Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ మెడికల్‌ని పట్టించుకోవడం లేదా!?

By:  Tupaki Desk   |   25 May 2015 12:43 PM GMT
కేసీఆర్‌ మెడికల్‌ని పట్టించుకోవడం లేదా!?
X


ఇంజనీరింగ్‌ కాలేజీలపై ఉక్కుపాదం మోపి.. దానిని దారిలోకి పెట్టడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి మెడికల్‌ కాలేజీలకు మాత్రం అపరిమిత స్వేచ్ఛను ఎందుకు ఇచ్చారనే ప్రశ్న విద్యావర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇంజనీరింగ్‌తోపాటు మెడికల్‌ కూడా సమాజంపై అత్యంత తీవ్ర ప్రభావం చూపే అంశాలని, మెడికల్‌ విషయంలో ప్రభుత్వాలు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భవిష్యత్తులో ప్రాణాలే గాలిలో కలిసిపోతాయని వివరిస్తున్నారు.

తెలంగాణలో ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు తమ ఫీజులు తాము నిర్ణయించుకుని పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అయితే, మెడికల్‌ కాలేజీల్లో అడ్మిషన్లకు సంబంధించిన ప్రవేశ పరీక్షను మాత్రం ప్రభుత్వ పర్యవేక్షణలోనే నిర్వహించాలని షరతు విధించింది. అయితే, తీరా, పరీక్ష నిర్వహించే సమయం వచ్చేసరికి ప్రభుత్వం దానిపై నియంత్రణను గాలికి వదిలేసింది. మీ ఇష్టం వచ్చినట్లు పరీక్ష నిర్వహించుకోండి. మీ ఇష్టం వచ్చినట్లు మార్కులు వేసుకోండి. మీ ఇష్టం వచ్చిన వారికి సీట్లు ఇచ్చుకోండి. అందుకు మీ ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేసుకోండి. ఈ మొత్తం ప్రక్రియతో మాకు ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది.

ప్రవేశ పరీక్ష విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటే.. డబ్బున్నవాళ్లు మెడికల్‌ సీట్లు తెచ్చుకుంటారు. చదవకపోయినా మార్కులు వేయించుకుంటారు. పరీక్ష పాసయినట్లు సర్టిఫికెట్‌ కూడా కొనుక్కుంటారు. ఆ తర్వాత సమాజంపై పడతారు. ప్రైవేటు క్లీనిక్కులు పెట్టి జనాన్ని చంపేస్తారు. చంపేసి మరీ దోచుకుంటారు. భవిష్యత్తులో తెలంగాణ సమాజంలో ఈ పరిణామం అత్యంత దారుణ పరిస్థితికి దారితీస్తుందనే ఆందోళన విద్యావేత్తలో నెలకొంది.

ఇంజనీరింగ్‌ కాలేజీల పీచమణచడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యంత సమర్థంగా వ్యవహరించారని, ఈ విషయంలో సొంత పార్టీ నేతల కాలేజీలను కూడా వదలలేదని, ఇప్పుడు మెడికల్‌ కాలేజీల విషయంలో కూడా ఆయన అంతే సమర్థంగా వ్యవహరించాలని కోరుతున్నారు.