Begin typing your search above and press return to search.

పాకిస్థాన్‌ క్రికెట్లో సెన్సేషనల్‌ విన్‌

By:  Tupaki Desk   |   7 July 2015 10:54 AM GMT
పాకిస్థాన్‌ క్రికెట్లో సెన్సేషనల్‌ విన్‌
X
పాకిస్థాన్‌ బౌలింగ్‌ ఎప్పుడూ బలమే. కానీ బ్యాటింగే అత్యంత బలహీనం. ఉపఖండంలో మరే జట్టుకూ అంత వీక్‌ బ్యాటింగ్‌ లేదు. చివరికి బంగ్లాదేశ్‌తో పోల్చి చూసినా పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ వీక్‌గానే కనిపిస్తుంది. అలాంటి జట్టుకు ఓ టెస్టు మ్యాచ్‌ నాలుగో ఇన్నింగ్స్‌లో 300కు మించి టార్గెట్‌ ఇస్తే.. ఏ జట్టయినా కళ్లు మూసుకుని గెలిచేయొచ్చని అనుకుంటుంది. అందులోనూ శ్రీలంకలో అయితే ఇప్పటిదాకా ఏ జట్టూ కూడా నాలుగో ఇన్నింగ్స్‌లో 300కు పైగా టార్గెట్‌ను ఛేదించింది లేదు. అలాంటిది మూడో టెస్టులో పాక్‌ ముందు 377 పరుగుల భారీ లక్ష్యం నిలిపంది శ్రీలంక. బహుశా పాకిస్థాన్‌ కూడా ఈ లక్ష్యాన్ని ఛేదించగలమని అనుకుని ఉండదేమో. ఒకటిన్నర రోజు ఆట మిగిలి ఉండటంతో శ్రీలంకదే విజయం అనుకున్నారంతా.

కానీ పాకిస్థాన్‌ అద్భుతం చేసింది. అంత భారీ లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా.. ఓపెనర్‌ షాన్‌ మసూద్‌ (125 నాటౌట్‌), సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ యూనిస్‌ ఖాన్‌ (171 నాటౌట్‌) అద్భుత భాగస్వామ్యం నెలకొల్పడంతో పాకిస్థాన్‌ సెన్సేషనల్‌ విక్టరీ కొట్టింది. మసూద్‌ ఔటైనా.. కెప్టెన్‌ మిస్బావుల్‌ హక్‌తో కలిసి పాక్‌కు విజయాన్నందించాడు యూనిస్‌ ఖాన్‌. ఇది అతడి కెరీర్లోనే గ్రేటెస్ట్‌ ఇన్నింగ్స్‌ అని చెప్పాలి. పాకిస్థాన్‌ క్రికెట్లోనే ఇది అత్యధిక లక్ష్య ఛేదన కావడం విశేషం. మూడు టెస్టుల సిరీస్‌ తొలి మ్యాచ్‌లో పాక్‌ గెలవగా.. రెండో మ్యాచ్‌ను శ్రీలంక సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో టెస్టులో పాక్‌ గెలిచి సిరీస్‌ను ఎగరేసుకుపోయింది. ఈ మధ్యే బంగ్లాదేశ్‌ చేతిలో వన్డే, టీ20 సిరీస్‌లు ఓడిపోయి తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న పాక్‌.. లంకను వాళ్ల గడ్డపై ఓడించడం సంచలనమే.