Begin typing your search above and press return to search.

ప్రేమకు అసలుసిసలు నిర్వచనం చెప్పాడు

By:  Tupaki Desk   |   29 Jun 2015 5:21 AM GMT
ప్రేమకు అసలుసిసలు నిర్వచనం చెప్పాడు
X
ప్రేమంటే.. ఈ మాటకు సూటిగా.. స్పష్టంగా ఒక్క మాటలో ఎవరూ సమాధానం చెప్పలేరు. కానీ.. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ఎలాంటి సమయంలోనైనా అండగా ఉండటం కూడా ప్రేమే. నచ్చింది సొంతం చేసుకోవాలనే తపన కూడా ప్రేమలా భావించే ఈ రోజుల్లో.. ప్రేమకు సరికొత్త నిర్వచనం చెప్పాడో యువకుడు.

తాను ప్రేమించిన అమ్మాయి గ్యాంగ్‌రేప్‌నకు గురై.. మానసికంగా గాయపడిన ప్రియురాలికి ధైర్యం చెప్పటమే కాదు.. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడో ప్రేమికుడు. జరిగిందో పీడకలగా భావించమని చెప్పటమే కాదు.. ప్రేమించిన అమ్మాయికి ఎలాంటి పరిస్థితుల్లో అయినా అండగా నిలవటం.. జీవితాంతం తోడుగా ఉండటమే నిజమైన ప్రేమగా చేతల్లో చేసి చూపించాడో యువకుడు.

అతడే.. గుంటూరు జిల్లా కొల్లూరు గ్రామానికి చెందిన మున్నంగి రాజేశ్‌. పక్కపక్క ఇళ్లల్లో ఉండే రాజేశ్‌.. సదరు యువతి కొద్దికాలంగా ప్రేమించుకున్నారు. యువతికి తల్లిదండ్రులు లేరు. రాజేష్‌కు తల్లి లేదు. ఈ క్రమంలో ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకోవాలని భావించి శనివారం రాత్రి వేమూరు రైల్వే స్టేషన్‌కు వచ్చారు. ఆ సమయంలో పోలీసులమంటూ ప్రేమజంటను బెదిరించి.. సదరు యువతిని బలవంతంగా తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్‌కి పాల్పడ్డారు.

తనను నమ్మి తనతో పాటు వచ్చి.. కొందరు కామాంధుల చేతికి చిక్కి బలైన యువతి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకూడదని భావించిన రాజేష్‌.. గ్యాంగ్‌ రేప్‌ ఘటన జరిగిన ఒక రోజులోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతడి నిర్ణయానికి ఆమె సైతం ఓకే చెప్పటంతో.. ఈ ఆదర్శ వివాహం ఆదివారం జరిగింది. ఆదివారం సాయంత్రం కొల్లూరు చర్చిలో వీరిద్దరూ ఏకమయ్యారు.ఈ వివాహానికి పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు.

ఇక.. సదరు యువతిపై అత్యాచారం చేసిన ఆర్మీ ఉద్యోగి సుధాకర్‌తో పాటు.. మరొకరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిజమైన ప్రేమ అంటే ఏమిటో చేతల్లో చూపించాడంటూ రాజేష్‌ గురించి పలువురు చెప్పుకోవటం కనిపించింది.