Begin typing your search above and press return to search.

''కేసీఆర్‌ సర్కారుకు వ్యతిరేకం'' అనేసిన కోదండరాం

By:  Tupaki Desk   |   25 May 2015 4:57 AM GMT
కేసీఆర్‌ సర్కారుకు వ్యతిరేకం అనేసిన కోదండరాం
X
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేసీఆర్‌తో పాటు కలిసి పని చేసి.. ఓ రకంగా తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని తన భుజాల మీద వేసుకొని నడిపిన ప్రొఫెసర్‌ కోదండరాం తొలిసారి తెలంగాణ అధికారపక్షం తీసుకున్న ఒక నిర్ణయంపై అసంతృప్తిని బాహాటంగా ప్రకటించటమే కాదు.. తాను కేసీఆర్‌ సర్కారుకు వ్యతిరేకమని వ్యాఖ్యానించారు.

పేదలకు ఇళ్లు కట్టించేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం భూముల్ని వినియోగిస్తామని తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యానించటం.. దీన్ని ఉస్మానియా విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించటం.. ఈ నేపథ్యంలో పేదలకు ఇళ్లు కట్టిస్తామంటే అడ్డుకుంటారా? నేను చాలా మొండోడ్ని.. అయినా విద్యార్థులు మెచ్యురిటీ లేకుండా మాట్లాడుతున్నారంటూ ఉస్మానియా విద్యార్థులపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విరుచుకుపడటం లాంటివి వరుసగా జరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో.. ''ఓయూ భూములు కాపాడుకుందాం.. భావితరాల విద్యార్థులకు భవిష్యత్తు ఇద్దాం'' అనే నినాదంతో పాటు.. ఉద్యోగాలు భర్తీ చేయాలన్న డిమాండ్‌తో ఓయూలో ఒక సభ నిర్వహించారు. ఈ సభలో ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడారు. ఓయూ భూములు తీసుకునే ప్రతిపాదన విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి తాను వ్యతిరేకమని ఆయన వ్యాఖ్యానించారు.

పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వటం మంచిదేనని.. కానీ వర్సిటీ భూములను మాత్రం విద్యా సంబంధ.. పరిశోధనలకు మాత్రమే వాడుకోవాలని అభిప్రాయపడ్డారు. ఓయూ భూముల్ని పేదల ఇళ్ల కోసం ఇవ్వటాన్ని తప్పు పట్టిన కోదండరాం.. ఉద్యోగాల నోటిఫికేషన్‌కు కమల్‌నాథన్‌ కమిటీకి ముడిపెట్టటంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. కమల్‌నాథన్‌ కమిటీ పరిధిలో లేని ఉద్యోగాల్ని ఈ లోపు భర్తీ చేయొచ్చుగా అంటూ ప్రశ్నించారు.

తెలంగాణరాష్ట్రం ఆవిర్భవించిన జూన్‌ 2 నాటికి ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదలవుతుందన్న ఆశాభావంతో పాటు.. అల్టిమేటం ఇచ్చినట్లుగా మాట్లాడారు. కేసీఆర్‌ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాల మీద అసంతృప్తితో వ్యవహరిస్తున్న ఈ మధ్య అప్పుడప్పుడు పరోక్ష వ్యాఖ్యలు చేసిన కోదండరాం.. తాజాగా సూటిగా తెలంగాణ సర్కారుకు తాను వ్యతిరేకమన్న వ్యాఖ్యలు చేయటం చూసినప్పుడు.. రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కొంగొత్త మార్పులు చోటు చేసుకోవటం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది.