Begin typing your search above and press return to search.

విజయవాడ మెట్రోకు అతి త్వరలో శ్రీకారం

By:  Tupaki Desk   |   6 July 2015 5:30 PM GMT
విజయవాడ మెట్రోకు అతి త్వరలో శ్రీకారం
X
విజయవాడలో మెట్రో రైలు పనులు ప్రారంభించడానికి సర్వం సిద్ధమైంది. అతి త్వరలోనే ఈ పనులకు డీఎంఆర్‌సీ శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు డీపీఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దానిని డీఎంఆర్‌సీకి కూడా పంపించింది. డీఎంఆర్‌సీ ఈనెల ఎనిమిదో తేదీన అంటే బుధవారం ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. ఆ భేటీలో విజయవాడ మెట్రో రైలు పనులు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనేది తేలిపోనుంది.

రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా నవ్యాంధ్రకు మూడు మెట్రో రైళ్లు ఇచ్చిన విషయం తెలిసిందే. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో మెట్రో రైళ్లకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వీటిలో విజయవాడలో తొలి విడతలో రెండు కారిడార్లకు అనుమతి వచ్చింది. పెనమలూరు సెంటర్‌ నుంచి మహాత్మగాంధీ రోడ్డు మీదుగా పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ వరకు ఒకటి.. నిడమానూరు నుంచి రైల్వే స్టేషన్‌ వరకు రెండో కారిడార్‌ నిర్ణయించారు. దీని నిడివి 26.76 కిలోమీటర్లు. దీనికి సంబంధించిన డీపీఆర్‌ పూర్తయింది. ఇక పనులు ప్రారంభించడమే తరువాయి. ఇది కూడా బుధవారం తేలిపోనుంది.

విజయవాడ మెట్రో రెండో దశలో నవ్యాంధ్ర రాజధాని తుళ్లూరుకు అనుసంధానం చేయనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఔట్‌లైన్‌ స్కెచ్‌ పూర్తయింది. పెనమలూరు, పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ వరకూ వెళ్లే మొదటి కారిడార్‌ నుంచి రాజధాని ప్రాంతానికి మెట్రో రైలును అనుసంధానం చేసే అవకాశం ఉంది. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ వచ్చిన తర్వాతే దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుందామని మెట్రో మాస్టర్‌ శ్రీధరన్‌ చెప్పిన నేపథ్యంలో ఇది తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ నెలలో మాస్టర్‌ ప్లాన్‌ కూడా వచ్చేస్తే రాజధానికి మెట్రోపైనా స్పష్టత రానుంది.