Begin typing your search above and press return to search.

రేవంత్‌ భాష సభ్య సమాజం సిగ్గు పడేలా ఉందట

By:  Tupaki Desk   |   2 July 2015 5:23 AM GMT
రేవంత్‌ భాష సభ్య సమాజం సిగ్గు పడేలా ఉందట
X
తెలుగు రాజకీయాల్ని క్లాస్‌ నుంచి మాస్‌కు పరిచయం చేసిన గొప్పతనం దివంగత ఎన్టీవోడిదే. ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టే వరకూ కూడా రాజకీయాలన్నవి ఒక బ్రహ్మపదార్థంగా భావించేవారు. కొందరు నేతలు ఉండటం.. వారు రాజకీయాలు నడిపించటం మాదిరిగా ఉండేవి. ఇంకా చెప్పాలంటే కులమే అధికార కుర్చీలో కూర్చునేదన్నట్లుగా ఉండేదన్న విమర్శ కూడా ఉండేది.

ఇక.. రాజకీయ నేతలు ఆచితూచి మాట్లాడుకుంటే.. వీలైనంత హుందాగా ఉండేవారన్న పేరుంది. ఎప్పుడైతే ఎన్టీవోడు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారో.. సామాన్య ప్రజలు కూడా రాజకీయాల్లో మమేకం కావటమే కాదు.. వాటి మీద విపరీతమైన ఆసక్తిని పెంచుకున్న పరిస్థితి. అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగే సరికొత్త పద్ధతికి.. సినిమాటిక్‌ డైలాగుల సంస్కృతికి ఎన్టీవోడు నాంది పలికారని చెబుతుంటారు.

అలా మొదలైన విమర్శల దాడికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ ఓ రేంజ్‌కి తీసుకెళితే.. తాజాగా రేవంత్‌ రెడ్డి లాంటి నేత మాటల్లాంటి తిట్లు.. పరుష వ్యాఖ్యలు మరోస్థాయికి తీసుకెళ్లిన పరిస్థితి. ఓటుకు నోటు కేసులో బెయిల్‌ మీద బయటకు వచ్చిన రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగంలో మాటలు తక్కువ.. తిట్లు ఎక్కువన్నట్లుగా సాగిందన్న అభిప్రాయం సాగింది. దూకుడు రాజకీయాలు నడుస్తున్న ఈ జమానాలోతమను తిట్టి పారేస్తున్న టీఆర్‌ఎస్‌ నేతల్ని.. అడ్డగోలుగా తిట్టేయాలన్న కసి రేవంత్‌ మాటల్లో వినిపించింది.

రేవంత్‌ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్‌ స్పందించారు. రేవంత్‌ భాష సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన రేవంత్‌రెడ్డి జైలు నుంచి విడుదలైతే టీడీపీ సంబర పడిపోతోందని ఎద్దేవా చేసిన కర్నే.. ఎవరైనా జైలుకు వెళితే పశ్చాత్తాప పడతారని.. రేవంత్‌ ప్రవర్తన చిల్లరగా ఉందన్నారు. మొత్తానికి రేవంత్‌ తన మాటలతో టీఆర్‌ఎస్‌ నేతల ఒళ్లు మండేలా చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.