Begin typing your search above and press return to search.

ఆ సినిమాలన్నీ అడ్రస్‌ లేకుండా పోయాయి

By:  Tupaki Desk   |   7 July 2015 10:18 AM GMT
ఆ సినిమాలన్నీ అడ్రస్‌ లేకుండా పోయాయి
X
పోయిన శుక్రవారం అరడజనుకు పైగా తెలుగు సినిమాలు విడుదలయ్యాయి. రెండు మూడు డబ్బింగ్‌ సినిమాలు కూడా దండెత్తాయి. కానీ వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబడలేదు. ఉన్నంతలో సూపర్‌ స్టార్‌ కిడ్నాప్‌ సినిమాకు మంచి టాక్‌ వచ్చింది. కానీ మరీ అన్యాయంగా ఆ సినిమాకు నాలుగో, ఐదో థియేటర్లిచ్చారు. అందులో నాలుగు షోలు పడుతున్న థియేటర్‌ ఒక్కటే. మిగతావన్నీ ఒకటీ అరా షోలే. మిగతా సినిమాల గురించి మాట్లాడే నాథుడు లేడు. బస్తీ సినిమాకు భారీగా థియేటర్లిచ్చారు కానీ.. ఆ సినిమా చెత్త అన్న టాక్‌ వచ్చింది. అయినా థియేటర్లు ఖాళీ చేయలేదు. దీంతో సూపర్‌ స్టార్‌ కిడ్నాప్‌ సినిమా పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇక గ్యాంగ్‌ ఆఫ్‌ గబ్బర్‌సింగ్‌, ఓ చెలియా నా ప్రియసఖియా, యూత్‌ఫుల్‌ లవ్‌, ది బెల్స్‌, మాయాచిత్రం లాంటి సినిమాల గురించి చెప్పుకోవడానికేమీ లేదు.

ఈ సినిమాల టాక్‌ అడిగేవాడు లేడు, చెప్పేవాడూ లేడు. తమిళ డబ్బింగ్‌ మూవీ శీనుగాడి లవ్‌ స్టోరీ పరిస్థితి కూడా భిన్నంగా ఏమీ లేదు. టెర్మినేటర్‌ సిరీస్‌లో వచ్చిన కొత్త సినిమాలో ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌ నటించినా పెద్దగా ఫలితం లేకపోయింది. వచ్చే వారం బాహుబలి విడుదలవుతుండటంతో ఈ వారం ఓ మోస్తరు సినిమా కూడా ఏదీ విడుదల కాలేదు. దీంతో దొరికింది సందు అని.. చిన్నా చితకా సినిమాలన్నీ థియేటర్లలోకి దిగిపోయాయి. బాహుబలి వచ్చాక వీటి అడ్రస్‌ గల్లంతయిపోతుందిలే అనుకున్నారు కానీ.. అంతకంటే ముందే వీటి పనైపోయింది. ఇప్పుడు జనాలు మళ్లీ టైగర్‌, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ, కేరింత 'పాత' సినిమాలతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ గురువారంతో వీటి పని కూడా ఖతం అయిపోతుందనుకోండి!