Begin typing your search above and press return to search.

టీఆర్‌ఎస్‌, బీజేపీ పొత్తు: ఆయన పరిధిలో లేదట

By:  Tupaki Desk   |   26 May 2015 4:34 AM GMT
టీఆర్‌ఎస్‌, బీజేపీ పొత్తు: ఆయన పరిధిలో లేదట
X
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఒక్కోసారి చాలా స్పష్టతతో వ్యవహరిస్తున్నట్లు ఉంటారు. తనకు సంబంధించని విషయం ఎందుకు మాట్లాడాలి... తర్వాత అనవసర చిక్కులు ఎందుకు తెచ్చుకోవాలి అనే విధంగా ఆయన ఆచితూచి మాట్లాడుతుంటారు. టీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీకి దగ్గరవుతుందన్న సంకేతాల గురించి ప్రస్తావించగా కిషన్‌ రెడ్డి మరోమారు తన లౌక్యాన్ని ప్రదర్శించారు.


కేంద్ర ప్రభుత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టీ చేరికపై ఎన్డీఏదే తుది నిర్ణయమని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. తమతో టీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకోవడం అనే అంశం తన పరిధిలో లేదని, ఎన్డీఏ పెద్దలే తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఎన్డీఏలో టీఆర్‌ఎస్‌ చేరితే బీజేపీతో బంధాన్ని తెంచుకుంటామంటూ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా... ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగమన్నట్లుగా టీడీపీ నేతల తీరు ఉందన్నారు.



ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడతారంటూ కొన్ని పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలను కిషన్‌ రెడ్డి కొట్టిపారేశారు. తమ పార్టీ నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఏడాది పాలనలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో అభివృద్ధిని సాధించిందన్నారు. మోదీ 18 దేశాలు పర్యటించి, అనేక ఒప్పందాలు చేసుకున్నారని, లక్ష కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేశారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏడాది పాలనకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ జీరో మార్కులు వేయడాన్ని ప్రస్తావిస్తూ... రాహుల్‌ కితాబులు, ఓటు తమకు అక్కర్లేదన్నారు. అసలు రాహుల్‌గాంధీకి ఉన్న రాజకీయ అవగాహన ఏమిటని ప్రశ్నించారు. ఆయనకు ప్రజా సమస్యలు ఏం తెలుసు, పథకాలపై ఉన్న ఆలోచన ఏమిటంటూ దెప్పిపొడిచారు.


గతంలో టీడీపీ,బీజేపీ పొత్తు విషయంలో ఊహజనిత వ్యాఖ్యలు చేసి పలుచన అయిన కిషన్‌ రెడ్డి ఇపుడు కూడా ఆ పరిస్థితి ఎందుకని ముందు జాగ్రత్త పడుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.