Begin typing your search above and press return to search.

'మోసగాళ్లకు మోసగాడు' రివ్యూ

By:  Tupaki Desk   |   22 May 2015 10:42 AM GMT
మోసగాళ్లకు మోసగాడు రివ్యూ
X

చిత్రం- మోసగాళ్లకు మోసగాడు

రేటింగ్‌- 2.5/5

నటీనటులు- సుధీర్‌ బాబు, నందిని, అభిమన్యు సింగ్‌, చంద్రమోహన్‌, ప్రవీణ్‌, జయప్రకాష్‌ రెడ్డి, సప్తగిరి, దువ్వాసి మోహన్‌, పంకజ్‌ కేసరి, ఫిష్‌ వెంకట్‌ తదితరులు

ఛాయాగ్రహణం- సాయిప్రకాష్‌

సంగీతం- మణికాంత్‌ కద్రి

నిర్మాత- చక్రి చిగురుపాటి

రచన, దర్శకత్వం- బోస్‌ నెల్లూరి

అరంగేట్రం చేసి నాలుగేళ్లవుతున్నా.. హీరోగా నిలదొక్కుకోలేదు సుధీర్‌ బాబు. ప్రేమకథా చిత్రమ్‌ హిట్టయినా.. అది అతడికేమీ పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. ఈసారి హిట్టు హిట్టు, పేరుకు పేరు.. అన్న ధీమాతో 'మోసగాళ్లకు మోసగాడు'గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు సుధీర్‌. స్వామిరారాకు సీక్వెల్‌ అన్న ప్రచారంతో కొత్త దర్శకుడు బోస్‌ నెల్లూరి రూపొందించిన ఈ సినిమా సుధీర్‌ ఆశల్ని నెరవేర్చిందో లేదో చూద్దాం పదండి.

కథ: క్రిష్‌ (సుధీర్‌బాబు) ఓ దొంగ. చిన్న చిన్న మోసాలు చేస్తూ బతికేస్తుంటాడు. అతను జానకి (నందిని)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఐతే ఆమెకు క్రిష్‌ చేసే పనులు నచ్చవు. మోసాలు మానేయమంటుంది. సరే అని ఆమెకు మాటిచ్చిన సమయంలోనే ఓ విలువైన విగ్రహాన్ని తెచ్చిచ్చే డీల్‌ క్రిష్‌కు ఇస్తాడు కైలాష్‌ (జయప్రకాష్‌రెడ్డి) అనే డాన్‌. ఆ విగ్రహం తీసుకుని పారిపోయిన క్రిష్‌కు దాని జంట విగ్రహం ఉంటేనే దానికి విలువ అని తెలుస్తుంది. దీంతో రెండో విగ్రహం ఉన్న డాన్‌ రుద్ర (అభిమన్యు సింగ్‌) ఇంటికే వస్తాడు క్రిష్‌. మరి అతణ్ని బోల్తా కొట్టించి క్రిష్‌ విగ్రహాల్ని ఎలా సొంతం చేసుకున్నాడు? నందినికి మాట ఇచ్చాక కూడా అతనీ దొంగతనం ఎందుకు చేశాడు? ఈ డీల్‌ ద్వారా వచ్చిన డబ్బుతో ఏం చేశాడు? అన్నది మిగతా కథ.

కథనం, విశ్లేషణ: మోసగాళ్లకు మోసగాడు 'స్వామి రారా'కు సీక్వెల్‌ అని ప్రచారం చేశారు. కానీ విగ్రహం చుట్టూ తిరిగే కథ.. ఈ ఒక్క విషయంలో తప్ప ఏ రకంగానూ 'స్వామిరారా'తో 'మోసగాళ్లకు మోసగాడు'కు పోలిక లేదు. ఐతే స్వామిరారా తరహాలోనే మంచి ఆసక్తికరంగా మలిచేందుకు అవసరమైన ప్లాట్‌ రెడీ చేసుకున్నా.. కథనం ఆసక్తికరంగా రాసుకోకపోవడం వల్ల.. కథతో ట్రావెల్‌ కాని కామెడీ ట్రాక్‌ల వల్ల 'మోసగాళ్లకు మోసగాడు' ఓ మామూలు సినిమాగా మిగిలిపోయింది. మాస్‌ను ఎంటర్టైన్‌ చేసే కామెడీ అయితే ఉంది కానీ.. అది కథతో ఏమాత్రం కనెక్టవకపోవడమే ఈ సినిమాకున్న బలహీనత.

ప్రథమార్ధంలో హీరో హీరోయిన్ల లవ్‌ ట్రాక్‌ పేలవంగా ఉన్నప్పటికీ.. విగ్రహాలకు సంబంధించి పార్లల్‌గా సాగే ఎపిసోడ్‌ ఆసక్తి రేపుతుంది. రైల్వే స్టేషన్లో హీరో అందరికీ ఝలక్‌ ఇచ్చి విగ్రహాన్ని పట్టుకుపోయే సీన్‌ ప్రథమార్ధానికి మంచి ముగింపే. ఫస్టాఫ్‌లో అప్‌ అండ్‌ డౌన్స్‌ ఉన్నా.. ఇంటర్వెల్‌కు వచ్చేసరికి తర్వాత ఏం జరుగుతుందా అన్న ఆసక్తి కలుగుతుంది. ఈ ఆసక్తికి తగ్గట్లు.. ద్వితీయార్ధంలో కథనాన్ని పకడ్బందీగా నడిపించి ఉంటే.. 'మోసగాళ్లకు మోసగాడు' ఔట్‌ పుట్‌ మరోలా ఉండేది. కానీ దర్శకుడు బోస్‌ నెల్లూరి.. ద్వితీయార్ధాన్ని ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు నడిపించలేకపోయాడు.

రెండు విగ్రహాలు కలిసుంటే తప్ప విలువ ఉండదన్న పాయింట్‌లో లాజిక్‌ ఏంటో అర్థం కాదు. విలన్‌ ఇంటికే వచ్చిన హీరో.. సింపుల్‌గా విగ్రహాల్ని కొట్టేసి పట్టుకుపోయే ఛాన్స్‌ ఉన్నా.. ఎందుకు అక్కడే కాలక్షేపం చేస్తాడో అర్థం కాదు. ఏడాది ప్లాన్‌ చేసి విగ్రహాలు కొట్టేశామని ఓ సందర్భంలో విలన్స్‌ చెబుతారు. కానీ ఇంటర్నేషనల్‌ డాన్‌ అయిన విలన్‌, పాతిక కోట్లు పట్టుకుని ఇండియాకు వచ్చేసే బ్రిటీషోడు సహా అందరూ హీరో ముందు బఫూన్లే. డీల్‌ చేయడం కోసం రెండు కోట్లు పెట్టి ఒక బచ్చా రౌడీకి విలన్‌ పెళ్లి చేయడం సిల్లీగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో ఇలాంటి సిల్లీ సీన్స్‌ చాలా ఉన్నాయి. దర్శకుడు ద్వితీయార్ధాన్ని ఎలా నడపాలో తెలియని కన్ఫ్యూజన్‌లో పడిపోయాడు. హీరో విలన్‌ మధ్య ఎత్తులు పైఎత్తులతో కథనాన్ని ఆసక్తికరంగా నడిపిస్తాడనుకుంటే.. ఇద్దర్నీ ఒకే ఇంట్లో కూర్చోబెట్టి కామెడీ సీన్లతో కాలక్షేపం చేశాడు దర్శకుడు.

విలన్‌కు ఆరంభంలో భారీ బిల్డప్‌ ఇచ్చారు. కానీ తర్వాత అతణ్ని ఓ వెర్రి వెంగళప్పలా చూపించారు. పోలీస్‌ క్యారెక్టరూ అంతే. దీంతో హీరోకు ఎక్కడా ఏ ఇబ్బందీ రాకుండా అంతా అతడి ప్లాన్‌ ప్రకారం సాగిపోతుంది. ఉత్కంఠ కానీ, టెన్షన్‌ కానీ ఉండదు. దీంతో ప్రేక్షకుడు థ్రిల్‌ ఫీలవడానికి అవకాశం లేకపోయింది. జేపీ, దువ్వాసి కాంబినేషన్లో కామెడీ సీన్లు నవ్వులు పంచాయి. సినిమాకు హైలైట్‌ వాళ్లిద్దరి కామెడీనే. కానీ ఈ కామెడీ కథతో కనెక్టవలేదు. క్లైమాక్స్‌ను కూడా కామెడీగానే డీల్‌ చేశారు. చివర్లో హీరో ఎందుకిదంతా చేసింది చెబుతూ చిన్న ట్విస్ట్‌ ఇచ్చారు. కానీ అది ఊహించలేనిదేమీ కాదు. కథతో సంబంధం లేకుండా చంద్రమోహన్‌ ట్రాక్‌ నడుస్తున్నప్పుడే చివరికి హీరో ఏం చేస్తాడో జనాలు ఊహించేయగలరు. ఆఖర్లో మంచు మనోజ్‌ను దించారు. అదేం పెద్ద అట్రాక్షనేమీ కాదు.

నటీనటులు- సుధీర్‌ బాబు సినిమా సినిమాకు మెరుగవుతున్నట్లు కనిపిస్తున్నాడు కానీ.. ఇంకా పర్ఫెక్షన్‌కు దూరంగానే ఉన్నాడని అనిపిస్తుంది. డైలాగ్‌ డెలివరీ విషయంలో ఎంత కసరత్తు చేస్తున్నా ఇంకా ఎబ్బెట్టుగానే అనిపిస్తోంది. కొన్ని చోట్ల అతను చెప్పే డైలాగులు అర్థం కాలేదు. రాముడి విగ్రహం ముందు పెట్టుకుని డైలాగులు చెప్పేటపుడు అతడి బలహీనత బయటపడిపోయింది. లుక్‌, డ్యాన్సులు, ఫైట్ల విషయంలో ఆకట్టుకున్నాడు కానీ.. నటన పరంగా మాత్రం జస్ట్‌ ఓకే అనిపించాడంతే. హీరోయిన్‌ నందిని గురించి చెప్పడానికేమీ లేదు. అందం, అభినయం.. రెండింట్లోనూ ఆకట్టుకోలేదు. అసలు హీరోయిన్‌ లవ్‌ ట్రాక్‌ లేకుండా ఉంటే సినిమా చాలా బెటర్‌గా ఉండేదేమో. విలన్‌ అభిమన్యు సింగ్‌కు తన టాలెంట్‌ చూపించే అవకాశం రాలేదు. పోలీస్‌ క్యారెక్టర్లో చేసిన అంకిత్‌ కేసరి ఓవరాక్షన్‌ చేశాడు. అందర్లోకి జయప్రకాష్‌ రెడ్డి తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. ఆయన కామెడీ మాస్‌ను అలరిస్తుంది. దువ్వాసి కూడా ఆకట్టుకున్నాడు. ఫిష్‌ వెంకట్‌ ఆఖర్లో నవ్వించాడు. సప్తగిరిది వేస్ట్‌ క్యారెక్టర్‌.

సాంకేతికవర్గం- టెక్నికల్‌గా 'మోసగాళ్లకు మోసగాడు' ఏవరేజ్‌ అనిపించుంటుంది. మణికాంత్‌ కద్రి పాటల్లో సెకండాఫ్‌లో వచ్చే మెలోడీ బాగుంది. మిగతా పాటలు సోసోగా ఉన్నాయి. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ పర్వాలేదు. సాయిప్రకాష్‌ ఛాయాగ్రహణం ఓకే. మాటల్లో కొన్ని చోట్ల బూతులు శ్రుతి మించాయి. ''చెడు చేసేవాడు ఆలోచించాలి. కానీ మంచి చేసేవాడు చేసుకుంటూ పోవాలి''.. ఇలాంటి కొన్ని డైలాగులు పర్వాలేదు. స్వామిరారా సినిమాను తక్కువ బడ్జెట్‌లోనే క్వాలిటీతో తీసిన నిర్మాత.. 'మోసగాళ్లకు మోసగాడు' విషయంలో మాత్రం ఆ క్వాలిటీ చూపించలేకపోయాడు. నిర్మాణ విలువలు అంత గొప్పగా ఏమీ లేవు. బోస్‌ నెల్లూరి కామెడీ మీద గ్రిప్‌ చూపించాడు కానీ.. స్క్రీన్‌ప్లే విషయంలో నిరాశ పరిచాడు. ప్రేక్షకుడి అంచనాల్ని దాటి ఏమీ చేయలేకపోయాడు. ముందే ఊహించేయగల స్క్రీన్‌ప్లేనే సినిమాకు మైనస్‌ అయంది.

చివరగా- 'స్వామిరారా' స్థాయిలో ఊహించుకోకుండా కామెడీతో టైంపాస్‌ చేయాలనుకుంటే 'మోసగాళ్లకు మోసగాడు'పై ఓ లుక్కేయొచ్చు. థ్రిల్‌ కోసం వెళ్తే బండి నడవడం కష్టం.