Begin typing your search above and press return to search.

మీడియాకు ఈ గ్లామర్‌ పిచ్చేంది బాసూ..!

By:  Tupaki Desk   |   4 July 2015 5:30 PM GMT
మీడియాకు ఈ గ్లామర్‌ పిచ్చేంది బాసూ..!
X
నలుగురికి చేతనైనంత మంచి చేసే ప్రయత్నంలో ఫుల్‌ బిజీగా ఉన్నట్లు కనిపించే మీడియాకు ఈ మధ్య కాలంలో కొత్త పిచ్చి పట్టిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విషయం ఏదైనా సరే..కాస్తంత గ్లామర్‌ కనిపించే విషయంలో చెలరేగిపోవటం.. మానవత్వం అన్నది పట్టకుండా గ్లామర్‌ మోజులో కెమేరాల్ని తళుకుబెళుకులకే పరిమితం చేయటం కనిపిస్తుంది.

గురువారం జరిగిన విషయాన్నే తీసుకుందాం. మోతాదు మించిన వేగంతో ప్రయాణిస్తున్న ఎంపీ హేమమాలిని కారు.. ఒక టైర్ల వ్యాపారం చేసుకునే కుటుంబానికి చెందిన వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ విషయంలో మరో ఆరోపణ కూడా ఉంది. టైర్ల వ్యాపారి వాహనం రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తుందన్నది.

దీన్లో నిజానిజాల మీద దృష్టి పెట్టటం.. ఈ ఉదంతంలో మృత్యువాత పడ్డ మూడేళ్ల చిన్నారి విషయాన్ని మీడియా పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. ఈ ఘటనలో ఒక చిన్నారి మృతి చెందిందన్న మానవీయ అంశాన్ని వదిలేసి.. గ్లామర్‌కు పర్యాయపదంగా కనిపించే హేమమాలిని ముక్కు పచ్చడి కావటం.. ఆమె ముఖం రక్తంతో తడిచి ఉండటం.. లాంటి ఫోటోల్ని ప్రముఖంగా ప్రచురించారు.

ఇక.. వార్తల విషయానికి వస్తే.. హేమమాలిని ముక్కుకు ఎన్ని కుట్ల పడ్డాయి..? ఆమెను ఏ ఆసుపత్రిలో ఏ వార్డులో చికిత్స చేస్తున్నారు? ఆమె ముక్కు మీద వేసిన కుట్ల కారణంగా మచ్చ అలా ఉండిపోతుందా? ఆమె ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుంటారా? ఒకవేళ చేయించుకుంటే దాన్ని ఎక్కడ చేయించుకునే అవకాశం ఉందన్న చిత్రవిచిత్రమైన విషయాల మీదనే మీడియా ఫోకస్‌ చేసింది.

అంతేకానీ.. ప్రమాద సమయంలో హేమమాలినిని ఆసుపత్రికి తరలించేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శించి.. యుద్ధప్రాతిపదికన సాయం అందించిన వారు.. తీవ్రంగా గాయపడిన మూడేళ్ల పాప గురించి మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. అంత పెద్ద నటీమణి.. రాజ్యసభ సభ్యురాలు తన ముక్కుకు అయిన గాయాన్ని చూసుకొని బెంబేలెత్తి పోయారే కానీ.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పసిదాన్ని రక్షించుకోవాలన్న ఆలోచన అక్కడి వారికే కాదు.. హేమమాలిని లాంటి పెద్ద మనిషికి కూడా రాలేదు.

నిజానికి హేమమాలినిని ఆసుపత్రికి తరలించే సయంలోనే చిన్నారిని కూడా తరలించి ఉంటే తను బతికే అవకాశాలు ఎక్కువగా ఉండేవన్న వాదన వినిపిస్తోంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అటువైపు ప్రయాణిస్తున్న ఒక వైద్యుడు హేమమాలిని జైపూర్‌ తీసుకెళ్లారే కానీ.. చిన్నారిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించలేదు. సగటు మనిషికి గ్లామర్‌ మీద మోజు మాదిరే.. మీడియాకు కూడా మానవత్వం కంటే గ్లామర్‌ మీదనే మోజు ఎక్కువన్న విషయం హేమమాలిని ఎపిసోడ్‌లో మరోసారి నిరూపితమైంది.