Begin typing your search above and press return to search.

సినిమా రివ్యూ : ఓకే బంగారం

By:  Tupaki Desk   |   17 April 2015 10:29 AM GMT
సినిమా రివ్యూ : ఓకే బంగారం
X
సినిమా రివ్యూ : ఓకే బంగారం
రివ్యూ: ఓకే బంగారం
రేటింగ్‌: 3/5
నటీనటులు` దుల్కర్‌ సల్మాన్‌, నిత్యా మీనన్‌, ప్రకాష్‌ రాజ్‌, లీలా శాంసన్‌ తదితరులు
ఛాయాగ్రహణం` పి.సి.శ్రీరామ్‌
ఎడిటింగ్‌` శ్రీకర్‌ ప్రసాద్‌
పాటలు` సీతారామశాస్త్రి
సంగీతం` ఎ.ఆర్‌.రెహమాన్‌
నిర్మాత` దిల్‌ రాజు
రచన, దర్శకత్వం` మణిరత్నం
సినిమాలందు మణిరత్నం సినిమాలు వేరయా అంటారు ఆయన అభిమానులు. తెరమీద ఆయన చేసే మ్యాజిక్‌కు మామూలు ప్రేక్షకులు మాత్రమే కాదు.. సినీ ప్రముఖులు సైతం అభిమానులే. ఐతే రావణన్‌ (విలన్‌), కడల్‌ (కడలి) లాంటి సినిమాల్లో మణి మ్యాజిక్‌ పని చేయలేదు. తనపై భారీ అంచనాలు పెట్టుకుని వచ్చిన అభిమానుల్ని ఆ రెండు సినిమాలతో తీవ్రంగా నిరాశ పరిచిన మణిరత్నం.. ఈసారి తన బలమైన ‘రొమాన్స్‌’ను నమ్ముకుని ‘ఓకే బంగారం’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరి ఈసారి ఆయన మ్యాజిక్‌ పని చేసిందో లేదో చూద్దాం పదండి.
కథ:
ఆది (దుల్కర్‌ సల్మాన్‌) ముంబయిలో ఓ మల్టీ మీడియా కంపెనీలో ఉద్యోగి. పెద్ద బిజినెస్‌మేన్‌ కావాలన్న లక్ష్యంతో ఓ వీడియో గేమ్‌ డెవలప్‌ చేసే పనిలో ఉంటాడు ఆది. తార (నిత్యా మీనన్‌)కు ఎంతో ఆస్తి ఉన్నా.. స్కాలర్‌షిప్‌ మీద పారిస్‌కు వెళ్లి చదువుకోవాలని లక్ష్యంతో ముంబయిలోని ఓ హాస్టల్‌లో ఉంటుంది. వీళ్లిద్దరికీ పెళ్లి మీద నమ్మకముండదు. ఇలాంటి స్థితిలో ఒకరికొకరు పరిచయమవుతారు. అభిరుచులు కలుస్తాయి. తర్వాత గణపతి (ప్రకాష్‌ రాజ్‌), భవాని (లీలా శాంసన్‌) అనే వృద్ధ జంట ఇంట్లో సహజీవనానికి సిద్ధమవుతారు. ఆరు నెలల సహవాసం తర్వాత ఆది, తార విడిపోయి తమ లక్ష్యాల దిశగా వెళ్లాల్సి వస్తుంది. ఆ స్థితిలో ఇద్దరూ ఏ నిర్ణయం తీసుకున్నారన్నది తెర మీదే చూడాలి.
కథనం, విశ్లేషణ:
ఓకే బంగారం తొలి టీజర్‌ విడుదలైన నాటి నుంచి అందరూ అంటున్న మాట.. మణిరత్నం ఈజ్‌ బ్యాక్‌. ఆ తర్వాత ఆడియో విన్నాక.. ఇంకొన్ని ప్రోమోస్‌ చూశాక.. ఈ సినిమాకు పని చేసిన యూనిట్‌ సభ్యుల మాటలు విన్నాక.. మణిరత్నం మ్యాజిక్‌ ఈసారి కచ్చితంగా పని చేసి ఉంటుందనే ఉత్సాహం కలిగింది ఆయన అభిమానులకు. వారి అంచనాలు తప్పలేదు. అవును.. మణిరత్నం ఈజ్‌ బ్యాక్‌.
తెరమీద అంతులేని ఆహ్లాదం.. వీళ్లిద్దరూ నిజజీవితంలోనూ జంటేనేమో అనిపించే ప్రధాన పాత్రధారుల అద్భుతమైన కెమిస్ట్రీ.. కంటికింపైన కెమెరా విన్యాసాలు.. సినిమా లోపలికి లాక్కెళ్లిపోయి.. కథనంతో పాటు మనల్ని నడిపించే నేపథ్య సంగీతం, పాటలు.. కొంచెం లోతుల్లోకి వెళ్లి ఆలోచిస్తే కానీ అర్థం కాని నిగూఢమైనమాటలు.. సినిమా నుంచి బయటికి వచ్చేశాక కూడా వెంటాడే పాత్రలు.. మన జీవితాలకు అన్వయించుకునే ఎన్నో ఎమోషన్స్‌.. అన్నింటికీ మించి ఎవరైనా కనెక్టవగలిగే ‘తాజాదనం’తో కూడిన ఓ యునీక్‌ పాయింట్‌.. ఇదీ మణిరత్నం సినిమా అంటే. ఓకే బంగారం.. ఈ క్వాలిటీస్‌ అన్నీ ఉన్న సినిమానే అని చెప్పడానికి సందేహించనక్కర్లేదు.
మణిరత్నం సినిమా నుంచి ఏం ఆశిస్తామో అన్నీ ఉన్నాయి ‘ఓకే బంగారం’లో. అందరూ అంచనా వేసినట్లే ఇది ‘సఖి’ తరహా సినిమానే. సఖిలో అప్పటి పరిస్థితులకు తగ్గట్లు పెళ్లి తర్వాత వచ్చే అభిప్రాయ బేధాల గురించి చర్చిస్తే.. ‘ఓకే బంగారం’లో ప్రస్తుత ట్రెండుకు తగ్గట్లు సహజీవనం నేపథ్యంలో కథను అల్లుకుని ప్రేమకు అంతిమ గమ్యం పెళ్లేనా అనే అంశంపై తనదైన శైలిలో చర్చించాడు మణి. ఐతే సఖి సినిమాతో పోలిస్తే కొంచెం డెప్త్‌, ఇంటెన్సిటీ తగ్గాయేమో అన్న భావన అక్కడక్కడా కలుగుతుంది కానీ.. ఆ పోలికల్లేకుండా చూస్తే దీని ప్రత్యేకత దీనికుంది.
ఆరంభంలో ప్రధాన పాత్రలకు పెళ్లి మీద అపనమ్మకం కలగడానికి బలమైన కారణాలు చూపించలేదు. తర్వాత వాళ్లిద్దరూ రిలేషన్‌లో దిగడానికి కూడా సరైన ఫ్లాట్‌ఫామ్‌ రెడీ చేయలేదు మణిరత్నం. ఐతే ముగింపు మాత్రం ఈ లోపాల్ని కప్పి పుచ్చేలా చేస్తుంది. విడిపోవడానికి ముహూర్తం కుదిరాక.. పది రోజుల్లో ఇద్దరి మధ్య సంఘర్షణను.. వాళ్ల అసహనాన్ని చాలా తక్కువ సన్నివేశాలతో, తక్కువ మాటలతో అద్భుతంగా చూపించాడు మణిరత్నం. ఏదీ సూటిగా చెప్పకుండా పాత్రల తాలూకు సంఘర్షణను చూపించిన తీరు చూస్తే.. దటీజ్‌ మణిరత్నం అనిపిస్తుంది. సహజీవనం అనే వివాదాస్పద అంశాన్ని నేపథ్యంగా తీసుకున్నప్పటికీ చివరికి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని అందరూ కన్విన్స్‌ అయ్యే రీతిలో చెప్పడంలో మణిరత్నం ముద్ర కనిపిస్తుంది.
ప్రథమార్ధంలో దుల్కర్‌, నిత్యల మధ్య కెమిస్ట్రీ, వాళ్ల మధ్య రొమాన్స్‌ చూస్తే.. అర్బన్‌ రొమాన్స్‌ను తెరపై అందంగా చూపించడంలో మణిరత్నంను మించిన వాళ్లెవరూ లేరనిపిస్తుంది. మణి వయసు 60 ఏళ్లని గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం కూడా కలుగుతుంది. పి.సి.శ్రీరామ్‌, రెహమాన్‌ల సాయంతో ప్రధాన పాత్రల మధ్య రొమాన్స్‌ను పండిరచిన తీరు కచ్చితంగా యువ ప్రేక్షకుల మనసు దోస్తుంది. అలాగని ఎక్కడా వల్గారిటీ లేదు.
ఇంటర్వెల్‌ తర్వాత హీరో హీరోయిన్లు క్లినిక్‌కు వెళ్లే సీన్‌ మణిరత్నం ఎంత చమత్కారో రుజువు చేస్తుంది. కథనంలో ఇమిడిపోయేలా ఇలాంటి ఫన్నీ సీన్స్‌తో ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే రాసుకున్నారు మణి. అల్జీమర్స్‌ పేషెంట్‌ను ఫన్‌ కోసం ఎంత బాగా వాడుకున్నారో.. చివర్లో ఎమోషనల్‌ సీన్స్‌కు కూడా అంతే చక్కగా ఉపయోగించుకోవడం మణిరత్నంకు మాత్రమే చెల్లింది. అల్జీమర్స్‌ వల్ల ఆ క్యారెక్టర్లో వచ్చే మార్పుల్ని రెండు మూడు సన్నివేశాలతోనే అద్భుతంగా చెప్పాడు మణి. చివరి అరగంటలో ప్రధాన పాత్రధారులు ఎమోషన్స్‌ను చాలా సింపుల్‌ సీన్స్‌తోనే ప్రేక్షకులు ఫీలయ్యేలా చేశాడు. పతాక సన్నివేశం సినిమాకు హైలైట్‌ అని చెప్పాలి. ఎక్కువ డ్రామా లేకుండా చాలా సింపుల్‌గా సాగిపోయే సన్నివేశంతో సినిమాకు అర్థవంతమైన ముగింపునిచ్చాడు మణి.

నటీనటులు:
మణిరత్నం సినిమాల్లో నటించడం అదృష్టమే. కానీ అది సవాల్‌ కూడా. ప్రతి సన్నివేశంలోనూ పైకి మాట్లాడే మాటల వెనుక ఓ నిగూడార్థం దాగి ఉంటుంది. అది ప్రేక్షకుడికి కనెక్టయ్యేలా నటించడం చిన్న విషయం కాదు. దుల్కర్‌ సల్మాన్‌, నిత్యామీనన్‌ జంట ఆ కష్టమైన పనిని చాలా ఇష్టంగా, ప్రేక్షకులు కూడా ఇష్టపడేలా చేశారు. అప్పట్లో మాధవన్‌, షాలిని ఎలాంటి ముద్ర వేశారో.. ఇప్పుడు దుల్కర్‌, నిత్య కూడా అలాగే ప్రేక్షకుల మనసుల్లో రిజిస్టరైపోతారు. వీళ్లిద్దరి నటన, కెమిస్ట్రీ సినిమాకు హైలైట్‌ అనడంలో సందేహం లేదు. ప్రకాష్‌ రాజ్‌, లీలా శాంసన్‌ కూడా పాత్రల్లో చక్కగా ఇమిడిపోయారు. నటీనటుల్లో ఎవర్నీ తక్కువ చేయడానికి లేదు. అందరూ అద్భుతంగా తమ పాత్రల్ని పండిరచారు.
సాంకేతిక వర్గం:
మణిరత్నం ఈజ్‌ బ్యాక్‌ అనిపించడంలో నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులది కూడా ప్రధాన పాత్ర. రెహమాన్‌ సంగీతం, పి.సి.శ్రీరామ్‌ ఛాయాగ్రహణం మైనస్‌ చేసి చూస్తే ‘ఓకే బంగారం’ అంత మంచి ఫీలింగ్‌ కలిగించేది కాదు. మణి టేస్టుకు తగ్గట్లుగా అంత మంచి ఔట్‌పుట్‌ ఇచ్చారు వీళ్లిద్దరూ. వీరి ప్రతిభ గురించి, వీరి పనితనం గురించి మాటల్లో చెప్పడం కాదు.. తెరమీద చూస్తేనే ఆ గొప్పదనం అర్థమవుతుంది. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ కూడా సూపర్బ్‌. నిర్మాణ విలువలకు ఢోకా లేదు.
చివరిగా...
చూస్తున్నపుడు సింపుల్‌గా అనిపించి.. తర్వాత నెమ్మదిగా మన మనసుల్లోకి దూరిపోవడం మణిరత్నం సినిమాలకు మాత్రమే ఉన్న స్పెషల్‌ క్వాలిటీ. ‘ఓకే బంగారం’ కచ్చితంగా అలాంటి ఫీలింగ్‌ ఇస్తుంది. కాబట్టి ‘ఓకే బంగారం’ చూసి.. ఆ ఫీలింగ్‌ను మనసారా ఆస్వాదించండి.