అవమానాన్ని కిందా మీదా పడేసి ఏడ్చేసిన ఏపీ ఎంపీలు అంతా ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆయన అడిగేశారు.

పలువురు ఎంపీల పేర్లు ప్రస్తావించి.. వారంతా పోటీ చేస్తుంటే.. వారి గెలుపు కోసం తాను ప్రచారం చేశానని.. ప్రజలకు ఏదో చేయాలని తపించిపోయినట్లుగా మాట్లాడిన ఎంపీలంతా ఇప్పుడేం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. పార్లమెంటు గోడల్ని చూసి తన్మయత్వంతో ఉండిపోతున్నారా? అని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణ ఎంపీలు తమ హక్కుల కోసం నిలదీసే తత్వానికి భిన్నంగా ఏపీ ఎంపీలు ఎందుకు మాట్లాడరన్న అంశానికి సంబంధించి ఒక నిజాన్ని విప్పి చెప్పేశారు.

తెలంగాణ ఎంపీలంతా రాజకీయ నాయకులు అయితే.. ఏపీ ఎంపీలంతా వ్యాపారస్తులన్ని.. వారికి వారి ప్రయోజనాలు తప్పించి.. ప్రజల ప్రయోజనాలు పట్టటం లేదని.. ప్రధాని మోడీ లాంటి వారి దగ్గరకు వెళ్లి చేతులు నలుపుకోవటం మినహా అడగటం చేతకాకపోతే.. తమ పదవులకు రాజీనామాలు చేస్తే.. ప్రజలు ఏం చేయాలో అది చేస్తారంటూ మండిపడ్డారు.

ఎంపీలకు ఆత్మాభిమానం లేదా? తమను ఎన్నుకున్న ప్రజల క్షేమం గురించి మాట్లాడాలన్న ధ్యాస ఉండదా? తెలుగుదేశం ఎంపీలే కాదు.. ఇద్దరు బీజేపీ ఎంపీలు (పేర్లు కూడా ప్రస్తావించారు) ఏం చేస్తున్నారు? ప్రధాని మోడీ ఏం అనుకుంటారో అని మాట్లాడకుండా ఉంటే కుదరదు? మంత్రులుగా ఉన్న అశోక్‌ గజపతిరాజు.. సుజనాలు కిక్కురమనకుండా ఉంటే కుదరదని.. విభజన సందర్భంగా ఏపీకి చెప్పినట్లుగా ప్రత్యేకహోదా కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఎంపీలు తమ వ్యాపారాలు పక్కన పెట్టేసి.. సీమాంధ్ర ప్రయోజనాల కోసం మాట్లాడాలని చెప్పిన ఆయన.. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వచ్చిన కావూరి.. పురంధేశ్వరి లాంటి వారు సైతం నోరు విప్పాలంటూ వారిని సైతం వదిలిపెట్టలేదు. సీమాంధ్ర ఎంపీలకు పౌరుషం లేదా? ఆత్మాభిమానం ఉండదా? అంటూ నిలదీసిన పవన్‌ కల్యాణ్‌.. తన మాటలతో ఏపీ ఎంపీల్ని బట్టలిప్పేసినంత పని చేశారు.